2025లో చరిత్ర సృష్టించిన మారుతి సుజుకీ - హోల్‌సేల్, రిటైల్ సేల్స్‌లో కొత్త రికార్డులు
డిసెంబర్ 2025లో మారుతి సుజుకీ హోల్‌సేల్, రిటైల్ సేల్స్‌లో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. 2025 క్యాలెండర్ ఇయర్ కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ సంవత్సరంగా నిలిచింది.

Maruti Suzuki Sales 2025: భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. డిసెంబర్ 2025 నెలతో పాటు మొత్తం 2025 క్యాలెండర్ ఇయర్‌ను కంపెనీ "ఆల్ టైమ్ బెస్ట్ సేల్స్ ఇయర్"గా ముగించింది. హోల్‌సేల్, రిటైల్ రెండింటిలోనూ ఇప్పటివరకు ఎప్పుడూ లేని స్థాయిలో విక్రయాలు నమోదయ్యాయని మారుతి సుజుకీ అధికారికంగా ప్రకటించింది.
డిసెంబర్ 2025 - మారుతి చరిత్రలోనే రికార్డు నెల
డిసెంబర్ 2025లో దేశీయ హోల్‌సేల్ సేల్స్ 1,82,165 యూనిట్లకు చేరాయి. మారుతి సుజుకీ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి నమోదైన అత్యధిక నెలవారీ హోల్‌సేల్ నంబర్ ఇది. గతేడాదితో పోలిస్తే ఇది 37.5 శాతం వృద్ధిని చూపించింది.
ఇక ఎక్స్‌పోర్ట్స్ విషయానికి వస్తే, డిసెంబర్‌లో 25,739 యూనిట్లను విదేశీ మార్కెట్లకు పంపింది. ఇతర OEMలకు సరఫరా చేసిన వాహనాలు 9,950 యూనిట్లు. ఈ మూడు విభాగాలను కలిపితే, డిసెంబర్ నెల మొత్తం హోల్‌సేల్ సేల్స్ 2,17,854 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే 22 శాతం పెరుగుదల కాగా, కంపెనీ 42 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక నెలవారీ డిస్పాచ్‌గా నిలిచింది.
రిటైల్ సేల్స్‌లోనూ కొత్త మైలురాయి
డిసెంబర్ 2025లో మారుతి సుజుకీ రిటైల్ సేల్స్ 2.86 లక్షల యూనిట్లకు చేరాయి. గతేడాది డిసెంబర్‌లో నమోదైన 2.52 లక్షల రికార్డును ఈసారి సులువుగా అధిగమించింది. డీలర్ల వద్ద స్టాక్ స్థాయి ప్రస్తుతం సగటున మూడు రోజులకు మాత్రమే సరిపడేంత తక్కువగా ఉంది. అదే సమయంలో పెండింగ్ బుకింగ్స్ సంఖ్య సుమారు 1.75 లక్షల యూనిట్లకు చేరింది.
2025 - మారుతి సుజుకీకి బెస్ట్ ఇయర్
మొత్తం 2025 క్యాలెండర్ ఇయర్‌లో మారుతి సుజుకీ హోల్‌సేల్ సేల్స్ 18,44,169 యూనిట్లుగా నమోదు కాగా, రిటైల్ సేల్స్ 18,71,508 యూనిట్లకు చేరాయి. 2024లో నెలకొల్పిన రికార్డును కూడా ఇవి మించిపోయాయి, కొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి. ఒక్క మూడో త్రైమాసికంలోనే ఈ కంపెనీ 5,37,433 యూనిట్లను సరఫరా చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 22 శాతం వృద్ధి. అదే త్రైమాసికంలో రిటైల్ సేల్స్ 6.83 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.
అన్ని సెగ్మెంట్లలోనూ బలమైన వృద్ధి
మినీ కార్ సెగ్మెంట్‌లో దాదాపు 92 శాతం వృద్ధి నమోదు కాగా, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్ 43 శాతం పెరిగింది. యుటిలిటీ వాహనాలు 32.6 శాతం వృద్ధితో ముందంజలో నిలిచాయి. వ్యక్తిగత మోడళ్లలో, డిసెంబర్‌లో, బాలెనో ఇండస్ట్రీలోనే టాప్ సెల్లింగ్ కార్‌గా నిలిచింది. ఈ మోడల్ హోల్‌సేల్ సేల్స్ 22,108 యూనిట్లు. ఫ్రాంక్స్, డిజైర్ కూడా బలమైన ప్రదర్శన చూపించాయి. మొత్తం ఏడాది గణాంకాల్లో డిజైర్ దాదాపు 2.14 లక్షల యూనిట్లతో 2025లో భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్‌గా నిలిచింది. డిసెంబర్‌లో ఆల్టో సేల్స్ సుమారు 10,000 యూనిట్లు కాగా, ఇందులో ఎస్-ప్రెస్సో వాటా సుమారు 4,000 యూనిట్లు. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో నెలవారీ విక్రయాలు సుమారు 38,000 యూనిట్లుగా నమోదయ్యాయి.
CNG వాహనాల బలం
2025లో మారుతి సుజుకీ CNG రిటైల్ సేల్స్ దాదాపు 7 లక్షల యూనిట్లకు చేరాయి. ప్రస్తుతం కంపెనీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో CNG మోడళ్ల వాటా 37 శాతం ఉండటం గమనార్హం. మినీ సెగ్మెంట్‌లో పెండింగ్ బుకింగ్స్ సుమారు ఒకటిన్నర నెలల వరకూ ఉన్నాయని కంపెనీ తెలిపింది.
మొత్తంగా చూస్తే, 2025 సంవత్సరం మారుతి సుజుకీకి సేల్స్, డిమాండ్, మార్కెట్ లీడర్‌షిప్ అన్నింటిలోనూ చారిత్రాత్మక సంవత్సరంగా నిలిచింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















