Araku Coffee: అరకు కాఫీ అద్భుతం - ఐక్య రాజ్య సమితి ప్రశంసలు
Visakha News: అరకు కాఫీ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. గిరిజన మహిళలు సాగు చేస్తోన్న అరకు కాఫీ అద్భుత నారీశక్తికి చిహ్నమని ఐరాస ప్రతినిథులు ప్రశంసలు కురిపించారు.
![Araku Coffee: అరకు కాఫీ అద్భుతం - ఐక్య రాజ్య సమితి ప్రశంసలు united nations organisation appreciation of araku coffee Araku Coffee: అరకు కాఫీ అద్భుతం - ఐక్య రాజ్య సమితి ప్రశంసలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/10/0244800283ce6ce0b5be9322c5e9f1d41710047616258876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UNO Appeciates Araku Coffee: అరకు కాఫీ (Araku Coffee) ఘుమఘుమలపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. రాష్ట్రంలోని అరకు లోయలో (Araku Valley) మహిళలు పండిస్తున్న కాఫీ చక్కటి సువాసనతో అద్భుతంగా ఉంటుందని.. ఐక్య రాజ్య సమితి ప్రతినిధులు ప్రశంసించారు. 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా ఐరాసలో భారత శాశ్వత మిషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా గిరిజన తెగలు సాగు చేస్తోన్న 'అరకు కాఫీ' ప్రస్థానంపై నిర్వాహకులు ప్రధానంగా దృష్టి సారించారు. 'సీడ్ టు కప్' పేరిట అరకు కాఫీ సాగులో మహిళల ప్రభావవంతమైన పాత్రను వివరించారు. కాఫీ సాగు ద్వారా ఆర్థిక సామాజిక విప్లవాన్ని తీసుకురావడంలో అరకు మహిళల కీలక పాత్ర ఉందని, వారు భారత నారీశక్తికి చిహ్నాలని కొనియాడారు. గొప్ప పరివర్తనా పటిమ గల 'నారీశక్తి' దేశ ప్రగతిదాయక పయనాన్ని చాటుతోందని ప్రశంసలు కురిపించారు.
అతివల సారథ్యంలో ప్రగతి సాధనపై భారత నిబద్ధత ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని ఐరాస జనరల్ 78వ సభ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ అన్నారు. ఈ ఏడాది జనవరిలో తాను భారత్ లో పర్యటించినప్పుడు అక్కడి 'నారీశక్తి' పరివర్తన ఫలాలను ప్రత్యక్షంగా చూసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కాఫీ సాగు ద్వారా వ్యవసాయ, ఆర్థిక, సామాజిక విప్లవాన్ని తీసుకురావడంలో అరకు మహిళల పాత్రకు ఓ గుర్తింపుగా పేర్కొన్నారు. భారత మహిళలకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసంధానం చేసిన విధానం గొప్పగా ఉందని ఐరాస డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్ తెలిపారు. చక్కని సువాసన గల అద్భుతమైన అరకు కాఫీ సాగులో మహిళల పాత్ర అత్యంత కీలకమని భారత్ మిషన్ తెలిపింది. 'అరకు మహిళలు సాగు చేస్తున్న ఆర్గానిక్ కాఫీ అద్భుతమైన మా ప్రయాణానికి ఓ చిహ్నం' అని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐరాస దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు అరకు కాఫీ రుచి చూశారు.
అందుకే బెస్ట్ కాఫీ..
ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీకి మంచి పేరుంది. ఇక్కడ పోడు వ్యవసాయం అధికం. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు. అందుకే మంచి రుచి, రంగు, వాసన ఉంటుంది. చాలామంది రైతులు పంటను పండించి గింజలను వివిధ కంపెనీలకు అమ్ముతుంటారు. అయితే కొంత మంది మాత్రం ఇంట్లోనే కాఫీ పొడిని తయారు చేసి అమ్ముకుంటూ.. స్వయం ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి విశాఖ మన్యంలో అరకు కాఫీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రాంత ఇది. ఇక్కడి చల్లని వాతావరణం ఉండడంతో ఇతర పంటలు కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి అనుకూలంగా ఉంటుంది. కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకున్న తర్వాత పళ్లు తీసి ఎండబెట్టి వాటిని గ్రేడింగ్ చేసి గిరిజన కో ఆపరేటీవ్ సొసైటీలకు, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతూ ఉంటారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు రాగా.. గిరిజనులకు మంచి ఉపాధి లభించింది. అమెరికాలో కూడా పలు చోట్ల స్టాల్స్ ఉన్నాయి.
Also Read: Chandrababu: కేంద్రం సహకారం కోసం బీజేపీతో పొత్తు- ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)