Volkswagen Virtus: అరెరే, డెలివరీకి మరీ అంత తొందరా - కొత్త లగ్జరీ కారును ఇలా పార్క్ చేశారంటూ మీమ్స్!
అప్పుడే కొనుగోలు చేసిన కొత్త వోక్స్ వ్యాగన్ కారు, షో రూమ్ నుంచి బయటకు తెస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. రాజమండ్రిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొత్తగా కొనుగోలు చేసిన కార్లు డెలివరీ సమయంలో ప్రమాదాలకు గురైన సంఘటనలు అనేకం చూశాం. కొత్తకారును డ్రైవ్ చేసే సమయంలో చేసిన పలు పొరపాట్ల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాల్లో కార్లు మాత్రమే డ్యామేజ్ కాగా, మరికొన్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజమండ్రిలో జరిగింది. కారు డెలివరీ సమయంలో షో రూమ్ నుంచి బయటకు దూసుకొచ్చి ఎదురుగా ఉన్న రోడ్డు మీద పడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
రాజమండ్రి వోక్స్ (ఫోల్క్స్) వ్యాగన్ షో రూమ్ దగ్గర ప్రమాదం
ఇటీవలే రాజమండ్రిలోని వోక్స్ వ్యాగన్ (జర్మన్ లో వాగన్ గా ఉఛ్ఛరిస్తారు) షో రూమ్ లో ఓ వ్యక్తి బ్రాండ్-న్యూ వోక్స్ వ్యాగన్ వర్టస్‌ను కొనుగోలు చేశాడు. కొత్త వాహనం డెలివరీ ఇస్తామని షో రూం ప్రతినిధులు చెప్పడంతో ఆయన వచ్చాడు. తన కొత్త కారును చూసి ఎంతో మురిసిపోయాడు. షో రూమ్ నుంచి కారు కీస్ తీసుకుని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆయన సంతోషం ఎంతో సేపు నిలువలేదు. కారు స్టార్ చేసి బయటకు తీసుకొస్తున్న సమయంలో డ్రైవింగ్ లో తడబడటంతో కారు షో రూమ్ నుంచి బయటకు దూసుకొచ్చింది. సుమారు 7 అడుగుల ఎత్తులో ఉన్న షో రూమ్ నుంచి ఎదురుగా ఉన్న రోడ్డు మీద పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనదారుడికి ఎలాంటి గాయాలు కానప్పటికీ, కారు ముందు భాగం కాస్త డ్యామేజ్ అయ్యింది. గ్రిల్ సహా కొన్ని భాగాలు విరిగిపోయాయి. ప్రస్తుతం యాక్సిడెంట్ విజువల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
కారు డెలివరీ సమయంలో సర్వసాధారణం
కొత్త కారు డెలివరీ సమయంలో ప్రమాదాలు జరగడం కామన్ గా మారింది. కొత్త కారు కొలతలు, స్టీరింగ్, పవర్ కలిబ్రేషన్ ల విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాదు, కొత్త కారు కొనుగోలు ఉత్సాహంలో ఉన్న వాహనదారులు చేసే పొరపాట్ల కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరికొంత మంది వాహనదారులు ఇంజిన్ అందించే స్పీడును తెలుసుకోవడంలో పొరపాటు చేయడం ద్వారా కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ డాది ప్రారంభంలో బెంగళూరులో బ్రాండ్-న్యూ మహీంద్రా థార్ డెలివరీ తీసుకుంటున్న కస్టమర్ షోరూమ్ గుండా వెళ్లి రోడ్డుపై పడిపోయాడు. గతేడాది కూడా ఇదే తరహా ఘటనతో షోరూమ్ మొదటి అంతస్తు నుంచి టాటా టియాగో కారు పడిపోయింది. కస్టమర్ షోరూమ్ లోపల కీస్ తీసుకున్నాడు. డీలర్‌షిప్ సిబ్బంది కారు గురించి వివరిస్తున్నారు. అదే సమయంలో కారు స్టార్ట్ అయి నేరుగా అద్దాలను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది.
Read Also: రూ.10 లక్షల్లోపు కారు కొనాలి అనుకుంటున్నారా? ఓసారి ఈ బెస్ట్ కార్ల లిస్టు చెక్ చేయండి!