Pawan Kalyan On Sugali Preethi: సుగాలి ప్రీతి కేసుపై నోరు విప్పిన పవన్ కల్యాణ్- ఆలస్యానికి అదే కారణమంటూ సంచలన ప్రకటన
Pawan Kalyan On Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన పార్టీ కార్యాలయం ముందే ధర్నా చేస్తానంటూ ఆమె తల్లి ప్రకటించిన వేళ జనసేనాని సంచలన ప్రకటన చేశారు.

Pawan Kalyan On Sugali Preethi: జనసేన పోరాటం ఫలితంగానే సుగాలి ప్రీతి కుటుంబానికి కొంత వరకైనా న్యాయం జరిగిందని జనసేన అధినేత, ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి పేరుతో రాజకీయం చేసి ఇప్పుడు స్పందించడం లేదంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సుగాలి ప్రీతి తల్లి మీడియాతో మాట్లాడు జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న పవన్ కల్యాణ్ జనసేనానీతో జనసేన కార్యక్రమంలో ఈ విషయంపై మాట్లాడారు.
సుగాలి ప్రీతి కేసు విషయంలో ఇప్పటికే సీఐడీ చీఫ్, హోంమంత్రి, డీజీపీతో మాట్లాడినట్టు ఉపముఖ్యమంత్రి పవన్ చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారు అయ్యాయని అన్నారు. దాని ప్రభావంతోనే నేడు కేసు ముందుకు కదలడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు."సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో నా పరిస్థితి పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న చందంగా తయారైంది. చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా? గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎదురు మాట్లాడే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే కనీసం రోడ్ల మీదకు రావడానికి ఎవరూ సాహసించని పరిస్థితి.
ఎవరూ మాట్లాడలేని సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కర్నూలు నడిబొడ్డున గళం విప్పాం. ఆ పోరాట ఫలితంగా ఆ కేసును సి.బి.ఐ.కి అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. చట్టప్రకారం వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాలు అందాయి. కర్నూలుకు 9 కిలోమీటర్ల దూరంలో దిన్నెదేవరపాడులో అయిదు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అక్కడ ఎకరం విలువ సుమారు రూ.2కోట్ల వరకూ మార్కెట్ విలువ ఉంటుందని అంటున్నారు. కర్నూలు నగరంలో భాగమైన కల్లూరు దగ్గర 5 సెంట్ల ఇండ్ల స్థలం, సుగాలీ ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. ఇదంతా మనం తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితమే.
గత ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. లెటర్ ఇచ్చి లాకర్‌లో పెట్టింది. నేను ఉపముఖ్యమంత్రి అయ్యాక సుగాలి ప్రీతి కేసుపై సీఐడీ చీఫ్‌తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. డీజీపీతో,హోంమంత్రితో మాట్లాడాను. సీఐడీ విచారణ చేపట్టిన తర్వాత తేలిన అంశం ఏంటంటే అనుమానితుల డీఎన్ఏలు సరిపోలడం లేదు. సాక్ష్యాలు తారుమారు చేశారు. గత ఐదేళ్లలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దిగజారింది. అలాంటి పరిస్థితులు ప్రక్షాళన చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నా వరకు నేను సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడాలి అని త్రికరణశుద్దిగా కోరుకుంటున్నాను. ఇది ఒక్క సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కాదు. బాలికల భద్రతకు సంబంధించిన అంశం." అని అన్నారు.





















