MG Baojun Yep: కొత్త కారును టెస్ట్ చేస్తున్న ఎంజీ - ఈసారి ఐదు డోర్లతో!
MG New Car: ప్రముఖ కార్ల బ్రాండ్ ఎంజీ తన కొత్త కారును టెస్ట్ చేస్తుంది. అదే ఎంజీ బావోజున్ యెప్.
MG Baojun Yep Electric SUV: బావోజున్ యెప్ ఎంజీ మోటార్ ఇండియా రాబోయే రెండు సంవత్సరాలలో భారతీయ మార్కెట్లో ఏడు కొత్త కార్లు, ఎస్‌యూవీలను లాంచ్ చేయనుంది. ఈ మోడళ్లలో చాలా వరకు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో వస్తాయి. ఎంజీ మోటార్ కూడా సుజుకి జిమ్నీ ఇన్స్‌పిరేషన్‌తో బావోజున్ యెప్ రగ్గడ్ మినీ ఎస్‌యూవీ డిజైన్‌పై పేటెంట్ పొందింది. బావోజున్ యెప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎంపిక చేసిన మార్కెట్లలో 5 డోర్ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
కంపెనీ బావోజున్ యెప్‌కు సంబంధించిన 5 డోర్ వెర్షన్‌ను పరీక్షించడం కూడా ప్రారంభించింది. ఈ కొత్త కాంపాక్ట్ ఈవీ ఎస్‌యూవీని బావోజున్ యెప్ ప్లస్ అని పిలిచే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో (మార్చి లోపు) ఈ కారు చైనీస్ మార్కెట్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. 2025లో ఎంజీ మోటార్ భారత దేశ మార్కెట్లో సరికొత్త కామెట్ ఈవీ ఆధారిత కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేస్తుంది. ఇది కామెట్ ఈవీ ఆధారిత ఎస్‌యూవీగా రానున్న బావోజున్ యెప్ ప్లస్ ఇండియన్ వెర్షన్ అని అంచనా.
డిజైన్ ఎలా ఉంది?
బావోజున్ యెప్ ప్లస్ అనేది యెప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన లాంగ్ వీల్‌బేస్ మోడల్. ఇది చైనీస్ మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. దీని స్పై ఫొటోలను బట్టి ఐదు డోర్ల మోడల్ లాంగ్ వీల్‌బేస్‌పై నడుస్తుందని అనుకోవచ్చు. 3 డోర్ మినీ ఈవీ పొడవు 3.4 మీటర్లు కాగా, ఎల్‌డబ్ల్యూబీ యెప్ ప్లస్ పొడవు నాలుగు మీటర్లకు దగ్గరగా ఉంటుందని అంచనా. కనిపించే మోడల్ రెట్రో బాక్సీ స్టైలింగ్‌తో మూడు డోర్ల జీప్‌ని పోలి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద మార్పులు కనిపించాయి. ఇందులో పెద్ద డోర్లు కూడా ఉన్నాయి.
ఇంజిన్ ఇలా...
3 డోర్ల యెప్ మినీ ఈవీ కంటే బావోజున్ యెప్ ప్లస్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుందని మీడియా నివేదికల్లో పేర్కొన్నారు. చిన్న ఈవీ 28.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ యూనిట్‌తో రానుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 303 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ 3 డోర్ ఈవీ ఎస్‌యూవీ వెనుక యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఇది 68 హెచ్‌పీ శక్తిని, 140 ఎన్ఎం పీక్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుందని పేర్కొన్నారు.
ఎప్పుడు లాంచ్ చేస్తారు?
భారతదేశానికి వస్తున్న ఎంజీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్ (GSEV) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని మీద ఎంజీ కామెట్ ఈవీ, బావోజున్ యెప్ కూడా నిర్మించారు. ఇది బావోజున్ యెప్ అప్‌డేటెడ్ వెర్షన్ కావచ్చు. ఎంజీ 3 డోర్ మోడల్‌తో పాటు కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు డెరివేటివ్‌లను వచ్చే ఏడాది ప్రారంభంలో భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!