మూడేళ్ల తర్వాత ఇండియాలోకి రెనాల్ట్ డస్టర్ రీ ఎంట్రీ - 2026లో రెండు కొత్త SUVలతో దూకుడు
2026లో రెనాల్ట్ ఇండియాలో రెండు కొత్త SUVలను లాంచ్ చేయనుంది. కొత్త జనరేషన్ డస్టర్‌తో పాటు 7 సీటర్ SUV రానుంది. ధరలు, ఇంజిన్ ఆప్షన్లు, లాంచ్ టైమ్‌లైన్ వివరాలు ఇవే.

Upcoming Renault Cars 2026 India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో 2026 సంవత్సరం మరింత ఆసక్తికరంగా మారబోతోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో పోటీ మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో, ఫ్రెంచ్ కార్ తయారీదారు రెనాల్ట్ కూడా తన ప్లాన్‌లను స్పష్టంగా అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇండియాలో Kwid, Kiger, Triber మోడళ్లతో మాత్రమే కొనసాగుతున్న రెనాల్ట్, 2026లో మాత్రం రెండు పూర్తిగా కొత్త SUVలతో మార్కెట్‌లో తన ఉనికిని బలంగా చూపించనుంది.
ఇవాటిలో ముఖ్యమైనది – ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై మంచి గుర్తింపు సంపాదించిన డస్టర్. 2022లో ఆగిపోయిన ఈ పేరు, మూడేళ్ల విరామం తర్వాత ఇప్పుడు పూర్తిగా కొత్త అవతారంలో తిరిగి రానుంది.
కొత్త రెనాల్ట్ డస్టర్ – లాంచ్ టైమ్‌లైన్, అంచనా ధర
రెనాల్ట్ డస్టర్ కొత్త జనరేషన్ మోడల్‌ను 2026 మొదటి త్రైమాసికంలో (Q1 2026) ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా రిపబ్లిక్ డే 2026 సమయానికి ఈ SUV లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ధర విషయానికి వస్తే, కొత్త డస్టర్ రూ. 11 లక్షల నుంచి రూ. 19 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్ ధర) ఉండొచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌లలో అమ్ముతున్న డస్టర్‌తో పోలిస్తే, ఇండియాకు వచ్చే వెర్షన్ మరింత ప్రీమియంగా ఉండనుందని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. ఇంటీరియర్ ఫినిష్, అప్హోల్స్టరీ, ఫీచర్ల విషయంలో లగ్జరీ టచ్ కనిపించే అవకాశం ఉంది.
ఇంజిన్ ఆప్షన్లు – శక్తిమంతమైన టర్బో పెట్రోల్
కొత్త డస్టర్ ఇంజిన్ వివరాలను రెనాల్ట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, 1.3 లీటర్ HR13 టర్బో పెట్రోల్ ఇంజిన్ (సుమారు 156hp పవర్) ఇవ్వే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ ఇంజిన్‌తో పాటు మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి రావచ్చు.
ఎంట్రీ లెవల్ వేరియంట్ల కోసం ప్రస్తుతం కిగర్‌లో ఉన్న 1.0 లీటర్ మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను స్వల్ప పవర్ అప్‌డేట్‌తో ఉపయోగించే అవకాశం ఉంది. అంతేకాదు, దేశీయంగా అభివృద్ధి చేస్తున్న హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కూడా 2026 చివరి నాటికి పరిచయం అయ్యే ఛాన్స్ ఉంది.
రెనాల్ట్ 7 సీటర్ SUV – పెద్ద కుటుంబాలకు కొత్త ఆప్షన్
డస్టర్‌తో పాటు, రెనాల్ట్ మరో కీలక మోడల్‌ను కూడా సిద్ధం చేస్తోంది. అదే... కొత్త 7 సీటర్ SUV. ఇది డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారవుతుందని, 2026 నాలుగో త్రైమాసికంలో (Q4 2026) లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ SUV ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉండొచ్చని అంచనా. డిజైన్ పరంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న Boreal లేదా Bigster మోడళ్ల నుంచి ప్రేరణ తీసుకునే అవకాశం ఉంది. పొడవైన బాడీ, మూడు వరుసల సీట్లు, ప్రత్యేకమైన స్టైలింగ్ ఎలిమెంట్స్ ఈ SUVకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇంజిన్, పేరు విషయంలో ఇంకా క్లారిటీ లేదు
ఈ 7 సీటర్ SUVలో కూడా డస్టర్‌లో వచ్చే ఇంజిన్‌లే ఉపయోగించనున్నారు. 1.3 లీటర్ HR13 టర్బో పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, భవిష్యత్‌లో హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉండొచ్చు. అయితే, ఈ మోడల్‌కు డస్టర్ పేరును కొనసాగిస్తారా? లేదా కొత్త పేరు ఇస్తారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















