Ugadi Panchangam in Telugu (2023-2024): శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు!
ఉగాది పంచాంగం: ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ వ్యయాలు, అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికోసమే ఏ రాశివారికి ఎలా ఉందో ముందుగానే అందిస్తోంది మీ ఏబీపీ దేశం
Sri Sobhakritu Nama Samvatsaram (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023-2024 కన్యా రాశి ఫలితాలు
కన్యా రాశి
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం : 2 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 4 అవమానం : 7
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కన్యారాశివారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. శని సంచారం శుభాన్నిస్తాడు...ఆర్థికంగా బావుంటుంది , అభివృద్ధి వైపు అడుగేస్తారు.. అయితే అష్టమంలో ఉన్న గురుడు సంచారం ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. రాహువు సంచారం వల్ల లోలోపల భయం, ఆందోళన, చికాకులు తప్పవు.. కన్యా రాశివారికి 2023-2024 ఎలా ఉంటుందంటే...
- శని శుభస్థానంలో ఉండడం వల్ల ఆర్థికంగా పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు
- ఎదుటివారినుంచి పొంచి ఉన్న అపాయాన్ని ముందే గుర్తిస్తారు...ఉపాయంతో ముందుగా తప్పించుకుంటారు, ఎలాంటివారినైనా మీవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అవుతారు
- రాహువు సంచారం వల్ల ఆందోళన పెరుగుతుంది, అనుకోని సమస్యలు ఎదురవుతాయి..వ్యసనాలబారిన పడతారు, సంపాదిస్తారు కానీ నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది
- అష్టమంలో గురువు సంచారం ఆరోగ్యంపై దెబ్బకొడతాడు,శత్రువలు పొంచిఉంటారు..అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే
ఉద్యోగులకు
శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో కన్యారాశి ఉద్యోగులకు అనుకూల సమయం కాదు. ఊహించని పరిణామాలు జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు దూరప్రాంత బదిలీలు జరుగుతాయి. చేయనిపనులకు శిక్ష అనుభవిస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో ఓ మెట్టు ఎక్కుతాం అనే ఆశ ఈ ఏడాది కూడా నిరాశగానే మిగులుతుంది
Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రశాంతత ఉండదు, కక్కలేక-మింగలేక అన్నట్టుంటుంది పరిస్థితి
విద్యార్థులకు
కన్యారాశి విద్యార్థులకు ఈ ఏడాది గురుబలం లేదు..ఫలితంగా జ్ఞాపకశక్తి ఉండదు. ఇతర విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షలు బాగా రాయలేరు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు మంచి ర్యాంకులు పొందలేరు..అనుకున్న కాలేజీల్లో సీట్లు దక్కించుకోలేరు. బాగా కష్టపడితే సాధారణ ఫలితాలు పొందే అవకాశం ఉంది
వ్యాపారులకు
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వ్యాపారులకు కూడా అంతగా కలసిరాదు. ఆశించిన స్థాయిలో వ్యాపారాలు పుంజుకోవు. ఈ రాశివారి కొన్ని వ్యాపార సంస్థలు మూతపడే స్థాయికి వెళ్లిపోతాయి. భాగస్వామ్య వ్యాపారంలో విరోధాల వల్ల వ్యాపారాలు ఆగిపోతాయి. ఫైనాన్స్ , షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి నష్టాలు తప్పవు
రాజకీయ నాయకులకు
కన్యా రాశి రాజకీయనాయకులకు ఈ ఏడాది అనుకూలంగా లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పొందుతారు. అధిష్టాన వర్గంలోనూ మీపై సదభిప్రాయం ఉండదు. ఎన్నికల్లో పోటీచేసినా విజయం సాధిస్తారనే నమ్మకం లేదు..శత్రువర్గం ఆరోపణల వలయంలో చిక్కుకుంటారు
Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి శని కరుణించినా గురుబలం లేదు, కొన్ని రంగాలవారికి మాత్రం అద్భుతంగా ఉంది
వ్యవసాయదారులకు
ఈ రాశి వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా కలసి రావు..ఆశించిన దిగుబడి ఉండదు. అప్పులపాలవుతారు...రుణాలు చెల్లించలేక ఇబ్బంది పడతారు. కౌలుదార్లకు నష్టాలు తప్పవు. పండ్లతోటలు, నర్సరీలు, ఔషద మొక్కలకు సంబంధించిన వ్యాపారులకు పర్వాలేదు. చేపలు, రొయ్యల చెరువులు మెంటైన్ చేసేవారికి నష్టాలు తప్పవు
- కన్యారాశికి చెందిన ఉత్తర నక్షత్రం వారికి ఈ ఏడాది ఇంట్లో శుభకార్యాలు
- హస్తా నక్షత్రం వారికి ఈ ఏడాది గౌరవం, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది
- చిత్త నక్షత్రం వారికి నూతన గృహ యోగం ఉంది
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.