Hyundai: హ్యుందాయ్‌ని కొట్టిన టాటా - కార్ల మార్కెట్లో రెండో స్థానానికి!
Hyundai Vs Tata: దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్‌ని హ్యుందాయ్ దాటేసింది.
Car Sales Report February 2024: భారతీయ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ 2024 ఫిబ్రవరి నెలలో హ్యుందాయ్‌ను దాటడం ద్వారా మన దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీదారుగా అవతరించింది. టాటా గత నెలలో 51,321 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇదే ఫిబ్రవరి నెలలో హ్యుందాయ్ మొత్తం దేశీయ విక్రయాలు 50,201 యూనిట్లుగా ఉన్నాయి. కొరియన్ ఆటోమేకర్ హ్యుందాయ్‌ను గత మూడు నెలల్లో టాటా మోటార్స్ రెండో సారి నంబర్ 2 స్థానం నుంచి తొలగించింది. అయితే హ్యుందాయ్ వార్షిక ప్రాతిపదికన 6.8 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో టాటా మోటార్స్ హ్యుందాయ్ కంటే 1100 ఎక్కువ కార్లను విక్రయించింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా 2024 ఫిబ్రవరిలో 60,501 యూనిట్ల (దేశీయ అమ్మకాలు + ఎగుమతులు) మొత్తం అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 57,851 యూనిట్లు విక్రయించింది. 2023 ఫిబ్రవరిలో కేవలం భారతీయ మార్కెట్లోనే హ్యుందాయ్ 47,001 యూనిట్ల కార్లను విక్రయించింది. 2024 ఫిబ్రవరిలో ఆ నంబర్ 50,201 యూనిట్లకు చేరుకుంది. ఇది వార్షిక ప్రాతిపదికన 6.8 శాతం ఎక్కువ. హ్యుందాయ్ కూడా 10,300 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇది 5.07 శాతం తక్కువ.
టాటా సేల్స్ ఇలా...
టాటా మోటార్స్ 2024 ఫిబ్రవరిలో మొత్తం విక్రయాలలో 8.4 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. కంపెనీ గత నెలలో 86,406 వాహనాలను విక్రయించింది. 2023 ఫిబ్రవరిలో 79,705 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయ విపణిలో టాటా మోటార్స్ ఫిబ్రవరి 2024లో 51,267 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 42,862 యూనిట్లతో పోలిస్తే, ఏడాది ప్రాతిపదికన 20 శాతం అమ్మకాల వృద్ధి నమోదైంది. అయినప్పటికీ కంపెనీ జనవరి 2024లో 55,633 వాహనాల అమ్మకాలతో నెలవారీ అమ్మకాల్లో క్షీణతను నమోదు చేసింది.
టాటా ఎగుమతులు గత సంవత్సరంతో పోలిస్తే 81 శాతం క్షీణించాయి. 2023 ఫిబ్రవరిలో ఇది 278 యూనిట్లుగా ఉండగా, 2024 ఫిబ్రవరికు ఏకంగా కేవలం 54 యూనిట్లకు పడిపోయింది. గత నెలలో కంపెనీ మొత్తం విక్రయాలు 51,321 యూనిట్లకు పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన 19 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. 2023 ఫిబ్రవరిలో కంపెనీ 43,140 యూనిట్లను విక్రయించింది. టాటా ఎలక్ట్రిక్ వాహనాల విభాగం కూడా 2024 ఫిబ్రవరిలో ఏడాది ప్రాతిపదికన 30 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024 ఫిబ్రవరిలో 6,923 యూనిట్లను విక్రయించింది. అయితే గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 5,318 యూనిట్లుగా ఉంది.