Vizag Crime News: విశాఖలో అమానవీయ ఘటన, రైతును కొట్టి సంచుల్లో చుట్టి పడేసిన వ్యక్తులు
Vizag Crime News: విశాఖలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పిక్నిక్ కు వచ్చిన 10 మంది ఒక రైతుపై దాడి చేసి సంచుల్లో చుట్టి పడేశారు.
Vizag Crime News: ఏపీ విశాఖపట్నం పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. రైతును కొందరు వ్యక్తులు తీవ్రంగా కొట్టి ఎరువ సంచుల్లో చుట్టేసి పడేశారు. పిక్నిక్ కు వచ్చిన వారు ఆ తోటకు కాపలా ఉండే రైతును తీవ్రంగా కొట్టారు. అనంతరం ఆ రైతు కాళ్లు, చేతులు, తలకు ఎరువుల సంచులు చుట్టి కట్టేసి పడేశారు. విశాఖపట్నం నగరం పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అన్నదాతను తీవ్రంగా కొట్టడమే కాకుండా అలా కట్టి పడేయడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతును గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ - జీవీఎంసీ నాలుగో వార్డు పరిధిలోని జేవీ అగ్రహారానికి చెందిన కొల్లి సురేంద్రగా గుర్తించారు.
రైతును కొట్టి, సంచుల్లో చుట్టి
సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంట్లో నుండి బయటకు వెళ్లారు కొల్లి సురేంద్ర. బంధువు అప్పల స్వామితో కలిసి జేవీ అగ్రహారం సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల్లో జీడితోటకు కాపలా ఉండేందుకు వెళ్లారు. అదే సమయంలో ఎర్రమట్టి దిబ్బల్లోని వ్యూ పాయింట్ దగ్గరకు 10 మంది సభ్యులతో కూడిన కుటుంబం అక్కడికి పిక్నిక్ కు వచ్చింది. రైతులు కొల్లి సురేంద్ర, అప్పలస్వామికి పిక్నిక్ కు వచ్చిన కొమ్మాదికి చెందిన వెంకటరెడ్డికి మధ్య గొడవ జరిగింది. వాళ్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో భయపడి పోయిన అప్పలస్వామి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కానీ రైతు సురేంద్రను వాళ్లు తప్పించుకోకుండా పట్టుకున్నారు. వారి నుంచి తప్పించుకున్న అప్పలస్వామి గ్రామానికి వచ్చిన స్థానికులకు విషయం చెప్పాడు. ఎర్రమట్టి దిబ్బల్లో గొడవ జరిగిందని పది మంది వారిపై దాడి చేశారని చెప్పగా గ్రామస్థులంతా కలిసి అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సురేంద్ర మాత్రం కనిపించలేదు. ఎంత వెతికినా సురేంద్ర ఆచూకీ దొరకలేదు. దీంతో కొల్లి సురేంద్ర భార్య పైడమ్మ, పది మంది పర్యాటకులు తన భర్త సురేంద్రపై దాడి చేసి కిడ్నాప్ చేశారని భీమిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అపస్మారక స్థితిలో కనిపించిన రైతు
సోమవారం కనపడకుండా పోయిన సురేంద్ర కోసం ఒకవైపు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, గ్రామస్థులు వెతికారు. మరోవైపు పోలీసులు సురేంద్ర జాడ కోసం గాలింపు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున జేవీ అగ్రహారం గ్రామ పొలిమేరలో అపస్మారక స్థితిలో ఉన్న రైతు కొన్ని సురేంద్రను గ్రామస్థులు గుర్తించారు. ముఖానికి ఎరువుల సంచులు చుట్టేసి, కాళ్లు చేతులు కట్టి పడేసి ఉన్నాయి. రైతును గుర్తించిన వెంటనే స్థానికులు రైతు కొల్లి సురేంద్ర కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారు సురేంద్రను భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం అక్కడి నుంచి విశాఖలోని కేజీహెచ్ కు తరలించారు.
రైతులకు, పర్యాటకులు మధ్య గొడవ ఎందుకు జరిగింది. రైతు సురేంద్రను కొట్టి పడేసిన ఆ 10 మంది ఎవరు, ఎక్కడి ప్రాంతానికి చెందిన వారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేంద్ర కోలుకున్న తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.