Minister Buggana : ఆ రూ.48 వేల కోట్లకు లెక్కలున్నాయి - ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీపై మంత్రి బుగ్గన ఏమన్నారంటే?
Minister Buggana : ఏపీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని కాగ్ ఇచ్చిన నివేదికపై మంత్రి బుగ్గన స్పందించారు. అన్నింటికీ లెక్కలు ఉన్నాయని స్పష్టం చేశారు. టీడీపీ 2022-23 బడ్జెట్ చూస్తే అన్నీ అర్థమవుతాయన్నారు.
Minister Buggana : ఏపీ ఆర్థిక లావాదేవీలపై కాగ్ ఇచ్చిన నివేదికపై ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. లెక్కల్లో చూపని రూ.48 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆర్థిక ఎమర్జెన్సీ అని టీడీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి తప్పుబట్టారు. 2022-23 బడ్జెట్ చూస్తే టీడీపీ అన్ని అర్థమవుతాయన్నారు. వేల కోట్ల ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందని మంత్రి ప్రశ్నించారు. సీఎఫ్ఎంఎస్ నుంచి తప్పులు సరిదిద్దడానికి సమయం పడుతుందని, రూ.48,509 కోట్లు ప్రత్యేక బిల్లుల రూపంలో ఉన్నాయన్నారు. వాటికి త్వరలోనే లెక్కలు చెబుతామన్నారు.
అన్నింటికీ లెక్కలు ఉన్నాయ్
రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు ప్రతీ అంశానికి పద్దు ఉందని మంత్రి బుగ్గన అన్నారు. నిధుల దుర్వినియోగం అయ్యే ప్రసక్తే లేదన్నారు. 15 అంశాల వారీగా కాగ్‌కు నివేదిక అందించామన్నారు. 2018-19లో టీడీపీ ప్రభుత్వం కూడా చాలా బుక్ అడ్జెస్ట్‌మెంట్స్ చేసిందన్నారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను టీడీపీ ఏకంగా ఓ ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎఫ్ఎంఎస్ వ్యవస్థకు ఐఏఎస్ అధికారిని సీఈఓగా నియమించిందన్నారు. టీడీపీ ప్రభుత్వం పెట్టిన రూ.68 వేల కోట్ల బకాయిల కోసం ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలా? అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు, ఫైబర్ గ్రిడ్, టిడ్కోపై సీబీఐ విచారణకు టీడీపీ సిద్ధమా అని మంత్రి బుగ్గన సవాల్ చేశారు. రూ.100 కూడా బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలు జరగలేదన్నారు.
పిల్లల చదువులకు అప్పులు
కరోనా కారణంగా రూ.30 వేల కోట్ల ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకున్నామని మంత్రి బుగ్గన అన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో అన్ని లెక్కలు ఉన్నాయని స్పష్టం చేశారు. 2017-18 టీడీపీ హయాంలో రూ.82 వేల కోట్లు లెక్కల్లో లేని ఖర్చు అయిందన్నారు. ఈ నిధులు దుర్వినియోగం చేసినట్లేనా అని బుగ్గన ప్రశ్నించారు. పేదవాళ్లు, విద్యార్థుల కోసం వైసీపీ ప్రభుత్వం అప్పు చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం పిల్లల చదువు కోసం అప్పు చేస్తే టీడీపీ కత్తెర, ఇస్త్రీ పెట్టేల కోసం అప్పులు చేసిందని ఎద్దేవా చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలని టీడీపీ వాదనలు మొదలుపెట్టారని బుగ్గన ఆరోపించారు.