విశాఖ ప్రజారాజధాని కాదు- విజయసాయిరెడ్డి రాజధాని: రామ్మోహన్ నాయుడు
వికేంద్రీకరణ పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాటుగా స్పందించారు. అమరావతి రైతుల పాదయాత్ర టైంలోనే వైసీపీకి ఉత్తరాంధ్రపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జరుగుతున్నది అభివృద్ధి వికేంద్రీకరణ కాదని, అవినీతి వికేంద్రీకరణ అనే టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. విశాఖపట్నం ప్రజల రాజధాని కాదని విజయసాయిరెడ్డి రాజధాని అని అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిని విశాఖపట్నం వరకు తీసుకురావటానికే మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
రాజధానులు మార్చే ఆలోచన అప్పట్లో తుగ్లక్‌కు ఇప్పట్లో మళ్ళీ జగన్‌కే వచ్చిందన్నారు రామ్మోహన్. అమరావతి రైతుల మహా పాదయాత్ర సమయంలోనే వైసీపీ నేతలకు ఉత్తరాంధ్ర పై ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు. విశాఖ రాజధాని వల్ల ప్రజాలకంటే విజయసాయిరెడ్డికే ఎక్కువ లబ్ది చేకూరుతుందని ఆరోపించారు.
విశాఖలో జరుగుతున్న అవినీతిపై జగన్ సిబిఐ విచారణకు ఆదేశించాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. నిజంగా విశాఖను అభివృద్ధి చేస్తామంటే సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేసేందుకు రికార్టులన్నింటినీ మార్చేస్తున్నారి ఆరోపించారు. అలాంటివి ఎక్కడ బయటకు వస్తాయో అన్న భయంతో రాజధానిపేరుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకు వేసిన ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. దీన్ని కచ్చితంగా ప్రజలు తిప్పి కొడతారని అభిప్రాయపడ్డారు.
ఇక్కడ రాజధాని పేరుతో ఎక్కువగా విజయసాయిరెడ్డి లాభపడ్డారని ఆరోపించారు రామ్మోహన్ నాయుడు. నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలని ఉంటే విజయసాయిరెడ్డి భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలని సూచించారు. జగన్‌కు కావాల్సింది ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య కొట్లాటని... చర్చకు రావాల్సిన ప్రజాసమ్యలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై తాత్సారం చేస్తుంటే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఏం చేశారని రామ్మోహన్ ప్రశ్నించారు. ఒక్క ఇటుకైనా వేయకపోతే ఒక్కరైనా రాజీనామాకు ముందుకొచ్చారా అని నిలదీశారు. ఎంతో మంది ఉత్తరాంధ్రవాసులకు ఉపాధి కల్పించి, సంపద సృష్టికి కారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే ఒక్కరైనా రాజీనామాకు ముందుకొచ్చారా అని క్వశ్చన్ చేశారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి తీసుకొద్దామని ఒక ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ పౌరషంతో రాజీనామాకు ముందుకొచ్చారా అని ఎద్దేవా చేశారు. ఇన్ని సమస్యలను వదిలేసి...మూడేళ్లు ఏమీ ఎరగనట్టు చేసి... అమరావతి రైతులు అరసవల్లి బయల్దేరేసరికి ఇప్పుడు ఉత్తారంధ్ర గుర్తుకు వచ్చిందా అన్నారు.
అమరావతి రైతులు ఏమైనా పాకిస్థాన్ నుంచి వచ్చారా... లేకుంటే వేరే దేశం నుంచి వస్తున్నారా అని నిలదీశారు రామ్మోహన్. తమకు ఎంతో సెంటిమెంట్‌గా ఫీల్ అయిన భూములు రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చారని వాళ్లను ఇష్టారాజ్యంగా తిట్టారని ధ్వజమెత్తారు. ఇదే జగన్ మోహన్ రెడ్డి అప్పుడు అమరావతి నిర్మాణానికి అంగీకరించారా లేదా అని ప్రశ్నించారు.