Smart Phones: ఎందుకు వాడుతున్నారో తెలియదు- భారతీయుల ఫోన్ వాడకంపై సంచలన రిపోర్ట్
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG), ఇటీవల, ఇండియాలోని జనంపై ఒక స్డడీ చేసింది. ఆ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
Smart Phone Users In India: ఇప్పుడు, మన దేశంలో మెజారిటీ ప్రజల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం.. మన దేశంలో స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు పైమాటేనట.
టెక్నాలజీ మారుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ కూడా వాయువేగంతో మారిపోతున్నాయి. టచ్ ఫోన్లలోనే ఫ్లిప్, ఫోల్డబుల్ మోడల్స్ వచ్చాయి. డెస్క్ టాప్ కంప్యూటర్‌కు అవసరమైన సైజ్‌లోని ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్, గ్రాఫిక్ కార్డ్స్ వంటివి అరచేతిలో ఇమిడే మొబైల్ పరికరంలోకి వచ్చేశాయి. ఇప్పుడు కొత్తగా.. కెమెరా నుంచి చిప్ సెట్ వరకు ప్రతి దానికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తోడవుతోంది. వీటివల్ల రోజుకో కొత్త మోడల్ ఫోన్ మార్కెట్‌లోకి వస్తోంది.
కొత్తొక వింత, పాతొక రోత అన్న సామెత స్మార్ట్ ఫోన్లకు సరిగ్గా సరిపోతోంది. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఒక కొత్త మోడల్ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడల్లా జనం దాని వెంట పడుతున్నారు. రేటు ఎక్కువైనా పర్లేదు, చేతిలో లేటెస్ట్ ఫోన్ ఉండాలని కోరుకుంటున్నారు.
భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదార్లపై అధ్యయనం చేసిన బీసీజీ
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG), ఇటీవల, ఇండియాలోని జనంపై ఒక స్డడీ చేసింది. ఆ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
భారతీయ స్మార్ట్ ఫోన్ యూజర్లలో దాదాపు సగం మందికి, తాము స్మార్ట్ ఎందుకు వాడుతున్నారో కూడా తెలీదు. అంటే, ఎలాంటి కారణం లేకుండానే స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌ను తరచూ చేతిలోకి తీసుకోవడం ఒక అసంకల్పిత ప్రతీకర చర్యలా మారింది. అంటే.. తమ ప్రమేయం లేకుండానే ఫోన్‌ను చేతితో తాకుతున్నారు లేదా చేతిలోకి తీసుకుంటున్నారు. యూజర్‌కు తెలీకుండా ఆ వ్యక్తి చెయ్యి ఫోన్ మీదకు వెళ్తోంది, వేళ్లు బ్రౌజ్ చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందని BCG ప్రశ్నిస్తే, భారతీయుల నుంచి వచ్చిన సమాధానాలు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. "మాకు తెలీదు", "ఊరికే అలా జరిగిపోతోంది".. ఇలాంటి సమాధానాలే వచ్చాయట.
"స్మార్ట్ ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటున్న భారతీయుల్లో 50 శాతం మంది, అనుకోకుండానే ఆ పని చేస్తున్నారని మా పరిశోధనలో తేలింది. వాళ్లు అనాలోచితంగా స్మార్ట్ ఫోన్ పట్టుకుంటున్నారు" - కనికా సంఘీ, కస్టమర్ ఇన్‌సైట్స్ ఇండియా సెంటర్, BCG.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, తమ అధ్యయనం కోసం వెయ్యి మందికి పైగా భారతీయులను ప్రశ్నించింది. స్మార్ట్ ఫోన్ వినియోగ అలవాటు, అవసరం గురించి ఆరా తీసింది.
BCG నివేదిక ప్రకారం, ఫోన్‌ను తీసుకునే సందర్భాల్లో.. దాదాపు 55 శాతం సమయాల్లో, ఎందుకోసం ఫోన్ పట్టుకున్నారో ఆ యూజర్‌కు స్పష్టత లేదు. దాదాపు 50 శాతం సందర్భాల్లో మాత్రమే పూర్తి చేయాల్సిన పనిపై స్పష్టత ఉంది, 5 నుంచి 10 శాతం సందర్భాల్లో పాక్షికంగా స్పష్టత ఉంది.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనంలోని మరికొన్ని వివరాలు
- ఒక సాధారణ వినియోగదారు రోజుకు దాదాపు 70 నుంచి 80 సార్లు తమ స్మార్ట్ ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటున్నాడు.
- స్మార్ట్ ఫోన్ వినియోగంలో.. సోషల్ మీడియాలో గడపడం, షాపింగ్ చేయడం, సెర్చ్ చేయడం, గేమింగ్ వంటివి ప్రాధాన్యత క్రమంలో ఉన్నాయి.
- ఫోన్ వాడుతున్న సందర్భంలో దాదాపు 50 నుంచి 55 శాతం సమయాన్ని స్ట్రీమింగ్ యాప్‌ల కోసం వెచ్చిస్తున్నారు. గేమింగ్, షాపింగ్ కోసం 5-8 శాతం టైమ్ కేటాయిస్తున్నారు.
- దాదాపు 84 శాతం మంది వినియోగదార్లు, తాము నిద్ర లేచిన 15 నిమిషాల్లోపే ఫోన్ చెక్ చేసుకుంటున్నారు.
మరో ఆసక్తికర కథనం: పేటీఎంపై దయ చూపే ఛాన్సే లేదు, చివరి తలుపునూ మూసేసిన ఆర్‌బీఐ