Parakamani Case : "పరకామణి కేసులో జైలులో పెట్టినా కుట్రలు బయటకు వస్తాయి" వైసీపీ నేత కరుణాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Parakamani Case : పరకామణి కేసులో తాము ఎలాంటి తప్పు చేయలేదని టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి కామెంట్ చేశారు. ప్రభుత్వం చేసిన కుట్రలు కచ్చితంగా వెలుగులోకి వస్తాయని అన్నారు.

Parakamani Case : పరకామణి కేసులో నేడు సిబిఐ విచారణకు టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు . మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి దాదాపు అరగంట పాటు విచారించారు అధికారులు. పరకామణి చోరీ కేసులో అధికారులకు వచ్చిన అనుమానాలపై రకరకాల ప్రశ్నలు అడిగారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
దాదాపు అరగంట పాటు పరకాణి కేసులో విచారణ ఎదుర్కొన్న కరుణాకర్రెడ్డి, తర్వాత మీడియాతో మాట్లాడుతూ... తిరుమల తిరుపతి దేవస్థానంపై మాట్లాడుతున్నందునే ప్రభుత్వానికి, టీటీడీ వాళ్లకు సమస్యగా మారిందని ఆరోపించారు. తను మాట్లాడిన విషయాలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నందున కక్ష పెట్టుకున్నారని మండిపడ్డారు. అందుకే తనను ఈ పరకాణి కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా చాలా కాలం నుంచి పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. "నాకు ఆ కేసుకు ఏ రకమైనటువంటి సంబంధం లేకపోయినా ఆ జరిగినటువంటి వ్యవహారంలో నేను అధ్యక్షుడిగా ఉండకపోయినా నేనే అధ్యక్షుడిగా ఉండి చేశానని ఒకసారి లేదా నేనే ఒత్తిడి పెట్టాను రవికుమార్తో రాజీ చేయించినట్టు ఎలా పడితే అలా నా మీద మాట్లాడుతున్నారు. కరుణాకర్ రెడ్డి దొరికిపోయారని దొంగ అని ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ మాట్లాడితే సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది.
ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారానికి భయపడి లొంగిపోయే రకం తాము కాదని కరుణాకర్రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదని ఇకపై కూడా తప్పులు చేయబోమని అన్నారు. " బిఆర్ నాయుడు లాంటి పనికిమాలిన వ్యక్తిని టీటీడీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక చేసినప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానాల మీద నమ్మకం లేదని అర్థమైంది. ఏమాత్రం మంచి చేయాలనే ఆలోచన లేదు.ఛానల్ ద్వారా బెదిరించి డబ్బులు వసూళ్లు చేసిన తనకు మద్దతుగా నిలిచారనే పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి అధ్యక్షునిగా నియమించినప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్ట మంటకలిపారు. ఇది అందరికీ అర్థమైంది." అని తీవ్ర ఆరోపణలు చేశారు.
"పరకామాణిలో చోరీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వయిరీ వేసింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అక్కడ ఏం జరగలేదనే తేలింది. ఇదే విషయాన్ని చంద్రబాబు పతిక్రా సమావేశంలో చెప్పారు. విచారణ సరిగ్గా చేయండి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అనుసరించి మళ్లీ విచారణ చేస్తున్నారు. ఈసారి తాము దొరికామనే విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నుంచి ప్రతి ఒక్కరూ మమ్మల్ని బ్రష్టు పట్టిస్తున్నారు. వారి మాటల ద్వారా మీడియాలో కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. చేయని తప్పునకు దోషుల్ని చేసి జైలుకు పంపించినా మీరు సంతృప్తిపడవచ్చు ఏమో కానీ, నిజం బయటికి రాకుండా పోదు." అని అన్నారు.





















