MG New Car: కామెట్ తరహా ఈవీని తీసుకురానున్న ఎంజీ - వావ్ అనిపించే డిజైన్!
ఎంజీ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన పేటెంట్‌ను మనదేశంలో ఫైల్ చేసింది. ఇది 2025లో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Upcoming MG Electric Car: ఎంజీ మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్లో చిన్న ఎలక్ట్రిక్ కార్ కామెట్ ఈవీని విడుదల చేసింది. ఇది కస్టమర్లకు బాగా నచ్చింది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎంజీ కార్లలో కామెట్ ఈవీ రెండో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మార్కెట్‌లో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఎంజీ మోటార్స్ కస్టమర్లకు మరిన్ని ఆప్షన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎంజీ చైనాలో లాంచ్ చేసిన బావోజున్ యెప్ ఎలక్ట్రిక్ మినీ ఎస్‌యూవీని మనదేశంలో కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పేటెంట్‌ను కూడా ఇటీవలే దాఖలు చేశాడు.
ఎంజీ మోటార్ కొత్త మైక్రో ఈవీ డిజైన్ పేటెంట్‌ను ఇటీవలే దాఖలు చేసింది. సూపర్ కాంపాక్ట్ ఎంజీ కామెట్ ఈవీలతో పోలిస్తే, కొత్త ఎంజీ చిన్న ఈవీ కారు మరింత మస్క్యులర్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఇది సంప్రదాయ ఎస్‌యూవీ ఆకారాన్ని కలిగి ఉంది. కానీ సైజు పరంగా కొంచెం చిన్నగా ఉంటుంది. బావోజున్ యెప్ సైజు కామెట్ ఈవీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.
బావోజున్ యెప్ పొడవు 3,381 మిల్లీ మీటర్లు కాగా, వెడల్పు 1,685 మిల్లీ మీటర్లుగానూ, ఎత్తు 1,721 మిల్లీ మీటర్లుగానూ ఉంది. దీని వీల్ బేస్ 2,110 మిల్లీ మీటర్లుగా ఉంది. ఎంజీ కొత్త డిజైన్ పేటెంట్ బావోజున్ యెప్‌ని పోలి ఉంటుంది. అంటే ఈ కొత్త ఈవీ బావోజున్ యెప్‌కు సంబంధించిన రీబ్యాడ్జ్ వెర్షన్ కావచ్చు.
ఇందులో బాక్సీ డిజైన్, స్క్వేర్ ఫ్రంట్ గ్రిల్, స్క్వేర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎగుడుదిగుడుగా ఉండే బంపర్, షార్ప్ డిజైన్‌తో కూడిన ఫ్లాట్ బానెట్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో వీల్ ఆర్చ్‌లు, మందపాటి క్లాడింగ్, బ్లాక్ అవుట్ ఎ పిల్లర్లు, ఫంక్షనల్ రూఫ్ రెయిల్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
కామెట్ ఈవీ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని లోపలి భాగంలో ఎక్కువ స్థలం, డ్యూయల్ లార్జ్ స్క్రీన్‌లు, సెంట్రల్ ఏసీ వెంట్ క్రింద కొన్ని సంప్రదాయ నియంత్రణ బటన్‌లతో కూడిన సాధారణ ఇంటీరియర్ డిజైన్‌ను పొందుతుంది. దీని రేంజ్, స్పెసిఫికేషన్లు, పనితీరు కూడా బావోజున్ యెప్ ఈవీని పోలి ఉంటుంది. దీనిలో వెనుక వైపు యాక్సిల్ ఎలక్ట్రిక్ మోటార్ 28.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 67 బీహెచ్‌పీ శక్తిని, 140 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీని పరిధి 303 కిలోమీటర్లుగా ఉంది. గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ కారు ప్రయాణించగలదు.
కొత్త ఐసీఈ ఇంజిన్‌తో...
బావోజున్ యెప్ రేంజ్‌ను పెంచడానికి చిన్న ఐసీఈ ఇంజన్‌ని ఉపయోగించవచ్చని ఇటీవలే వెల్లడైంది. ఇప్పటికే ఉన్న వాహనాలలో ఈ ఇంజిన్‌ను ఆప్షనల్‌గా అందిస్తున్నారు. ఈ ఐసీఈ ఇంజిన్ సింగిల్ సిలిండర్ యూనిట్ కావచ్చు. ఇది దాదాపు 13.5 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కారు రేంజ్ దాదాపు 80 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. దీని ఇంధన సామర్థ్యం ఐదు నుంచి 10 లీటర్ల వరకు ఉంటుంది. ఎంజీ కొత్త చిన్న ఈవీని 2025లో లాంచ్ చేసే అవకాశం ఉంది.
వీటితో పోటీ...
ఈ కారు భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది 2024లో లాంచ్ కానున్న టాటా పంచ్ ఈవీతో పోటీపడుతుంది. ఇది కూడా 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను పొందవచ్చు.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial