Tirupati Nitya Annadanam: తిరుమలలో నిత్య అన్నదానం ఇలా మొదలైంది, కానీ ప్రైవేట్ హోటల్స్ ఎందుకు మూసేస్తున్నారంటే!
Tirupati Nitya Annadanam: రుమలలో భక్తులు ఎవరూ భోజనాన్ని డబ్బు వెచ్చించి కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతో కొండపైన ప్రైవేటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తొలగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
Sri Venkateswara Nitya Annandana Scheme: భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో తిరుమలలో కొండపైన ప్రైవేటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తొలగించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తిరుమలలో అన్ని తరగతులకు చెందిన భక్తులందరికీ ఒకే రకమైన భోజనాన్ని అందించనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy) తెలిపారు. తిరుమలలో భక్తులు ఎవరూ భోజనాన్ని డబ్బు వెచ్చించి కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
టీటీడీ అన్నదానం ఎప్పడు ప్రారంభమైందంటే..
18వ శతాబ్ధంలో అన్నప్రసాదాన్ని (Tirupati Nitya Annadanam) ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ సమయంలోనే అన్నదానం ప్రారంభించినట్లు పత్రాలు కూడా ఉన్నాయి. స్ధానికంగా ఉన్న కొందరూ నిత్యం తిరుమలకు విచ్చేసే భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించే వారు. ఆ తరువాత తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో అన్నప్రసాద సత్రంను భక్తులకు కోసం టీటీడీ ప్రారంభించింది. 1985 ఏప్రిల్ 6వ తేదీన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చేతుల మీదుగా శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదానం పథకాన్ని ప్రారంభించారు. మొదట్లో రోజుకు వెయ్యి నుండి 1500 వందల వరకూ భక్తులు తిరుమలలో అన్నప్రసాదాలు స్వీకరించేవారు.
1994సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైంది. దీనికి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం (Sri Venkateswara Nitya Annandana Scheme) ట్రస్టుగా నామకరణం చేశారు. ప్రస్తుతం రోజుకు నలభై వేల నుండి అరవై వేల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తుల సంఖ్య క్రమేపీ పెరుతుండడంతో అందుకు తగ్గట్టు మరింత రుచికరంగా, శుచిగా అన్నప్రసాదాలను తయారు చేస్తోంది టీటీడీ. 2011 లో తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో ఓ దాత సాయంతో 33 కోట్ల రూపాయలతో అధునాతన అన్నప్రసాదం కాంప్లెక్స్ భవనాన్ని టీటీడీ నిర్మించింది.
అన్నప్రసాద భవనంలో రెండు అంతస్తుల్లో నాలుగు భోజనశాలలు ఉన్నాయి. ఒక్కో భోజనశాలలో వెయ్యిమంది చొప్పున నాలుగు వేల మంది భక్తులు ఎక్కడా వేచి ఉండే అవసరం లేకుండా భోజన సదుపాయం కల్పిస్తుంది. ఈ భవనంలో కూరగాయలు నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజ్ గదులు, వంట సరుకుల నిల్వ కోసం ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వరర అన్నప్రసాదం ట్రస్టుకు దాతలు విరివిగా విరాళాలు సమర్పించి శ్రీవారిపై భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్రస్టుకు వివిధ జాతీయ బ్యాంకుల్లో 1400 కోట్ల రూపాయలపైగా ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ మొత్తంపై వచ్చే వడ్డీని భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు వినియోగిస్తున్నారు.
శ్రీవారిపై భక్తి భావంతో వివిధ ప్రాంతాలకు చేందిన దాతలు, కూరగాయలు, నిత్యవసర సరుకులు, నగదు రూపంలో భక్తులు అన్నదానంకు విరాళాలు అందిస్తూ రావడంతో సంవత్సరానికి 2 కోట్ల మందికిపైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు అందిస్తోంది. ఇలా అన్నదాన కాత్యక్రమానికి దాదాపు ఏడాదికి 70 కోట్ల రూపాయల వరకూ టీటీడీకి ఖర్చు అవుతుంది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలోనే కాకుండా, మాధవ నిలయం, రద్దీ ప్రాంతాల్లో మినీ అన్నప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నప్రసాదాన్ని శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అందిస్తోంది. అంతే కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్, పిఎసి-2, రాంభగీఛ్ఛా బస్సు స్టాండ్, బాలాజీ బస్సు స్టాండ్, నందకం అతిథి గృహం, కాలినడక మార్గంలో అన్నప్రసాదాలు వితరణ చేస్తున్నారు. అయితే తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి రోజుకు 15టన్నుల బియ్యం, 8 టన్నుల కూరగాయలను టీటీడీ వినియోగిస్తుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ ద్వారా టిటిడి బియ్యం కొనుగోలు చేస్తే, ఎక్కువ శాతం కూరగాయలు దాతల నుంచి విరాళంగా స్వీకరిస్తోంది. వంకాయలు, టమోటా, క్యాబేజీ, ముల్లంగి, ఆకు కూరలు, క్యాబేజీ, క్యారెట్, బీటురూట్, ఎర్రగడ్డలు వంటివి దాతలు విరాళాలు అందించగా వీటిని మాతృశ్రీ తరిగొండ అన్నదాన సత్రంలోని కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరుస్తారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం ఏడు గంటల నుండి అల్పాహారాన్ని ప్రారంభించి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాన్ని భక్తులకు అందిస్తారు. రాత్రి 11 గంటలకు అన్నదాన సత్రం క్లోజ్ అవుతుంది.
