E20 Fuel Mileage Drop: E20 పెట్రోల్‌తో మీ కారు మైలేజ్ తగ్గొచ్చు, పాత బండిపై ఎక్కువ ప్రభావం! - నిపుణుల హెచ్చరికలు!
E20 Petrol Impact: E20 పెట్రోల్ వాడితే మైలేజ్ 2-5% వరకు తగ్గవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత వాహనాల్లో గ్యాస్కెట్లు, రబ్బర్ పైపులపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని సూచిస్తున్నారు.

E20 Fuel Impact On Car Mileage: భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో 20 శాతం ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఈ కొత్త ఇంధనంతో వాహనాల మైలేజ్ 2% నుంచి 5% వరకు తగ్గే అవకాశం ఉందని.
నిపుణుల వివరాల ప్రకారం, ఎథనాల్ ఇంధనంలో కేలరీ విలువ పెట్రోల్‌తో పోల్చితే తక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని వాడినప్పుడు వాహనాలు కొంత ఎక్కువ ఇంధనం వినియోగిస్తాయి. ఫలితంగా మైలేజ్ 2% నుంచి 5% వరకు తగ్గవచ్చని చెబుతున్నారు. అయితే ఈ ప్రభావం వాహనం మోడల్, ఇంజిన్ టెక్నాలజీ ఆధారపడి మారుతుందని వివరించారు.
పాత వాహనాలపై ప్రభావం
15 సంవత్సరాల క్రితం, అంటే 2009 కి ముందు వచ్చిన వాహనాలు (E10 కోసం తయారైన కార్లు ఇవి) ఎక్కువగా E20 ఫ్యూయల్‌కి అనుకూలంగా ఉండవు. ఇప్పుడు E20 ఫ్యూయల్ వాడడం వల్ల ఈ కార్లలో గ్యాస్కెట్లు, రబ్బర్ హోసులు, ఫ్యూయల్ పైపులు కాలక్రమంలో క్షీణించవచ్చని ఆటోమొబైల్ ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్యలు వెంటనే కనిపించవని, దీర్ఘకాలంలో మాత్రమే ప్రభావం చూపుతాయని అంటున్నారు.
ప్రభుత్వ వివరణ
E20 ఫ్యూయల్ వల్ల మైలేజ్ తగ్గుతుందన్న ఆందోళనలు దేశవ్యాప్తంగా చెలరేగాయి. దీనిపై, కొన్ని రోజుల క్రితం, కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. "E20 వాడితే మైలేజ్ పెద్దగా తగ్గిపోదు. అంచనా ప్రకారం, E10 కోసం తయారైన కార్లలో E20 ఫ్యూయల్ వాడితే 1-2% మైలేజ్ తగ్గవచ్చు, ఇంకా కొన్ని వాహనాల్లో 3-6% వరకు తగ్గుదల కనిపించవచ్చు". అని తెలిపింది.
మంత్రిత్వ శాఖ మరో విషయం కూడా చెప్పింది. - "E20 కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేసిన వాహనాలు బెటర్ యాక్సిలరేషన్ ఇస్తాయి. సిటీ ట్రాఫిక్ డ్రైవింగ్‌లో ఇది పెద్ద ప్లస్ పాయింట్. అలాగే, ఎథనాల్‌లో ఉన్న అధిక వేడి ఆవిరయ్యే శక్తి వల్ల, కారు ఇంజిన్‌లో ఎయిర్-ఫ్యూయల్ మిశ్రమం గట్టిగా అయి, వాహనం పనితీరును మెరుగుపరుస్తుంది" అని పేర్కొంది.
కారు కంపెనీలు ఏం చెబుతున్నాయి?
మారుతి సుజుకి, హ్యుందాయ్ ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించగా, టాటా మోటార్స్ మాత్రం తమ వాహనాలు E20 ఫ్యూయల్‌కి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.
నిపుణుల సూచన
నిపుణుల అభిప్రాయాలు - "E20 ఫ్యూయల్‌కి అనుకూలంగా డిజైన్ చేసిన వాహనాలకు ఎలాంటి సమస్య ఉండదు. కానీ పాత వాహనాల్లో (2009 కి ముందు వచ్చిన వాహనాలు/ E10 కోసం తయారైన వాహనాలు) మాత్రం గ్యాస్కెట్లు, రబ్బర్ పైపులపై ప్రభావం ఉండొచ్చు. ఇది కూడా దీర్ఘకాలంలోనే కనిపిస్తుంది".
E20 పెట్రోల్ వాడకం పర్యావరణానికి మేలు చేయొచ్చు, రైతులకు కూడా లాభం కలిగించొచ్చు. అయితే, వాహన యజమానులు తప్పనిసరిగా తమ వాహనం E20 ఫ్యూయల్‌కి అనుకూలమా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. కారు కొన్నప్పుడు ఇచ్చిన మాన్యువల్‌లో, ఇంధన రకంలో ఈ విషయం వివరంగా ఉంటుంది. కొత్త వాహనాల్లో పెద్ద సమస్య ఏమీ రాకపోవచ్చు, కానీ పాత వాహనాల యజమానులు దీర్ఘకాలిక ప్రభావాలపై జాగ్రత్తలు తీసుకోవడం అవసరం, నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తుండాలి.





















