Ayyanna Patrudu On AU VC : ఆంధ్రయూనివర్సిటీని వైసీపీ ఆఫీసులా మార్చేశారు, వీసీపై అయ్యన్నపాత్రుడు ఫైర్
Ayyanna Patrudu On AU VC : ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
Ayyanna Patrudu On AU VC : వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర యూనివర్సిటీ పరువు పూర్తిగా దిగజారిపోయిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ సహా అనేక మంది ప్రముఖులు ఏయూకి ఉపకులపతులుగా పనిచేశారని గుర్తుచేశారు. మరో మూడేళ్లలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏయూ పరువు పూర్తిగా దిగజారిపోయిందని మండిపడ్డారు. ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చేశారని విమర్శించారు. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్తలా వ్యవరిస్తున్నారని ఆక్షేపించారు. ఈనెల 12వ తేదీన ఏయూలో గంజాయి ప్యాకెట్లు దొరికాయన్నారు. ఏయూలో జరుగుతున్న కార్యక్రమాలపై నేను మాట్లాడితే నాకు ఫోన్లు చేసి బెదిరించారన్నారు. వీసీ ప్రసాద్ రెడ్డి ఫోన్లు చేసి బెదిరించడానికి ఒక బెంచ్ ను తయారుచేశారన్నారు.
వైసీపీకి మద్దతుగా వీసీ ప్రచారం
"ఏయూ ప్రతిష్టను దిగజార్చుతుంటే విశ్వవిద్యాలయంలో చదువుకున్న మేధావులు స్పందించాలి. జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ రాజకీయాలను ఏయూ నుంచి నడిపారు. వీసీ ప్రసాద్ రెడ్డి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల యజమాన్యాలతో సమావేశం పెట్టి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని బెదిరించారు. దీనిపై వీసీ ప్రసాద్ రెడ్డి పై జిల్లా కలెక్టర్, కేంద్ర, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాను. నాకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రిప్లై వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ , జిల్లా కలెక్టర్ నుంచి రిప్లై రాలేదు.
ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి ఉండటానికి వీలులేదు. వెంటనే రీకాల్ చేయాలి. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి ప్రవర్తనపై ప్రతిపక్ష పార్టీలు ,ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ స్పందించాలి. " - అయ్యన్న పాత్రుడు
ఏయూ వీసీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
"ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. విజయసాయి రెడ్డి పుట్టిన రోజు వీసీ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ ప్రకటించారు. అయినా వీసీ కోడ్ ఉల్లంఘన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అందుకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశాను. ఏయూ వీసీపై చర్యలు తీసుకోవాలని కోరాం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు జిల్లా కలెక్టర్ కు ఏయూ వీసీపై ఫిర్యాదు చేశాం. ఆంధ్ర యూనివర్సిటీలో గంజాయి ప్యాకెట్లు దొరుకుతున్నాయి. దీంతో యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో తెలుసుకుంది. నేను యూనివర్సిటీ గురించి మాట్లాడితే నాకు బెదిరింపు కాల్స్. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వీసీగా చేస్తున్నారు. మేము స్థానికులం. మాకు ఏయూ గురించి మాట్లాడే హక్కు ఉంది. ఏయూలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. కానీ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు. వీసీ వల్ల వర్సిటీ ప్రతిష్ఠ దిగజారిపోతుంది." - అయ్యన్నపాత్రుడు