Adani On Hindenburg: ఒక్క రోజులో లక్ష కోట్ల నష్టం - అదానీకి కోపమొచ్చింది!
Adani On Hindenburg: అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై అదానీ గ్రూప్ చట్టపరంగా చర్యలు తీసుకోనుంది. తమ కంపెనీ అకౌంటింగ్ ప్రమాణాల్లో లోపాలపై ఇచ్చిన నివేదిక అవాస్తవమంది.
Adani On Hindenburg:
అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై అదానీ గ్రూప్ చట్టపరంగా చర్యలు తీసుకోనుంది. తమ కంపెనీ అకౌంటింగ్ ప్రమాణాల్లో లోపాలు, అవకతవకలు ఉన్నాయంటూ ఇచ్చిన నివేదిక అవాస్తవమని వెల్లడించింది. అమెరికా, భారత చట్టాలను అనుసరించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బుధవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు రూ.లక్ష కోట్ల మేర నష్టపోయిన సంగతి తెలిసిందే.
'అమెరికా, భారత చట్టాలను అనుసరించి హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌పై చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు న్యాయ వ్యవస్థలోని వివిధ నిబంధనలను పరిశీలిస్తున్నాం' అని అదానీ గ్రూప్ న్యాయ విభాగాధిపతి జతిన్ జలుంధ్‌వాలా అన్నారు. హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక లోపభూయిష్ఠంగా ఉందన్నారు. ఇది అనుమానాస్పదంగా ఉందని, ఎలాంటి పరిశోధన చేయలేదని పేర్కొన్నారు. ఒక విదేశీ సంస్థ దురుద్దేశ పూర్వకంగా ఇన్వెస్టర్ల కమ్యూనిటీ, సాధారణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించిందని వెల్లడించారు. కంపెనీ గుడ్‌విల్, పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందన్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవోను దెబ్బకొట్టాలన్న ఉద్దేశం కనిపిస్తోందన్నారు.
'భారత స్టాక్ మార్కెట్లను తీవ్ర ఒడుదొడుకులకు గురి చేసిన హిండెన్‌బర్గ్ నివేదికను తీవ్రంగా పరిగణించాలి. ఇది భారత పౌరుల్లో అనవసర ఆందోళనలను సృష్టించింది' అని అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ షేర్ల పతనం నుంచి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్టు స్వయంగా ఆ కంపెనీయే అంగీకరించిందని వెల్లడించింది. ఈ ఉద్దేశంతోనే కంపెనీ షేర్ల విలువను తగ్గించేలా నివేదిక రూపొందించారని స్పష్టం చేసింది. శుక్రవారం మొదలయ్యే ఎఫ్‌ఈవోకు నష్టం కలిగించేందుకే ఇలా చేశారని తెలిపింది.
హిండెన్‌బర్గ్ నివేదిక వల్ల బుధవారం భారత స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు వచ్చాయి. బెంచ్‌మార్క్ నుంచి అన్ని రంగాల సూచీలు కుదేలయ్యాయి. ఇక అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 10 శాతం వరకు పతనమయ్యాయి. మొత్తం పది కంపెనీలు రూ.96,672 కోట్ల మార్కెట్ విలువను చేజార్చుకున్నాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ 9 శాతం, అంబుజా సిమెంట్స్ 8 శాతం నష్టపోయాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ నాలుగో స్థానానికి వచ్చారు. ఇప్పుడాయన సంపద 113 బిలియన్ డాలర్లుగా ఉంది.
తన నివేదికలో, అదానీ గ్రూప్‌లోని అకౌంటింగ్, కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యల గురించి హిండెన్‌బర్గ్ ప్రస్తావించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 8 సంవత్సరాల కాలంలో 5 మంది చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లను మార్చిందని, ఇది అకౌంటింగ్ సమస్యలను సూచించే కీలకమైన రెడ్ ఫ్లాగ్" అని ఆ కంపెనీ పేర్కొంది.
యూఎస్ ట్రేడెడ్ బాండ్స్, 'నాన్ ఇండియన్ ట్రేడెడ్ డెరివేటివ్స్' ద్వారా అదానీ గ్రూప్ కంపెనీలను షార్ట్ సెల్లింగ్ చేస్తున్నట్లు హిండెన్‌బర్గ్ ఇటీవల వెల్లడించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.