తిరుమలలో వసతి గృహాలకు అన్నదాన సత్రం దూరం కావడంతో ఎక్కువ శాతం మంది భక్తులు వెళ్ళలేక దగ్గరలోని ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్ ను భక్తులు ఆశ్రయిస్తుంటారు. తిరుమలలో ఉన్న మఠాల్లో కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి రోజు ఒక్కపూట మాత్రమే భక్తులకు మఠాల్లో అన్నదానం చేస్తారు. ప్రతిరోజు దాదాపు మూడు వేల మంది వరకూ మఠాలను ఆశ్రయిస్తారు. భక్తుల సౌకర్యార్ధం గతంలో ఫుడ్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తూ అప్పటి ఈవో సాంబశివరావు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని సిఆర్ఓతో పాటు పలు ప్రధానమైన ప్రాంతాల్లో 10 నుంచి 15 ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి కదంబం, పెరుగన్నం, మజ్జిగ, పాలు ఇలా వితరణ అందిస్తొంది.
గత రెండు రోజుల క్రితం టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం మేరకు తరిగొండ వెంగమాంబలో కాకుండా పాత అన్నదాన సత్రంలో ఇకపై అన్నప్రసాదంను అందించనున్నారు. ఈ క్రమంలోనే పాత అన్నదాన సత్రంను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మరమ్మత్తులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో భక్తులకు పాత అన్నదాన సత్రం అందుబాటులోకి తీసుకొచ్చి టిఫిన్ సెక్షన్ ను ఏర్పాటు చేయనున్నారు. టీటీడీ పాలక మండలిలో తిరుమలలో ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్ రద్దుపై నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా హోటల్స్ యజమానుల్లో ఆందోళన మొదలైంది.
ఏళ్ళ తరబడి తిరుమలలోనే ఉంటూ హోటల్స్ నడుపుతూ జీవనం సాగిస్తున్న తాము టీటీడీ అనాలోచిత నిర్ణయాల కారణంగా రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ పాలక మండలిలో ప్రైవేట్ హోటల్స్,ఫాస్ట్ పుడ్స్ రద్దు చేస్తామని నిర్ణయం రావడంతో పలువురు పాలక మండలి సభ్యులను, టీటీడీ ఛైర్మన్, ఎమ్మెల్యేలను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదంటున్నారు. త్వరలో అంటే మూడు, నాలుగు నెలల వ్యవధిలో ప్రైవేటు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్స్ వ్యవస్ధను పూర్తిగా రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా వారి తిరుపతి, తిరుమలలో షాపులను టీటీడీ కేటాయించనుంది.
ఇన్నాళ్ళుగా భక్తులకు రుచికరమైన భోజనంను అందిస్తున్న తమపై టీటీడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా సామాన్య భక్తులు కూడా టిటిడి నిర్ణయంను వ్యతిరేకిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులు కుటుంబ సభ్యులతో పాటు తిరుమలకు విచ్చేసిన సమయంలో రకరకాల ఆహారాలను తమకు నచ్చినట్లు స్వీకరించే వారని, అయితే ఉన్నట్టుంటి హోటల్స్, ఫాస్ట్ పుడ్ సెంటర్స్ రద్సు చేస్తే వృద్దులకు ఆహార విషయంలో గానీ, చిన్నపిల్లలకు అవసరం అయ్యే ఇడ్లీ, పాలు వంటి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతాయని భక్తులు అంటున్నారు. హోటల్స్ తీసివేస్తే సామాన్య భక్తుల వద్ద నుండి వీఐపీల వరకూ ఇబ్బందులు తప్పదని భక్తులు చెబుతున్నారు.
Also Read: Weather Updates: హీటెక్కుతోన్న ఏపీ, తెలంగాణ, అక్కడ మాత్రం చలి తీవ్రత తగ్గలేదన్న వాతావరణ కేంద్రం
Also Read: Telangana IT Minister కేటీఆర్‌కు అరుదైన గౌరవం, ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ సదస్సుకు ఆహ్వానం