Nara Lokesh: శ్రీవారి సేవలో నారా లోకేష్, యువగళం పాదయాత్రకు ముందు ఆశీస్సులు
దర్శనం అనంతరం నారా లోకేష్ కు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
![Nara Lokesh: శ్రీవారి సేవలో నారా లోకేష్, యువగళం పాదయాత్రకు ముందు ఆశీస్సులు Nara Lokesh visits Tirumala temple takes lord Venkateshwara blessings ahead of Yuvagalam Padayatra Nara Lokesh: శ్రీవారి సేవలో నారా లోకేష్, యువగళం పాదయాత్రకు ముందు ఆశీస్సులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/26/5ec8fff848dba0bca17ab07763043f0b1674707981508234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తిరుమల శ్రీవారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామి వారి సేవలో నారా లోకేష్ టిడిపి ప్రముఖ నేతలతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం నారా లోకేష్ కు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రేపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుండి లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టనున్న తరుణంలో ముందుగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
దాదాపు నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. తిరుమలలో శ్రీకృష్ణ అతిథి గృహంలో అల్పాహారం స్వీకరించిన అనంతరం నారా లోకేష్ టీడీపీ నేతలతో కలిసి రోడ్డు మార్గం గుండా తిరుమల నుండి కుప్పంకు చేరుకోనున్నారు.
నిన్న నారా లోకేశ్ కడపకు చేరుకొని అక్కడ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం, పెద్ద దర్గా, మరియాపురం చర్చిలను దర్శించుకున్నారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 27వ తేదీన కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
నిన్న ఉదయం ఇంటి నుంచి ఆయన బయలుదేరిన సమయంలో భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మా నాన్న నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, అత్తమామలు నందమూరి బాలకృష్ణ, వసుంధర నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు లోకేష్. నాలుగు వందల రోజుల పాటు ఇంటికి దూరంగా ఉంటూ పాదయాత్ర చేయనుండటంతో.. కుటుంబసభ్యులందరూ వచ్చి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఆయన సతీమణి నారా బ్రాహ్మణి హారతి పట్టి, బొట్టు పెట్టారు. అక్కడి నుంచి నుంచి లోకేష్ నేరుగా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అటు నుంచి కడపకు బయలుదేరారు. కడపలో దర్గా, చర్చికి వెళ్లి నిన్ననే (జనవరి 25) తిరుమలకు చేరుకున్నారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)