New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాన్స్‌కు బంపర్ న్యూస్ - ఎలక్ట్రిక్ బైక్, 750cc సహా చాలా బైక్‌లు లాంచింగ్‌కు రెడీ!
Upcoming Royal Enfield Bikes: ప్రియమైన కస్టమర్ల కోసం చాలా కొత్త బైక్‌లను విడుదల చేయడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ బైక్ & 750cc బండి సహా చాలా మోడళ్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

Royal Enfield New Bikes 2025: ప్రపంచవ్యాప్తంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గల క్రేజ్ మన దేశంలోనూ కూడా తక్కువేం కాదు. క్లాసిక్ రైడింగ్ అనుభూతిని కోరుకునే యువతలో ఈ బ్రాండ్‌కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు, ఈ అమేజింగ్ టూవీలర్ కంపెనీ, భారత మార్కెట్ కోసం కొన్ని కొత్త మోడళ్లను సిద్ధం చేస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ బైక్ కూడా ఉంది. ఇటీవల ఈ కంపెనీ తన పాత బైక్‌లను కొన్నింటిని అప్‌డేట్ చేసింది. ఇప్పుడు కొత్త లాంచ్‌లపై దృష్టి సారించింది. మీరు చాలా కాలంగా 'కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్' లాంచ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, మీ నిరీక్షణ త్వరలో ముగియనుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్
ముందుగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ తన మొదటి ఇ-బైక్ "ఫ్లయింగ్ ఫ్లీ C6" (Royal Enfield Flying Flea C6) ను 2026 ప్రారంభంలో విడుదల చేయవచ్చు. దీని ధర రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇది ఒక రెట్రో-ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో రానుంది, రౌండ్ LED హెడ్‌లైట్ & గిర్డర్ ఫోర్క్‌లు దీని ప్రత్యేకతలు.
దీని తర్వాత, స్క్రాంబ్లర్ స్టైల్ ఎలక్ట్రిక్ బైక్ & బ్యాటరీతో నడిచే హిమాలయన్ బైక్‌ను కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశపెడుతుంది. ఈ కంపెనీ, 750cc అడ్వెంచర్ Himalayan బైక్‌ను కూడా తీసుకురావాలని పరిశీలిస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా కేఫ్ రేసర్ వెర్షన్
Guerrilla 450లో కేఫ్ రేసర్ వెర్షన్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ సిద్ధం చేస్తోంది. ఇది 2026 నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ బైక్, ట్రయంఫ్ థ్రక్స్‌టన్ 400 (Triumph Thruxton 400) కు ప్రత్యర్థి & నేరుగా పోటీని ఇవ్వగలదు.
ఇంకా, రాయల్ ఎన్‌ఫీల్డ్, తన బుల్లెట్ 350 & మెటియోర్ 350 (Royal Enfield Bullet 350 vs Royal Enfield Meteor 350) వంటి మోడళ్లలో చిన్న డిజైన్ మార్పులు చేయవచ్చు. ఈ మోటారు సైకిళ్ల పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పు ఉండే అవకాశం లేదు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 ట్విన్
రాయల్ ఎన్‌ఫీల్డ్, బుల్లెట్ 650 ట్విన్ (Royal Enfield Bullet 650 Twin) ను 650cc విభాగంలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ పేరుకు ట్రేడ్‌మార్క్ కోసం ఇప్పటికే అప్లై చేసింది. దీనిని బట్టి, ఈ కంపెనీ త్వరలో కొత్త 650cc బండిని విడుదల చేయనుందని స్పష్టమవుతోంది. ఇది 650cc పార్లర్ ట్విన్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్, క్లాసిక్ 650 కంటే కొంచెం చౌకగా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 ట్విన్ 2026 అక్టోబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది & దీని ధర సుమారు రూ. 2.80 లక్షల నుంచి రూ. 2.90 లక్షల వరకు ఉంటుందని అంచనా.
దీంతో పాటు, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు 750cc ఇంజిన్ బైక్‌పై కూడా పనిచేస్తోంది. దీనికి R ప్లాట్‌ఫామ్ అని పేరు పెట్టారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన మొదటి బైక్ 2025-26 నాటికి మార్కెట్లోకి రావచ్చు.





















