తిరుమలలో మరో చిరుత బోను అధికారులకు చిక్కింది
తిరుమలలో అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది.
తిరుమలలో బోనుకు మరో చిరుత చిక్కింది.. అలిపిరి నడక మార్గంలోని లక్షితపై దాడి చేసిన ఘటనకు అతి సమీపంలో 2850 మెట్టు వద్ద టిటిడి అటవీ శాఖాధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.. వారం రోజులుగా అదే ప్రాంతంలో తిరుగుతూ ఇవాళ వేకువజామున బోనులో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఎరకు చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుతను తిరుపతిలోని జూపార్క్‌కు తరలించారు. ఇప్పటి వరకూ మొత్తం 6 చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించి జూపార్క్ తరలించారు.. ఇందులో రెండు చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.
తిరుమలలో ఆరో చిరుత బోనుకు చిక్కింది. అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అతి సమీపంలో పట్టబడింది. బాలిక లక్షతపై దాడి చేసి చంపేసిన ప్రదేశానికి సమీపంలోనే అధికారులు ఈ చిరుతను పట్టుకున్నారు. టిటిడి అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులోచిక్కింది చిరుత.
అర్ధరాత్రి చిరుత బోనుకు చిక్కినట్లు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. వెంటనే చిరుతను ఎస్వి జూపార్క్ తరలించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. గత కొద్ది రోజుల నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో దాదాపు 40 సార్లకుపైగా ఒకే చిరుత తిరుగుతూ కనిపించింది. అదే ఉదయం బోనుకు చికడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చిరుత చిక్కిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలల కాలంలో ఆరో చిరుత బోనుకు చికిందని, టీటీడీ ఎంత చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణని చెప్పారు. యాత్రికులు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నడిచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని కూడా నియమించినట్లు వెల్లడించారు.
గుంపులు గుంపులుగా వెళ్ళమని భక్తులను అభ్యర్థించి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యంను నింపడం కోసం కర్రలు ఇచ్చామని చెప్పారు భూమన. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా మళ్లీ చిరుతలను పట్టడానికి టిటిడి అటవీ శాఖ సిబ్బంది రేయింబవళ్ళు పనిచేస్తుందని, దీని కారణంగానే ఆరో చిరుత చిక్కిందని తెలిపారు. ప్రస్తుతం చిక్కిన చిరుత వయసు సుమారు నాలుగేళ్లు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారని చెప్పారు.
విమర్శించే వాళ్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు భూమన. వెటకారం వలన నష్టం వాళ్లకే తప్ప తమకు లేదన్నారు. తాము ఊత కర్ర ఇచ్చి తమ పని అయిపోయిందని చెప్పుకునే వాళ్ళం కాదన్నారు. కర్రలు ఇచ్చి చేతులు దులుపుకునే వాళ్ళమైతే దొరికిన చిరుత ఐదవదని చెప్పి వదిలి పెట్టేసే వాళ్ళమన్నారు. దీనికంటే మా పని తీరుకు మరొకటి ఉదాహరణ లేదన్నారు. అటవీ ప్రాంతమంతా గాలిస్తూ ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా చిరుతలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
చిరుతలను గాలించే కార్యక్రమం ముమ్మరంగా చేస్తూ భక్తులు ఇబ్బంది కలగకుండా భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు భూమన వెల్లడించారు. పాప లక్షిత మరణించిన తర్వాత ఐదు చిరుతలు పట్టుకున్నామని ఆ ప్రామదానికి బాధ్యత తీసుకొని పది లక్షల ఆర్థిక సహాయం చేశామన్నారు. మరణించిన పాపను తిరిగి తెప్పించే శక్తి తమకు లేదు కానీ ఆ తర్వాత చిన్న ఘటన కూడా జరగకుండా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. మొన్న చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ ఇచ్చిన సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలిపారు. శాస్త్రీయంగా అటవీశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక మూలంగానే నడక మార్గంలో కంచె ఏర్పాటు చేస్తామని, యాత్రికుల రక్షణ, భద్రత టిటిడికి ముఖ్యమన్నారు.
నిరంతరాయంగా చిరుతలను పట్టుకునే కార్యక్రమం కొనసాగిస్తామని, మరిన్ని చిరుతలు తిరుగుతున్నాయని తెలిసిందని, వాటిని కూడా పట్టుకున్న ప్రయత్నం చేస్తామన్నారు భూమన. ఇటీవల ట్రాప్ కెమెరాలకు చిక్కిన చిరుత ఈ ఒక్క చిరుత మాత్రమేనని, దాదాపు 300కు పైగా ట్రాప్ కెమెరాలతో అలిపిరి నడక మార్గంలో నిఘా పర్యవేక్షణ చేస్తున్నట్లు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
టిటిడి డిఏఫ్ఓ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... అలిపిరి నడక మార్గంలో 350 ట్రాప్ కెమెరాలు, శ్రీవారి మెట్టు మార్గంలో 75 ట్రాప్ కెమెరాలు అమర్చామన్నారు. ట్రాప్ కెమెరాల ద్వారా ఏ జంతువు కదలికలైన గుర్తిస్తున్నామని, నడక మార్గానికి దగ్గరగా వచ్చే జంతువులను పసిగడుతున్నామని తెలిపారు. వాటి వల్ల భక్తులకు ఆపద ఉందని అనుమానం వస్తే వెంటనే వాటిని బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టిటిడి శ్రీనివాసులు తెలియజేశారు..