Chandrababu: కేంద్రం సహకారం కోసం బీజేపీతో పొత్తు- ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం అని, ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
ఢిల్లీ: ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరం అని, ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బీజేపీతో పొత్తుపై క్లారిటీ రావడం, సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదరడంపై చంద్రబాబు ఇలా స్పందించారు. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూటమిగా ఏపీ ఎన్నికలకు వెళ్తున్నాయని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరిన తరువాత శనివారం ఢిల్లీ నుంచి పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి కేంద్రం సహకారం అవసరమని నేతలకు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా కొందరికి సీట్లు రాకపోతే నిరుత్సాహపడొద్దని, పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలని పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చిందని... త్వరలోనే మరోసారి భేటీ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని మోదీ?
టీడీపీ, జనసేన ఈనెల 17న చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా బీజేపీతో పొత్తు కుదరడంతో మూడు పార్టీలు కలిసి ఈ సభను నిర్వహించనున్నాయి. ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ 17న ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ ఉంటే, 18కి బహిరంగ సభ వాయిదా వేస్తారని వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, మరోసారి ఎన్డీఏలోకి టీడీపీ చేరిన తరువాత నిర్వహిస్తున్న సభ కావడంతో భారీగా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు.
రెండు విడతలుగా చర్చలు.. పొత్తుపై క్లారిటీ
ఢిల్లీలో రెండు విడతలుగా చంద్రబాబు, పవన్ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. పొత్తుల అంశంపై శనివారం నాడు స్పష్టత వచ్చింది. టీడీపీ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో, జనసేన 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జనసేనకు కాకినాడ, మచిలీపట్నం లోక్‌సభ స్థానాలు ఫిక్స్ చేశారు. రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. ఏపీ అసెంబ్లీ స్థానాల్లోనూ లెక్క కుదిరింది. టీడీపీ 145 స్థానాల్లో పోటీ చేయనుండగా.. బీజేపీ, జనసేనకు కలిసి 30 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో ఇరవై నాలుగు స్థానాల్లో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. అయితే త్వరలోనే అభ్యర్థుల రెండో జాబితాపై భేటీ కానున్నారు.