Pawan Kalyan On Janasena: జనసైనికులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్- అక్టోబర్ నుంచి ప్లాన్ అమలు
Pawan Kalyan On Janasena: పార్టీ ఆవిర్భావ సభను పూర్తి సంస్థాగత సైన్యంతో సిద్ధమవుతామని ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన ఎప్పుడూ జనం కోసం నిలబడుతుందని వైజాగ్‌లో స్పష్టం చేశారు.

Pawan Kalyan On Janasena: జనసేన కేడర్ను ఉత్సాహపరిచి పార్టీ కార్యక్రమాలను యాక్టివేట్ చేసేలా ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాచరణ చేపట్టారు. అందుకు తగ్గ కార్యచరణపై చర్చించేందుకు మూడు రోజుల పాటు వైజాగ్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యార. రెండోరోజు 25 పార్లమెంట్ పరిధిలోని వీరమహిళలు, జనసేనలోని ముఖ్యమైన నేతలతో భేటీ అయ్యారు. మూడో రోజు బహిరంగ సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రెండో రోజు మాట్లాడిన పవన్ కల్యాణ్ కార్యకర్తలకు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు. అక్టోబర్ నుంచి పార్టీ శ్రేణులతో కూర్చుంటానని చెప్పుకొచ్చారు. వచ్చే ఆవిర్భావ దినోత్సవానికి పూర్తి సైన్యంతో వేడుకలు చేసుకుందామని వెల్లడించారు.
సేనతో సేనాని ... చెప్పిందంతా విని...
"మధ్యాహ్నం రెండో విడతలో రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన వారితో పవన్ ప్రత్యేకంగా మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ నిర్వహణలో సూచనలు తీసుకుంటూ.. వివిధ రంగాల నిపుణులు చెప్పే అంశాలను నోట్ చేసుకున్నారు. "పార్టీ ప్రారంభించిన తరువాత గిరిజన గ్రామాల్లో తండాల్లో క్షేత్రస్థాయిలో తిరగడం వల్ల గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిశాయి. అధికారం వచ్చిన తరువాత గిరిజన గ్రామాలకు డోలీ మోతలు లేకుండా అందమైన రహదారుల ఏర్పాటుకు అప్పటి అవగాహన ఎంతగానో పనికొచ్చింది. మహిళలు ఓర్పు, నేర్పులకు ప్రతిరూపం. వారికి జనసేన పార్టీ ఎప్పటికీ ప్రాధాన్యం ఇస్తుంది. రాజ్యాంగ పరిషత్తు కమిటీల్లో 11 మంది మహిళలు పాలుపంచుకున్న అంశం గుర్తుంచుకోవాలి. పాలనలో గానీ, పోరాటంలో గానీ మహిళలకు సాటి ఎవరూ లేరు. జనసేన పార్టీకి వీర మహిళ విభాగం ప్రధానమైన విభాగం.
కులాలు, మతాలకు అతీతం, కానీ...
"నేను ఇస్లాం, క్రిస్టియన్ ఇతర మతాలను ఎంతో ఉన్నంతంగా గౌరవిస్తాను. నాకు కులం, మతంతో పనిలేదు. సెక్యులర్ ముసుగులో హిందువులను, హిందు సంప్రదాయాలను, హిందువుల మనోభావాలను కించపరిచే వారి విషయంలో నేను సూటిగా మాట్లాడతాను. వ్యక్తిగతంగా కులం, మతం అని ఎప్పుడు చూడను, చూడబోను. కులం, మతం, ప్రాంతాలకు అతీతమైన పార్టీ జనసేన. ఏదైనా నిర్భయంగా, నిజాయతీగా మాట్లాడగలిగే ధైర్యం నాకు ఉంది. ఒక మాట మాట్లాడితే ఒక వర్గం ఓట్లు పోతాయనే భయం నాకు లేదు. అలాంటి రాజకీయాలు చేయలేను."
"మనం ఒక సమస్యను ఎత్తితే దేశం స్పందించాలి"
"జనసేన పార్టీ లీగల్ విభాగాన్ని ఏ పార్టీకి లేని రీతిలో బలమైన లీగల్ వింగ్ గా తయారు చేయాలన్నదే నా సంకల్పం. మనలో ఒకరికి కష్టమొచ్చిన అందరూ స్పందించాలన్నదే నా ఆకాంక్ష. న్యాయపరంగా పార్టీకి ప్రత్యేక వ్యూహం ఉండాలి. జనసేన పార్టీ లీగల్ వింగ్ ఒక విషయాన్ని లేవనెత్తితే అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే విషయం కావాలి. దీనికి పార్టీ నాయకులు, శ్రేణులు, చట్టాలపై అవగాహన పెంచుకోవడం ముఖ్యం."
"కష్టపడి పని చేసే వాళ్లని ప్రోత్సహించే బాధ్యత తీసుకుంటా"
పార్టీ మండల స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలను నేను కేంద్ర కార్యాలయం నుంచి తీసుకుంటాను. ఎవరికైనా పదవులు ఇస్తే... అది ఆధిపత్యం చెలయించడానికి కాదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. కచ్చితంగా ఈ ఏడాదిలో పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత నేనే తీసుకుంటాను. మీలో నాయకత్వం లేదని మీరే భావించకండి. శివ అనే 18 ఏళ్ల యువకుడు నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల జరిగే నష్టాన్ని నా దృష్టికి తీసుకురావడం వల్ల అప్పట్లో దాన్ని తెలంగాణ నాయకుల దృష్టికి తీసుకువెళ్లాను. అప్పట్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సమస్యను శివ నా దృష్టికి తీసుకురావడంతో దాని పరిష్కారం కూడా లభించింది. మనకు బలమేముంది అనుకోవద్దు. పోరాటం చేయడానికి ధైర్యం కావాలి. అప్పుడు నీ సంకల్పమే నీకు దారి చూపిస్తుంది.
అక్టోబర్ నుంచి నెలకు పదిరోజులు కేడర్‌తో భేటీ
అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే క్యాడర్‌తో విడతల వారీగా సమావేశం అవుతాను. 2026 మార్చి 14న జరగబోయే పార్టీ ఆవిర్భావ సభ పూర్తి సంస్థాగత బలంతో చేయాలన్నదే నా లక్ష్యం. దానికి అనుగుణంగా అక్టోబర్ నుంచి పార్టీ గురించి నెలలో 10 రోజులు కేటాయిస్తాను. పార్టీకి విభాగాలు అనేవి కీలకమే. అయితే భగత్ సింగ్ స్టూడెంట్ విభాగం హోల్డులో ఎందుకు ఉంచాను అంటే... విద్యార్థుల సమస్యల పట్ల పూర్తి అధ్యయనం, పోరాటాల పట్ల పూర్తి వ్యూహం ఉండాలనే దానిని హోల్డ్‌లో ఉంచాను. కచ్చితంగా పార్టీ విభాగాలు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగేలా కృషి చేస్తాను. పార్టీకి వారాహి గణం విభాగం ప్రకటించినప్పుడు చాలా మాటలు వచ్చాయి. అయితే హిందు మతంలో తప్పొప్పులు వారి మనోభావాలకు సంబంధించిన అంశాల పట్ల ఆ విభాగమే స్పందించాలన్నదే నా భావన. అందుకోసమే ఆ విభాగం ఏర్పాటు చేయాలనుకున్నాను.





















