Tyre Speed Rating: టైర్లు పగిలిపోవడానికి అసలు కారణం ఇదే - టైర్ స్పీడ్ రేటింగ్‌ను అర్థం చేసుకోకపోతే తప్పదు ప్రమాదం!
టైర్‌పై ఉన్న స్పీడ్ రేటింగ్ అక్షరం వాహన భద్రతకు ఎంత కీలకమో చాలా మందికి తెలియదు. తప్పుడు రేటింగ్ టైర్లు వాడితే టైర్ బస్ట్, మంటలు, ప్రమాదాలు తప్పవు. డ్రైవర్లు తప్పక తెలిసుకోవాలి ఇది.

Speed Rating Letter On Tyres: మన రోడ్లపై తరచూ కనిపించే ప్రమాదాల్లో కొన్ని యాక్సిడెంట్లకు ఉన్న కామన్ కారణం - టైర్ ఒక్కసారిగా పేలిపోయి వాహనం అదుపు తప్పడం. హైవేపై సాఫీగా వెళుతున్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోయి అదుపు తప్పి బోల్తా కొట్టడం, టైర్ బరస్ట్ కారణంగా డివైడర్ లేదా ఇతర వాహనాలను ఢీ కొట్టడం, టైర్ల నుంచి మంటలు రావడం వంటి కారణాలతో ప్రాణాలు పోతున్నాయి. ఇవన్నీ కేవలం ప్రమాదాలు కాదు, టైర్ స్పీడ్ రేటింగ్ తెలియకుండా తీసుకునే ప్రమాదకర నిర్ణయాలు.
టైర్ ఎంత కొత్తదైనా, ఎంత ఖరీదైనదైనా, ఎంత నాణ్యమైనదైనా... దాని స్పీడ్ రేటింగ్ వాహనం వేగానికి సరిపోకపోతే అది ప్రాణాలకు ముప్పు తెస్తుంది. స్పీడ్ రేటింగ్‌ను వెహికల్ టైర్ మీద ఉండే అక్షరం వెల్లడిస్తుంది. అయితే, మనలో చాలామందికి టైర్ మీద ఉండే అక్షరాలు, నంబర్ల అర్థం తెలియదు. తెలిసిన వారు కూడా వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఆ చిన్న అక్షరం - ప్రాణాలకు శాసనం.
టైర్‌పై ఉన్న అక్షరమే భద్రతకు ఆధారం
ప్రతి టైర్ మీద ఒక ప్రత్యేక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ చివరన కనిపించే ఒక ఆల్ఫాబెట్ అక్షరం (ఆంగ్ల అక్షరం) ఆ టైర్ ఎంత గరిష్ఠ వేగం భరించగలదో తెలుపుతుంది. దీనినే టైర్ స్పీడ్ రేటింగ్ అంటారు. వాహన వేగానికి సరిపోని టైర్ ఉన్నప్పుడే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి.
ఏ అక్షరం అంటే ఎంత వేగం?
J – 100 km/h
K – 110 km/h
L – 120 km/h
M – 130 km/h
N – 140 km/h
R – 170 km/h
S – 180 km/h
T – 190 km/h
H – 210 km/h
V – 240 km/h
W – 270 km/h
హైవేపై ఎక్కువగా డ్రైవ్ చేసే వారు H లేదా V రేటింగ్ ఉన్న టైర్లు తప్పక వాడాలి.
తప్పుడు రేటింగ్ ఉంటే ఏమవుతుంది?
- టైర్ గరిష్ట వేగ సామర్థ్యానికి మించిన వేగంతో వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఆ టైర్లు భరించలేని ఒత్తిడికి గురవుతాయి.
- రబ్బర్ వేడెక్కి పొరలు విడిపోతుంది
- బెల్టింగ్ దెబ్బతింటుంది
- ఒక్కసారిగా టైర్ బరస్ట్ కావచ్చు
- కొన్ని సందర్భాల్లో మంటలు చెలరేగవచ్చు
- వీటిలో ఏం జరిగినా వాహనం అదుపు తప్పి పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది.
సరైన టైర్ ఎలా ఎంచుకోవాలి?
ప్రతి వాహన కంపెనీ, ఆ వెహికల్ మోడల్‌కు తగ్గ టైర్ స్పెసిఫికేషన్‌ను నిర్ణయిస్తుంది. డ్రైవర్ డోర్ దగ్గర ఉండే స్టిక్కర్ మీద, వాహన మాన్యువల్‌లో ఈ విషం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి, వెహికల్ తయారీ కంపెనీ సూచించిన రేటింగ్‌కు తగ్గ టైర్లు మాత్రమే వాడాలి.
సూచించిన రేటింగ్ కంటే తక్కువ రేటింగ్ ఉన్న టైర్లు వాడితే:
- బ్రేక్ ప్రభావం తగ్గుతుంది
- ఓవర్‌లోడ్ ఉన్నప్పుడు ప్రమాద అవకాశాలు రెట్టింపు అవుతాయి
- ప్రమాణాలకు తగిన టైర్లు వాడలేదన్న కారణంతో బీమా కంపెనీ కూడా మీ క్లెయిమ్‌ను తిరస్కరిస్తుంది
మన రోడ్లపై ప్రమాదాలు నివారించాలంటే మొదటి అడుగు టైర్లు సురక్షితంగా ఉన్నాయా? ఆయా టైర్ల స్పీడ్ రేటింగ్ వాహనానికి సరిపోతుందా? అనే విషయాన్ని పరిశీలించడం. ఒక చిన్న అక్షరాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చు. సో... ఈ విషయంలో నిర్లక్ష్యం పూర్తిగా ప్రమాదకరం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















