Maruti Suzuki Sales: 2024 జనవరిలో మారుతి సిక్సర్ - ఏకంగా రెండు లక్షల వరకు!
Maruti Suzuki Record Sales: 2024 జనవరిలో కార్ల సేల్స్ వివరాలను కంపెనీలు ప్రకటించాయి. మారుతి సుజుకి నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది.
January 2024 Sales Report: దేశీయ మార్కెట్లో ఉన్న కార్ల తయారీ కంపెనీలు 2024 జనవరిలో విక్రయించిన కార్లకు సంబంధించిన గణాంకాలను విడుదల చేశాయి. ప్రస్తుతం మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ మోటార్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
దేశీయ మార్కెట్లో ఫోర్ వీలర్ల విభాగంలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకీ మరోసారి తన సత్తాను నిరూపించుకుంది. గత నెలలో కంపెనీ విక్రయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మారుతి విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 2024లో కంపెనీ 1,66,802 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. 2023లో ఈ సంఖ్య 1,47,348 యూనిట్లుగా ఉంది.
మొత్తం అమ్మకాల గురించి చెప్పాలంటే కంపెనీ గత నెలలో 1,99,364 యూనిట్ల సంఖ్యను అధిగమించింది. దేశీయ మార్కెట్‌లో విక్రయించే ప్యాసింజర్ వాహనాలు, ఎక్స్‌పోర్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి. మారుతి ఒక నెలలో నమోదు చేసిన అత్యధిక సేల్స్ ఇవే.
హ్యుందాయ్ జనవరి 2024 సేల్స్ రిపోర్ట్
మారుతి తర్వాత ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అత్యధిక కార్లను విక్రయిస్తున్న వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా. వీరి డేటా ప్రకారం కంపెనీ 2024 జనవరిలో 67,615 యూనిట్లను విక్రయించింది. వీటిలో దేశీయ విక్రయాలు 57,115 యూనిట్లుగా ఉన్నాయి.
ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా జనవరిలో విక్రయించిన వాహనాల గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం కంపెనీ 31 శాతం వృద్ధిని సాధించింది. గత నెలలో కంపెనీ 43,068 యూనిట్ల కార్లను విక్రయించింది. 2023 జనవరిలో 32,915 యూనిట్లు అమ్ముడయ్యాయి.
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) జనవరిలో విక్రయించిన వాహనాల గణాంకాలను కూడా విడుదల చేసింది, దీని ప్రకారం కంపెనీ 24,609 యూనిట్లను విక్రయించింది. ఇప్పటి వరకు కంపెనీ అత్యధిక హోల్‌సేల్ నెలవారీ అమ్మకాలు ఇది. 2022 జనవరిలో ఈ సంఖ్య 12,835 యూనిట్లుగా ఉంది.
మరోవైపు భారతదేశంలోని రెండు అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలు, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ సంవత్సరం దేశంలో కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేయబోతున్నాయి. మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, నెక్స్ట్ జనరేషన్ డిజైర్‌లను 2024 ప్రారంభంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవి మాత్రమే కాకుండా వాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ కూడా రాబోయే నెలల్లోనే మార్కెట్లోకి రానుంది. ఈ కారు ఇటీవలే టెస్టింగ్ సమయంలో కనిపించింది. హ్యుందాయ్ ఈ సంవత్సరాన్ని అప్‌డేట్ చేసిన క్రెటాతో గ్రాండ్‌గా ప్రారంభించింది. దీని తరువాత హ్యుందాయ్ 2024 మధ్య నాటికి క్రెటా ఎన్ లైన్, అల్కజార్ ఫేస్‌లిఫ్ట్‌లను పరిచయం చేసే అవకాశం ఉంది.
మీడియా నివేదికల ప్రకారం కొత్త తరం మారుతి స్విఫ్ట్ ఏప్రిల్‌లో లాంచ్ కానుంది. హ్యాచ్‌బ్యాక్ కొత్త జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో మెరుగైన డిజైన్, ఇంటీరియర్‌ను కూడా పొందుతుంది. కొత్త 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్లోకి రానుంది. ఈ కారు గరిష్టంగా 82 బీహెచ్‌పీ పవర్‌ని, 108 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇదే ఇంజిన్ కొత్త తరం మారుతి డిజైర్‌లో కూడా ఉండనుంది.