Tirumala News: తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? నేడు అన్ని సేవలు, దర్శన టికెట్లు విడుదల - వివరాలివీ
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జులై నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు టీటీడీ అధికారులు.
తిరుమలకు వెళ్లాలని ప్లానింగ్ లో ఉన్నవారికి అలర్ట్! జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు, స్వామివారి వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను నేడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. తిరుమలకు వెళ్లాలనుకొనేవారు టీటీడీ అధికారి వెబ్ సైట్ నుంచి ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ రోజు (ఏప్రిల్ 20) ఉదయం 10 గంటలకు జులై నెలకు సంబంధించి లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. ఇక, ఉదయం 11:30 గంటలకు జులై మాసానికి సంబంధించిన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల కానున్నాయి.
ఇవేకాకుండా, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జులై నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు టీటీడీ అధికారులు. సీనియర్ సిటిజెన్స్, దివ్యాంగుల కోటా మే నెల టికెట్లు కూడా మధ్యాహ్నం 3 గంటలకే అందుబాటులోకి రానున్నాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన ఆన్ లైన్ సేవల (వర్చువల్ పార్టిసిపేషన్) మే నెలకు సంబంధించిన టికెట్లు ఏప్రిల్ 24 మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల కానున్నాయి.
టీటీడీ ఆ టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టినా కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోటా మొత్తం పూర్తి అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి, భక్తులు ఈ విషయం దృష్టిలో ఉంచుకుని, ఆలస్యం చేయకుండా కోటా టికెట్లు విడుదల సమయానికి ముందే వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి, టికెట్లు విడుదలయ్యాక ప్రయత్నిస్తే బుక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ సర్వదర్శనం, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామి వారిని 64,050 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.