Ayyannapatrudu: గుడివాడ అమర్ సవాల్‌కు అయ్యన్నపాత్రుడు ఓకే, మంత్రికి మరో ఛాలెంజ్ విసిరిన టీడీపీ నేత
అమరావతి భూములు దోచుకున్నామని టీడీపీ నేతలపై నిందలు వేయడం తగదని అయ్యన్నపాత్రుడు అన్నారు. అమరావతి భూములు, విశాఖ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విసిరిన సవాలుకు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అంగీకరించారు. మూడు రాజధానులపై ప్రజాభిప్రాయానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. దమ్ము ఉంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలని, మూడు రాజధానులే అజెండాగా ఎన్నికలకు వెళ్దామని అన్నారు. అమరావతి భూములు దోచుకున్నామని టీడీపీ నేతలపై నిందలు వేయడం తగదని అన్నారు. అమరావతి భూములు, విశాఖ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఇప్పుడు తాను విసిరిన సవాల్ ను స్వీకరించాలని అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు.
ఎంపీ విజయసాయి రెడ్డి లక్ష్యంగా కూడా అయ్యన్న పాత్రుడు ఆరోపణలు చేశారు. ‘‘విజయ సాయి రెడ్డి రూ.పది వేల కోట్లు ఆస్తులు అక్రమించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వృద్దుల కోసం ఇచ్చిన స్థలం కూడా లాక్కున్నారు.’’ అని ఆరోపించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన, సిదిరి అప్పలరాజు అతిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆయన తండ్రి ఆశీస్సులతో మంత్రి అయ్యారని, గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు. మాటలు జాగ్రత్తగా రావాలని అన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే దయ్యాలు అని అంటున్నారని విమర్శించారు.
కాలేజీల ప్రతిపాదన ఏది?
పరిశ్రమల మంత్రి అయ్యాక రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తెచ్చారో చెప్పాలి. సీఎం జగన్ చట్ట సభల్లో అబద్ధాలు చెబుతున్నారు. రేపు ఎన్నికల్లో యువత వైఎస్ఆర్ సీపీ మీద తిరగపడతారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన 16 మెడికల్ కాలేజీలకు ప్రతిపాదనలు పంపలేదని కేంద్రం నుంచి లెటర్ వచ్చింది. ఏడు కాలేజ్ లకు మాత్రమే ప్రతిపాదన పంపారు. కానీ, కేంద్రం మూడు మాత్రమే అంగీకరించింది. అసెంబ్లీలో వైద్యశాఖ మంత్రి 16 కాలేజ్ లు వస్తున్నాయని చెప్తున్నారు. ప్రతి మెడికల్ కాలేజ్ కి రూ.340 కోట్లు అంచనా వేశారు. మెడికల్ కాలేజ్ కి రాష్ట్ర వాటా అస్సలు ఇవ్వలేదు.
నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అన్నారు. అసలు ప్రతిపాదనలో నర్సీపట్నం పేరు లేకుండా జాయింట్ కలెక్టర్ భూ సేకరణ చేశారు. మెడికల్ కాలేజ్ రాకపోతే ఈ భూములు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. దీనికి వైద్య శాఖ మంత్రి విడుదల రజని సమాధానం చెప్పాలి. ఉదయం సాయంత్రం రెండు గంటలు మేక్ అప్ వేసుకోవడానికే ఆమెకు సమయం సరిపోతోంది. జిల్లా మంత్రి అమర్ దీనికి సమాధానం చెప్పాలి.
అమరావతి రైతులు యాత్రపై మాట్లాడుతూ.. ‘‘అరసవెల్లి దేవుడ్ని చూడటానికి అమర్ నాథ్ అనుమతి కోరాలా? భూములు ఇచ్చిన రైతులను దొంగలా చూస్తున్నారు. అలాగే విజయవాడ, తిరుపతి వెళ్తే అక్కడ వాళ్ళు అనుమతి ఇవ్వమంటే ఏం చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, గంగవరం పోర్ట్ అదానీకి అమ్మేస్తే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎందుకు మాట్లాడలేదు. రైతులు వస్తే వారికి పాదాభివందనం చెయ్యాలి. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు.
ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్ర జరిపిస్తాం. వారికి అండగా నిలుస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజలు అందరు రైతుల యాత్రను స్వాగతించాలి. అమరావతి రైతులు తిరుపతి యాత్ర చేశారు. అప్పుడు ఏ శాంతి భద్రతల విఘాతం ఏర్పడలేదు. అంటే ఈ రాష్ట్రంలో తిరగాలి అంటే వీసా, వైసీపీ వారి అనుమతి అవసరమా? మొదటి రోజు నుంచి అన్ని అబ్బదాలు అడుతున్నారు. రాజధానికి రూ.లక్ష కోట్లు అవుతాయని సీఎం జగన్ కి తెలియదా?’’
బోర్డులు పెట్టాలి
‘‘అమరావతి భూముల్లో చంద్రబాబు దోచుకున్నారు అని ఆరోపిస్తున్నారు. అధికారం ఉంది కాబట్టి, దానిపైనా విచారణ చేసుకొచ్చు. ఇంతకు ముందు వేసిన విచారణలు కోర్టులు కొట్టేసాయి. రుషికొండ లో కడుతున్న నిర్మాణాలు గురుంచి ఎందుకు కనీసం బోర్డ్ పెట్టలేదు. చట్ట ప్రకారం నిర్మాణాల వివరాలు పెట్టాలి’’ అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
విశాఖ భూములు సిట్ విచారణపై మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు హయాంలో విశాఖ భూముల మీద సిట్ విచారణ చేశాం. ఆ రిపోర్ట్ వచ్చే లోపు ఎన్నికలు వచ్చేశాయి. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంకో సిట్ వేశారు. మరి ఆ నివేదిక ఇవ్వలేదు. కాబట్టి, రెండు సిట్ నివేదికలు బయట పెట్టాలి.’’ అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.