Tirumala News: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటలు సమయం
Devotees Increased In Tirumala : తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. సోమవారం 21 కంపార్ట్‌మెంట్లలో దర్శనానికి నిరీక్షిస్తున్నారు.
Crowd Of Devotees Increased In Tirupati: తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య గడిచిన వారం రోజులు నుంచి భారీగా పెరిగింది. ప్రతిరోజూ 50 వేల మంది నుంచి 70 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తుండడంతో కొండపై రద్దీ నెలకొంది. ఎక్కడ చూసినా వందలాది మంది భక్తులు కనిపిస్తున్నారు. ప్రత్యేక గదులు ఖాళీ లేకపోవడంతో బయటే పలు ప్రాంతాల్లో భక్తులు సేద తీరుతున్నారు. సోమవారం ఉదయం నాటికి భక్తులు 21 కంపార్ట్‌మెంట్లలో దర్శనానికి నిరీక్షిస్తున్నారు. స్వామిని దర్శించుకునేందుకు 12 గంటలు సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు అవసరమైన ఏర్పాట్లు టీటీడీ అధికారులు చేశారు. మంచి నీళ్లు, మజ్జిగ, చిన్నారులకు పాలు వంటివి పంపిణీ చేస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భారీగా సమకూరిన ఆదాయం
గత పది రోజులు నుంచి వెంకన్న స్వామిని దర్శించుకునే వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులు సమర్పిస్తున్న కానుకలు భారీగానే ఉండడంతో హుండీ ఆదాయం పెరిగింది. ఆదివారం ఒక్కరోజే స్వామి వారిని 72,256 మంది భక్తులు దర్శించుకోగా, వీరు సమర్పించిన కానుకలు ద్వారా రూ.3.04 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వీరిలో 28,021 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గడిచిన పది రోజుల్లో 70 వేల మందికిపైగా భక్తులు దర్శించుకోవడం ఇది ఐదో రోజుగా అధికారులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
భక్తుల నిరీక్షణ
స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో దర్శనానికి అధిక సమయం పడుతోంది. భారీగా వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు కిక్కిరిశాయి. సర్వదర్శనం కోసం భక్తులు కనీసం 10 నుంచి 12 గంటలు సమయం నిరీక్షించాల్సిన వస్తోంది. తలనీలాలు సమర్పించేందుకు కనీసం మూడు నుంచి నాలుగు గంటలు సమయం పడుతోంది. అన్నదాన సత్రం, ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా భారీగా భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారి దర్శనానికి వచ్చిన వారిలో చిన్నారులు, మహిళు, వృద్ధులు ఉన్నారు. అనేక రాష్ట్రాల నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు తరలివచ్చారు. సోమవారం ఉదయం 2.20 గంటలు నుంచి 3 గంటలు వరకు స్వామి వారికి సుప్రబాతం, 3.30 గంటలు నుంచి 4 గంటల వరకు తోమాల సేవ(ఏకాంత సేవ), నాలుగు గంటలు నుంచి 4.15 గటల వరకు కొలువు, పంచాంగ శ్రవనాన్ని నిర్వహించనున్నారు. 4.15 నుంచి 5 గంటల వరకు తొలి అర్చన, సహస్ర నామార్చన నిర్వహిస్తారు. 5.30 నుంచి 6.30 గంటల వరకు విశేష పూజ, ఏడు గంటలు నుంచి రాత్రి ఏడు గంటలు వరకు భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. వీటితోపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహించనున్నారు.