CM Revanth Reddy: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. కొత్త చట్టంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
Telangana Govenrment Employees | మీకు జీతం ఎలా వస్తుందో, మీ తల్లిదండ్రులకు కూడా నెలవారీ ఆదాయం వచ్చేలా చూస్తాం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఈ చట్టంలో ఉద్యోగులకు సంబంధించి కీలక నిబంధనలు ఉంటాయి. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం (అక్టోబర్ 18, 2025) నాడు హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.
ఈ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురానున్నాం. దీని ప్రకారం ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, అతని జీతంలో 10 నుండి 15 శాతం కోత విధిస్తాం. ఆ నగదు మొత్తాన్ని నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులకు చెల్లించాలని నిబంధన తీసుకొస్తామన్నారు.

కొత్తగా ఎంపికైన గ్రూప్ 2 ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత
గ్రూప్-2 పోస్టులకు కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. సమస్యలతో తమ వద్దకు వచ్చే వారి పట్ల సున్నితంగా ఉండాలని సూచించారు. 'మేము ఒక చట్టాన్ని తీసుకువస్తున్నాం. ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే కనుక వారి జీతంలో 10 నుండి 15 శాతం కోత విధించి, ఆ నగదును వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. మీరు ఈ చట్టాన్ని పాటించాలి. మీకు ఎలా నెలవారీ జీతం అందుతుందో, మీ తల్లిదండ్రులకు కూడా నెలవారీ ఆదాయం అందేలా ప్రభుత్వం చేస్తుందని' అన్నారు.

కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్‌కు ఆదేశం
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని రూపొందించడానికి సంబంధిత అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును ఆదేశించారు. బీఆర్ఎస్ అధినేత కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కానీ పదిహేనేళ్లుగా తెలంగాణలో గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటయ్యాక పదేళ్లలో ఒక్క గ్రూప్ 1 పోస్ట్ కూడా బీఆర్ఎస్ సర్కార్ భర్తీ చేయలేదని, తాము ఒకే ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
తల్లితండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల జీతాల నుంచి 10-15 శాతం కోత విధించి వారి తల్లితండ్రుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసేలా కొత్త చట్టం తీసుకొస్తామని గ్రూప్ 2 విజేతలకు నియామక పత్రాలు అందించే సభలో… pic.twitter.com/MZusxIEupD
— ABP Desam (@ABPDesam) October 18, 2025
ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల కిందటే ఉద్యోగాలు వచ్చేవి. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కోసం పనిచేయాలి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు.
సెంటిమెంట్ రగిల్చి అధికారం కోసం ప్రయత్నాలు
గత పాలకుల పాపాల పుట్ట నేడు పలుకుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు.. వారి కుటుంబ సభ్యులే ప్రజలకు చెబుతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే బీఆర్ఎస్ వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్ తో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అలాంటి వారి ప్రచారాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి. సమర్ధవంతంగా పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుక్రవారం నాడు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. రెడ్డి ప్రభుత్వం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అంగీకరించింది. దీనితో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ, వ్యవసాయ కళాశాలలతో ముఖ్యమైన పథకాలకు కూడా ఆమోదం తెలిపింది.






















