Botsa Satyanarayana: కమిటీ విచారణ చేస్తుండగా ఇదేంపని - యూటీఎఫ్ సీఎంవో ముట్టడిపై బొత్స ఆగ్రహం
Chalo UTF: ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉందని బొత్స సత్యనారాయణ అన్నారు. నివేదిక అనంతరం సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Chalo CMO in Vijayawada: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (United Teachers Federation) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడికి యత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ మేరకు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ అంశంపై ప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ కమిటీ నుంచి అధ్యయనం చేశాక వారి నివేదిక ప్రకారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ లోపే ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడికి వెళ్లడం ఎంత వరకూ కరెక్టు? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అవకాశం ఉన్నంత వరకు ప్రతి అంశాన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పుకొచ్చారు.
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉందని బొత్స సత్యనారాయణ అన్నారు. నివేదిక అనంతరం సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు.
విజయవాడలో ఉద్రిక్తతలు
సీఎం ఇంటిని ముట్టడించేందుకు యత్నిస్తున్న యూటీఎఫ్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉద్రిక్తత నెలకొని ఉంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిరసనలు చేస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాలు ఎక్కించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి నిలిపివేస్తుండటంతో.. సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ పనుల్లో భాగంగా బయటకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. గుర్తింపు కార్డు చూపాలని ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కృష్ణాజిల్లా పెనమలూరులోని కంకిపాడులో జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
సీఎం ఇంటివద్ద పటిష్ఠ బందోబస్తు
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలువునివ్వడంతో... పోలీసులు ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముందస్తుగా 650 మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు చేపట్టారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లోనూ పోలీసులు మోహరించి వాహనాలను క్షణ్నంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని మార్గాల్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి... పర్యవేక్షిస్తున్నారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి నుంచి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వైపు... కిందకు ఎవరూ దిగకుండా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజి, కనకదుర్గ వారధికి వెళ్లే ముందే తనిఖీలు చేస్తూ... అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ముందస్తుగానే అరెస్టు చేస్తున్నారు.
ఛలో యూటీఎఫ్‌కు ఎలాంటి అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణా టాటా తేల్చి చెప్పారు. నిరసనల్లో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని యూటీఎఫ్ నేతలు స్పష్టం చేశారు.