YSRCP BC Leaders : డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !
బీసీల మద్దతు కోసం వైఎస్ఆర్‌సీపీ మరోసారి ప్రచార కార్యాచరణ ప్రణాళిక రెడీ చేసుకుంది. డిసెంబర్ 8న విజయవాడలో బహిరంగసభ నిర్వహించనున్నారు.
YSRCP BC Leaders : డిసెంబర్ 8వ తేదీన విజయవాడలో భారీ బీసీ బహిరంగసభ నిర్వహించాలని వైఎస్ఆర్‌సీపీ నిర్ణయించుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ సభ జరపనున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్‌సీపీ బీసీ ముఖ్య నేతలతో విజయసాయి రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాలనాయుడు, వేణుగోపాలకృష్ణ, జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి..ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్ యాదవ్, పార్థసారథి, ఎంపీ మోపిదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో .. చెప్పేందుకు భారీ బహిరంగసభ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
బీసీల మద్దతు పొందేందుకు ప్రత్యేక ప్రణాళిక
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్‌సీపీ బీసీలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. రానున్న రోజులోల బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపైనా సమావేశంలో చర్చించారు. బీసీ వర్గాలకు ఇంకా ఏం చేయాలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని నేతలు చెబుతున్నారు. రూట్‌మ్యాప్‌పై చర్చిస్తున్నామన్నారు. త్వరలో జిల్లా స్థాయిలో సదస్సులు పెట్టాలని నిర్ణయించనున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేనంత మేలు బీసీలకు చేశామని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు. ఈ అంశాన్ని బీసీలకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలనుకుంటున్నారు. గతంలో సామాజిక న్యాయ భేరి యాత్రను మంత్రులు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ చేశారు. ఆ తరహాలోనే మరోసారి బీసీ నేతలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
పలు రకాల కార్యక్రమాలకు వైఎస్ఆర్‌సీపీ నేతల సన్నాహాలు
బీసీ నేతలతో సభలు, సమావేశాలు.. సామాజిక వర్గ సంఘాలతో ఆత్మీయ భేటీలు నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రదానంగా తొమ్మిది మంది కీలక నేతలతో ఓ టీమ్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాలను ఆకట్టుకునే రౌండ్ టేబుల్ భేటీలు.. ఇతర కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. లబ్దిదారులతో సమావేశాలు నిర్వహించి తమ జీవితాలు ఎలా బాగుపడ్డాయో ప్రజలకు వివరించేఅవకాశాలున్నాయని చెబుతున్నారు. అదే సమయంలో యాభైకి పైగా బీసీ కులాలకు ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా వేల కోట్లను.. బీసీలకు ఇచ్చామని.. ప్రభుత్వం చెబుతోంది. ఆ వివరాలను కూడా ప్రజలకు వివరించి.. వారి మద్దతు కూడ గట్టే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికల్లో గెలవాలంటే బీసీల మద్దతు కీలకమని వైఎస్ఆర్‌సీపీ పెద్దల భావన
వచ్చే ఎన్నికల్లో బీసీల మద్దతు తమకు అత్యంత కీలకమని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ భావిస్తున్నారు . గత ఎన్నికల్లో వారు అండగా ఉండటం వల్లే భారీ మెజారిటీ సాధించామని ఆయన భావిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని .. బీసీలకు మేలు చేశామని గట్టి నమ్మకంతో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వంలో బీసీలకు ఏ మేలూ జరగలేదని.. తాము వచ్చిన తరవాతే .. వారికి మేలు జరిగిందని.. వచ్చే రెండు, మూడు నెలల పాటు ప్రజలకు వివరించాలని అనుకుంటున్నారు. బీసీల గర్జన సదస్సులు.. రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఇతర కార్యాచరణపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.