Kia EV6 Review: ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఎస్‌యూవీ " కియా ఈవీ 6 "
కియా ఎలక్ట్రిక్ కారు ఈవీ6 భారత మార్కెట్‌లో విడుదలైంది. ఆ కారు ఎలా ఉందంటే ?
Kia EV6 Review: అనంతపురంలో ప్లాంట్ పెట్టి మేడిన్ ఆంధ్రా కార్లు ఉత్పత్తి చేస్తున్న కొరియన్ కార్ దిగ్గజం కియా (Kia) అధునాతన ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 (Kia EV6) ను భారతీయుల కోసం అందుబాటులోకి తెచ్చింది. భారత కార్ మార్కెట్లో SUV మరియు MPV విభాగాలపై దృష్టి సారించిన కియా, ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహన విభాగంపై కన్నేసింది. కియా ఇండియా తమ లేటెస్ట్ కారులో ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంది.
కియా సోనెట్, సెల్టోస్ కు భిన్నంగా కియా ఈవీ6 ఉంది. కియా ఈవీ6 ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రేస్‌లో ప్రత్యేకంగా నిలిచింది . ఈ ఎలక్ట్రిక్ కారును ఏ కోణం నుండి చూసినా వాలుగా ఉండి, అగ్రెసివ్ లుక్ ని కలిగి ఉంది. వాస్తవానికి ఇదొ నాచ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. అంటే హ్యాచ్‌బ్యాక్ , ఎస్‌యూవీ డిజైన్‌లను కలగలపి రూపొందించిన మోడల్ . కారు ముందు భాగంలో ప్రత్యేకమైన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, స్వీపింగ్ బానెట్‌పై ఉన్న మస్క్యులర్ లైన్‌లు, సిగ్నేచర్ గ్రిల్ మరియు బ్లాక్ ఎలిమెంట్‌లతో కూడిన బంపర్ వంటి డిజైన్ హైలైట్స్ ఆకర్షణగా ఉన్నాయి. సైడ్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
సైడ్ ప్రొఫైల్‌లో డిజైన్‌లో ఫాన్సీగా కనిపించే 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి ప్రత్యేకమైన టర్బైన్ లాంటి డిజైన్‌ని కలిగి ఉంటాయి , వీటిని స్పోర్ట్స్ కార్ల గుంపులో కూడా ప్రత్యేకంగా గుర్తించేలా ఉంటాయి. సైడ్ డోర్స్ దిగువ భాగంలో ఒక రకమైన ఎయిర్-ఛానల్ ఉంటుంది, ఇది కారుకి స్టైలింగ్‌ను జోడించడంతో పాటుగా మంచి ఏరోడైనమిక్స్‌ను అందించడంలో కూడా సహాయపడుతుంది.
కియా ఈవీ6 యొక్క ఫ్యాన్సీ ఎక్స్టీరియర్ మాదిరిగానే ఇంటీరియర్ కూడా అంతే ఫ్యాన్సీగా ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది . డ్రైవర్ సమాచారం కోసం ఇన్‌స్ట్రుమెంటేషన్ క్లస్టర్ 12.3 ఇంచ్ ఫుల్ కలర్ టిఎఫ్‌టి డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. ఇదొక రియర్ వీల్ డ్రైవ్ మోడల్ కావడంతో ఇందులో 490 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అయితే, అదే ఆల-వీల్ డ్రైవ్ (AWD) మోడల్ అయితే, దీని బూట్ స్పేస్ 10 లీటర్లు తగ్గుతుంది. ఈ కారులో అదనపు స్థలం అవసరమైతే మరింత లగేజీ కోసం వెనుక సీట్లను మడుచుకునే వెసలుబాటు ఉంటుంది. క్యాబిన్ లోపల స్థలం గురించి చెప్పాలంటే, Kia EV6 కారులో ఐదుగురు వ్యక్తులకు సరిపోయేంత స్థలాన్ని కలిగి ఉంటుంది
ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.2 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. వీటిలో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్‌లలో ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకమైన థ్రోటల్ మరియు స్టీరింగ్ పనితీరును కలిగి ఉంటుంది. మోడ్ మార్చగానే, వీటి పనితీరు కూడా మారుతుంది. ఎంచుకున్న మోడ్‌పై ఆధారపడి సున్నితత్వం పెరుగుతుంది లేదా తగ్గుతుంది.స్పోర్ట్స్ మోడ్‌లో, కియా ఈవీ6 గరిష్టంగా గంటకు 192 కిమీ టాప్ స్పీడ్ తో దూసుకుపోతుంది.
కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారులో 77.4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది . ఇది 320bhp యొక్క మిశ్రమ అవుట్‌పుట్ కలిగిన రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లకు శక్తినిస్తుంది. ఇది 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే 350kW DC ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ అనుకూలంగా ఉన్నందున ఈ బ్యాటరీలను చాలా వేగంగా చార్జ్ చేయవచ్చు. ఈ కారును 50kW DC ఫాస్ట్ చార్జర్ తో 10 నుండి 80 శాతానికి చార్జ్ చేయడానికి 73 నిమిషాల సమయం పడుతుంది. అదే 350kW DC ఫాస్ట్ చార్జర్ తో అయితే, కేవలం18 నిమిషాల్లోనే ఈ బ్యాటరీని 80 శాతానికి చార్జ్ చేయవచ్చు. ఇది వాహనం నుండి వాహనం మరియు వాహనం నుండి లోడ్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. అంటే, ఈ కారును ఓ చిన్న సైజు పవర్ హౌస్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చన్నమాట.