Ola Scooter Speed: ఓలా.. స్పీడ్ అదిరిపోలా!
Ola Scooter Speed: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అత‍్యధిక వేగంతో రాబోతున్నట్లుగా లీకులు అందుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. స్పీడ్ విషయంలోనూ దూసుకుపోనున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఓలా వాహనాలు అత‍్యధిక వేగంతో రాబోతున్నట్లుగా లీకులు అందుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
'ఓలా స్కూటర్ టాప్ స్పీడ్ ఎంత ఉండాలని మీరు కోరుకుంటున్నారు?' అని భవిష్ ట్వీట్ చేశారు. ఇందులో గంటకు 80 కి.మీ, గంటకు 90 కి.మీ, గంటకు 100 కి.మీలకు పైగా, 'డోంట్ కేర్, జస్ట్ వాంట్ ఇట్!' అనే నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. వీటిలో మీకు ఏది కావాలో ఎంచుకోమని యూజర్లను అడిగారు.
What top speed would you want for the Ola Scooter?
— Bhavish Aggarwal (@bhash) July 24, 2021
ఈ నాలుగు ఆప్షన్లలో అత్యధికంగా 49.4 శాతం మంది గంటకు 100కి.మీ పైగా అనే ఆప్షన్ ఎంచుకున్నారు. గంటకు 80 కి.మీ ఆప్షన్‌ను 19.3 శాతం మంది, డోంట్ కేర్, జస్ట్ వాంట్ ఇట్! అనే ఆప్షన్‌ను 17 శాతం మంది, గంటకు 90 కి.మీ అనే ఆప్షన్‌ను 14.3 శాతం మంది ఎంచుకున్నారు. 11 వేల మందికి పైగా ఈ ట్వీట్‌కు ఓట్లు వేశారు.
కలర్స్ విషయంలోనూ..
ఓలా స్కూటర్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని భవిష్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇటీవల ఓలా స్కూటర్ కలర్స్ విషయంలోనూ పోల్ నిర్వహించారు.
Finalising Colors today. What do you prefer? #jointherevolution https://t.co/lzUzbWbFl7 @OlaElectric
— Bhavish Aggarwal (@bhash) July 19, 2021
అందులో మొత్తం 9 కలర్స్ ఇచ్చి వాటిలో ఒక దానిని ఎంచుకోమంటే.. ప్రజలంతా 9 రంగుల్లోనూ స్కూటర్లు వస్తే బాగుంటాయని సమాధానమిచ్చారు. అయితే వారి అంచనాలను మించి ఏకంగా 10 రంగుల్లో ఓలా స్కూటర్లను తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
సరిగ్గా ఇలానే ప్రస్తుతం బైక్ గరిష్ట వేగాన్ని గురించి పోల్ నిర్వహిస్తున్నారు. దీనిని బట్టి అంచనా వేస్తే ఓలా స్కూటర్ గరిష్ట వేగం గంటకు వంద కిలోమీటర్లకు పైగానే ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కనుక నిజమైతే ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో ఓలా సరికొత్త రికార్డు సాధిస్తుందని అంటున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లలో గరిష్ట వేగం 100 పైగా ఉండటం అనేది రికార్డేనని చెబుతున్నారు. ఓలా స్కూటర్ గరిష్ట వేగంపై మరింత స్పష్టత రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
10 కలర్ ఆప్షన్లతో..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 10 కలర్ ఆప్షన్లతో మార్కెట్లోకి రానుందని కంపెనీ పేర్కొంది. దీని అడ్వాన్స్ బుకింగ్స్ జూలై 15 నుండి ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్లను నేరుగా కస్టమర్ల ఇంటికే డెలివరీ చేయాలని సంస్థ భావిస్తోంది. ఓలా స్కూటర్ల వేరియంట్లకు సంబంధించి పలు లీకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటి ప్రకారం ఈ స్కూటర్లు మూడు వేరియంట్లలో రానున్నాయి. ఎస్, ఎస్ 1, ఎస్ 1 ప్రో అనే వేరియంట్లలో వీటిని తీసుకురానుందని తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

