7 సీట్ల XEV 9S కొనాలా? కూపే స్టైల్ XEV 9e కొనాలా? - రియల్ వరల్డ్ పెర్ఫార్మెన్స్‌లో తేడాలు ఇవే
మహీంద్రా XEV 9S & XEV 9e ఎలక్ట్రిక్ SUVల మధ్య యాక్సిలరేషన్, రోలింగ్ స్పీడ్, బ్రేకింగ్ పనితీరులో ఉన్న నిజమైన తేడాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

Mahindra Electric SUV Performance Comparison: మహీంద్రా & మహీంద్రా... తన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఫ్లాగ్‌షిప్ మోడళ్లుగా XEV 9S & XEV 9e ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఒకటి మూడు వరుసలతో వచ్చే 7 సీట్ల SUV కాగా, మరొకటి కూపే స్టైల్ డిజైన్‌తో కనిపించే స్పోర్టీ SUV. అయితే ఈ రెండింటిలో టాప్ స్పెక్ వేరియంట్లు ఒకే INGLO ప్లాట్‌ఫామ్, ఒకే 79kWh బ్యాటరీ, ఒకే 286hp రియర్ మౌంటెడ్ మోటార్‌ను షేర్ చేసుకుంటాయి. లక్షణాలన్నీ ఒకేలా ఉన్నా, రియల్ వరల్డ్‌లో నిజంగా ఏది మెరుగైన పనితీరును ఇస్తుంది?. ఈ రెండు కార్లపై ఎక్స్‌పర్ట్‌లు చేసిన టెస్ట్ రిపోర్ట్స్ ఇవిగో...
స్పెసిఫికేషన్లు, ధరలు
టాప్ వేరియంట్లు XEV 9S Pack Three Above & XEV 9e Pack Three. వీటిలో బ్యాటరీ, మోటార్ ఒకేలా ఉన్నా, ప్రధాన తేడా బరువులో కనిపిస్తుంది. మహీంద్రా అధికారికంగా చెప్పిన ప్రకారం XEV 9S ఎక్కువ బరువుతో ఉంటుంది. దీనివల్లే 0-100 కి.మీ. వేగం విషయంలో చిన్న తేడా వస్తుంది.
క్లెయిమ్ చేసిన లెక్కల ప్రకారం, XEV 9e 0-100 కి.మీ. వేగాన్ని XEV 9S కంటే 0.2 సెకన్లు త్వరగా చేరుకుంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 7 సీట్ల XEV 9S ధర XEV 9e కంటే లక్ష రూపాయలకుపైగా తక్కువగా ఉంటుంది. అంతేకాదు, ARAI క్లెయిమ్ చేసిన రేంజ్‌లో XEV 9Sకు 23 కి.మీ. ఎక్కువ ఉంటుంది.
0-100 కి.మీ. యాక్సిలరేషన్ టెస్ట్
స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే, ఆశ్చర్యకరంగా XEV 9S మొదటి 40 కి.మీ. వేగం వరకు కొంచెం వేగంగా స్పందిస్తుంది. ఇది XEV 9e కంటే 0.05 సెకన్లు ముందుగా 40 కి.మీ. మార్క్‌ను చేరింది. కానీ అక్కడి నుంచి పరిస్థితి మారింది. 40 కి.మీ. తర్వాత XEV 9e తన స్పోర్టీ క్యారెక్టర్‌ను చూపించింది. 100 కి.మీ. వద్దకు 9S కంటే XEV 9e 0.09 సెకన్లు ముందు చేరుకుంది. 120 కి.మీ. వద్ద ఈ తేడా 0.12 సెకన్లకు, 140 కి.మీ. వద్ద 0.25 సెకన్లకు పెరిగింది. రెండు SUVలకూ క్లెయిమ్ చేసిన టాప్ స్పీడ్ గంటకు 202 కిలోమీటర్లు.
ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. XEV 9S తన బెస్ట్ టైమ్‌ను Race డ్రైవ్ మోడ్‌లో నమోదు చేసింది. అదే సమయంలో XEV 9e Everyday మోడ్‌లో Boost ఆన్ చేసి వేగవంతమైన టైమ్‌ను సాధించింది. Eco మోడ్‌లో అయితే రెండూ నెమ్మదిగా అనిపించాయి.
రోలింగ్ యాక్సిలరేషన్ టెస్ట్
రోజువారీ డ్రైవింగ్‌లో ముఖ్యమైన రోలింగ్ యాక్సిలరేషన్ విషయంలో బరువు ప్రభావం పెద్దగా కనిపించలేదు. 20-80 కి.మీ. రన్‌లో XEV 9S కేవలం 0.06 సెకన్లు నెమ్మదిగా ఉంది. అదే విధంగా 40-100 కి.మీ. స్ప్రింట్‌లో XEV 9e 0.13 సెకన్లు నెమ్మదిగా ఉన్నట్లు నమోదైంది.
మొత్తంగా చూస్తే, యాక్సిలరేషన్ విషయంలో XEV 9e స్వల్పంగా ముందుండగా, తేడా మాత్రం చాలా చిన్నది.
బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్
రెండు ఎలక్ట్రిక్ SUVల్లో బ్రేకింగ్ సెటప్ దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా XEV 9S ఎక్కువ బరువు ప్రభావం చూపిస్తుంది. 80-0 కి.మీ. బ్రేకింగ్ టెస్ట్‌లో, అలాగే 80-20 కి.మీ. రీజెన్ బ్రేకింగ్ టెస్ట్‌లో XEV 9e మెరుగైన ఫలితాలు ఇచ్చింది.
మూడు రీజెనరేటివ్ బ్రేకింగ్ మోడ్‌లలో కూడా XEV 9e స్పష్టంగా ముందుంది. అయితే ఈ రెండు మోడళ్లలోనూ సింగిల్ పెడల్ డ్రైవింగ్ మోడ్ ఉండటం వల్ల, బ్రేక్ పెడల్ వాడకుండానే వాహనం ఆగే సౌకర్యం ఉంటుంది.
మీకు ఏది సరిపోతుంది?
ఎక్కువ సీట్లు, కొంచెం ఎక్కువ రేంజ్, తక్కువ ధర కావాలంటే మహీంద్రా XEV 9S సరైన ఎంపిక. అదే సమయంలో స్పోర్టీ లుక్, మెరుగైన యాక్సిలరేషన్, బ్రేకింగ్ పనితీరు కావాలంటే XEV 9e వైపు చూడొచ్చు. వాస్తవానికి, పనితీరు పరంగా ఈ రెండు EVల మధ్య తేడాలు చాలా చిన్నవి. మీ కుటుంబ అవసరాలు, డ్రైవింగ్ స్టైల్, డిజైన్ ప్రాధాన్యతను బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















