Srikakulam Bear: శ్రీకాకుళంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం, అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు
Srikakulam Bear: గత మూడు నెలల నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా అర్ధరాత్రి మొగిలిపాడు గ్రామంలో కనిపించగా.. ప్రజలంతా భయపడిపోయారు. దాన్ని తరిమే ప్రయత్నాలు చేశారు.
Srikakulam Bear: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది. మందస మండలం దున్నవూరు పంచాయతీ మొగిలిపాడు గ్రామంలో అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎలుగుబంటి వీదుల్లోకి వచ్చింది. విషయం గుర్తించిన పలువురు స్థానికులు ఎలుగుబంటి వచ్చిందంటూ కేకలు వేశారు. కొందరు వాటిని ఇళ్లలో నుంచే చూస్తూ.. గజగజా వణికిపోగా, ధైర్యవంతులు దాన్ని వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అంతా కలిసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ... దాన్ని తరిమికొట్టారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఎలుగుబంటిని త్వరగా పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎలుగుబంటి వల్ల ఇళ్లలోనుంచి బయటకు రావాలన్ని భయంగా ఉంటోందని వివరించారు. వ్యవసాయ క్షేత్రాలకు కూడా ఒంటరిగా వెళ్లి పనులు చేస్కోలేకపోతున్నామని తెలిపారు.
మొన్నటికి మొన్న మన్యం జిల్లాలో..
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఎలుగుబంటి సంచారంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. కురుపాం నియోజకవర్గం సూర్యనగర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు పొలాలకు వెళ్లాలంటేనా భయంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. పోడు వ్యవసాయం కోసం కొండ మీదకు వెళ్తోన్న రైతులకు ఎలుగుబంటి కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. వ్యవసాయ పనులు ముగించుకొని విశ్రాంతి కోసం కొండ మీద ఏర్పాటు చేసుకున్న పాక వద్దకు వెళ్లగా ఆ పాకలో ఉన్న ఎలుగుబంటి కనిపించిందని తెలిపారు. పోడు వ్యవసాయం చేయడానికి వెళ్లాలంటనే భయంగా ఉందని రైతులు అంటున్నారు. ఎలుగుబంటి నుంచి ఎటువంటి ప్రమాదం, ప్రాణహాని జరగకుండా ఫారెస్ట్ అధికారులు రక్షణ కల్పించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.
రెండు నెలల కిందట గ్రామస్తులపై దాడి..
ఇటీవల శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని కిడిసింగి గ్రామ శివారులో ఎలుగుబంటి గ్రామస్తులపై దాడి చేసింది. అతి కష్టంమీద దానిని పట్టుకున్నారు. విశాఖ జూకు తరలించే క్రమంలో ఎలుగుబంటి మృతి చెందింది. తాజాగా అదే ప్రాంతంలో మరో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలోని పలు గ్రామాల్లో ఎలుగుబంటి సంచారంతో గిరిజనులు హడలిపోతున్నారు. 4 రోజుల క్రితమే. కిడిసింగి వద్ద తోటల్లో ఎలుగుబంటి రైతులపై చేసిన దాడిలో ఒకరి మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలువ తాడివాడ వద్ద ఇవాళ మరో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా మండలంలో ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అప్రమత్తంగా ఉండండి..
కిడిసింగి, వజ్రపుకొత్తూరు సమీపంలోని తాడివాడ తోటల్లో కాళీమాత గుడి నుంచి గుల్లపాడు చెరువు గట్టుకు వెళ్తోన్న స్థానికులు ఎలుగుబంటిని చూశారు. తోటల్లోకి వెళ్లేందుకు గ్రామస్తులు భయపడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడిచేస్తుందో అని హడలిపోతున్నారు. వెంటనే అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకోవాలని కోరుతున్నారు. గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా అటవీ రేంజ్ ఆఫీసర్ మురళీకృష్ణ సూచించారు. గతంలో కూడా బియ్యాలవలస పంచాయతీ పరిధిలోని సూర్యనగర్, పెల్లివలస, దురుబిలి, గోటివాడ, లోమడ, బల్లుకోట గ్రామాల పరిసరాల్లో ఎలుగుబంట్లు సంచారాన్ని గుర్తించామని తెలిపారు. రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒంటరిగా పొలాలకు, తోటల్లోకి వెళ్లొద్దంటున్నారు.