Nuziveedu: ప్రభుత్వం జోక్యం చేసుకున్నా మారని నూజివీడు ట్రిపుల్ ఐటీ- ఫుడ్‌పై ఇంకా విద్యార్థుల ఫిర్యాదు
Eluru News: ఫుడ్ పాయిజన్ కారణంగా ఆస్పత్రిపాలైన నూజివీడు ట్రిబుల్ ఐటీ విద్యార్థులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. వారం రోజులవుతున్నా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు.
Nuziveedu IIIT News: నూజివీడి ట్రిబుల్ ఐటీలో ఏం జరుగుతోందో ఏమీ అంతుబట్టడం లేదు. ఇప్పటికే 800 మంది విద్యార్థులు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిపాలైనా పరిస్థితులు మాత్రం అదుపులోకి రావడంలో లేదు. కాలేజీ యాజమాన్యం తీరులో ఏమార్పు కనిపించడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తీవ్రమైనం జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి,తలనొప్పితో కళ్లు తిరిగి పడిపోతున్నారు. వారి ఆరోగ్యం కుదుట పడటం లేదు సరికదా, పౌష్టికాహారం అందించాల్సిన సమయంలోనూ విద్యార్థులకు పురుగులన్నం నీళ్ల చారు పోస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీలో సాక్షాత్తూ మంత్రి పర్యటించినా, నారా లోకేశ్ అధికారులను ఆదేశించినా పరిస్థితుతులు మెరుగుకాకపోవడం రాష్ట్రాన్నే విస్మయానికి గురిచేస్తోంది.
ఫుడ్ పాయిజన్ కారణంగా నూజివీడ్ ట్రిబుల్ ఐటీ చదువుకుంటున్న విద్యార్థులు వాంతులు,విరేచనాలు, తలనొప్పి, కడుపునొప్పితో బాధపడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారుతున్నాయి. అయినా ప్రభుత్వంలో కానీ, కాలేజీ యాజమాన్యంలోనూ మార్పు కనిపించడం లేదు. ఈనెల 23 నుంచి అనారోగ్య పరిస్థితులు మొదలుకాగా, ఇప్పటివరకు 1,194 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. మంత్రి కొలుసు పార్థసారథి ట్రిపుల్ ఐటీలో పర్యటించి కాలేజీ పరిసరాలు, మెస్ లను తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో మెస్ నిర్వాహకులతో సమావేశమయ్యారు. కాలేజీ, మెస్ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంత్రి వెళ్లగానే పరిస్థితి మళ్లీ మామూలైంది. భోజనంలో ఏమాత్రం నాణ్యత కనిపించడం లేదు.
పురుగుల అన్నం, పాడైన గుడ్లు, నీళ్ల పెరుగు..
గురువారం ఉదయం కూడా అల్పాహారంలో పాడైన గుడ్లు, రుచీ పచీ లేని ఉప్మా పెట్టారు. మధ్యాహ్నం భోజనానికి మాడిపోయిన బెండకాయ కూర, నీళ్ల పెరుగే గతి. ఆఖరుకి అన్నంలోనూ నాణ్యత కరువే. తినే అన్నంలో పురుగులు కనిపించడం చూస్తుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది.
ఆసుపత్రిలో అరకొర వసతులే
ట్రిపుల్ ఐటీలో ఆసుపత్రుల్లోనూ అరకొర సౌకర్యాలే ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగుల సంఖ్యను తక్కువగా చూపేందుకు ఓపీలు కూడా రాయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య పరిస్థితి విషమించినా మందులిచ్చి పంపేస్తున్నారు తప్పించి ఇన్ పేషెంట్లుగా జాయిన్ చేసుకోవడం లేదు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆసుపత్రిలో కనీసం ఓఆర్‌ఎస్ కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తెప్పించారు. ఆసుపత్రిలో 20 పడకలు మాత్రమే ఉన్నాయి. కానీ బాధితుల సంఖ్య మాత్రం వెయ్యి దాటిపోయింది.
మంత్రి తనిఖీల్లో కనిపించిన ఘోరాలు..
ట్రిపుల్ ఐటీని తనిఖీ చేయడానికి వెళ్లిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి పార్థసారథికి అక్కడి ఘోరాలను విద్యార్థులు కళ్లకు కట్టినట్టు చూపించారు. కంపు కొడుతున్న కూరలు, నాణ్యత లేని భోజనం, శుభ్రత లేని వంట గది, మెస్.. అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు విద్యార్థుల అనారోగ్యానికి కారణాలుగా తెలుస్తున్నాయి. పారిశుధ్యం లోపించిందని అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. మెస్‌లో నిల్వచేసిన సరుకులు పురుగులు పట్టి ఉండటాన్ని విద్యార్థులు చూపించారు. దీంతో స్పందించిన మంత్రి పార్థసారథి ట్రిపుల్ ఐటీపై ప్రత్యేక దృష్టిపెడతానని హామీ ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కాలేజీని పరిశీలించారని వారి నివేదికను బట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అయినా ఇంతవరకు ఆ మార్పేమీ కనిపించలేదని విద్యార్థులు చెబుతున్నారు. డీఎంహెచ్‌వో, వైద్య ఆరోగ్యశాఖ జేడీ, ఇలా అధికారులు ఒకరితర్వాత ఒకరు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప, పరిస్థితుల్లో మార్పు రావడం లేదంటున్నారు. కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా భోజనం తినలేదని పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నారు.
Also Read: 'న్యాయం కోరడమే నేరమా?' - సీక్రెట్ కెమెరా గురించి చెబుతున్నా పట్టించుకోలేదని విద్యార్థినుల ఆవేదన