Chittoor: ఎదురింటికి వెళ్లొద్దన్న పక్కింటాయన, టెకీని సుత్తితో చావగొట్టిన ఫ్యామిలీ!
Chittoor: పొరుగింటికి వెళ్లొద్దు అన్నందుకు సుత్తితో ఓ సాఫ్ట్ వేరు ఇంజనీర్ పై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన పలమనేరులో జరిగింది.
Palamaner News: సమాజంలో తోటి వారిపై దాడులకు పాల్పడుతూ తాత్కాలిక పైశాచికత్వం పొందే కొందరు వ్యక్తులు కూడా ఉంటారని తాజా ఘటన చాటుతోంది. సహజంగా ఇరుగుపొరుగు అంటేనే ఎంతో ఐక్యతతో బంధుమిత్రులు లాగా కలిసి ఉంటారు. చిన్న శుభకార్యం దగ్గర నుండి అశుభ కార్యం వరకూ ఇరుగు పొరుగు కుల, మతం అనే భేదం లేకుండా కలిసే పాల్గొంటూ ఉంటారు. ఏ బంధం లేకపోయినా, కష్ట కాలంలో పక్క వారిపై సేవాభావంతో వారికి తోచిన సాయం చేసే గుణం ఇరుగు పొరుగు వారికి ఉంటుంది. కానీ, తాజాగా పొరుగింటికి వెళ్లొద్దు అన్నందుకు సుత్తితో ఓ సాఫ్ట్ వేరు ఇంజనీర్ పై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన పలమనేరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్ళితే.. చిత్తూరు జిల్లా, పలమనేరు పాతపేట పోలీసు లైన్ వీధిలో నిరంజన్ నివాసం ఉండేవాడు. బెంగుళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో నిరంజన్ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేవాడు. కరోనా మొదలైనప్పటి నుండి ఇంటి దగ్గర ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఉద్యోగం చేస్తున్నాడు. కొవిడ్ సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న ఓ ముస్లీం కుటుంబంతో నిరంజన్ కి విభేదాలు తలెత్తాయి. తరచూ నిరంజన్ కు, వారికి మధ్య గొడవ జరుగుతూ ఉండేది. అయితే, తోటి కాలనీ వాసులు ఇరు కుటుంబీకులను కూర్చోబెట్టి పంచాయతీలు కూడా పెట్టి సర్ది చెప్పారు.
దీంతో కొంత కాలంగా ఇరువురు ఎటువంటి గొడవలు లేకుండా ఉండేవారు. రెండు రోజుల క్రితం నిరంజన్ ఇంటి వద్ద అద్దెకు ఉండే మహిళ, ముస్లిం కుటుంబంతో సన్నిహితంగా ఉండేది. దీనిని గమనించిన నిరంజన్ ఎదురుగా నివాసం ఉంటున్న ఆ ఇంటికి వెళ్ళవద్దని చెప్పాడు. ఇదే విషయాన్ని ఆ మహిళ ముస్లిం కుటుంబీకులకు చెప్పడంతో ఒక్కసారిగా వారు ఆవేశానికి గురయ్యారు. వారు నిన్న మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న సమయంలో దాదాపు పది మంది మూకుమ్మడిగా నిరంజన్ పైకి దాడికి దిగారు. నిరంజన్ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి, తమతో పాటుగా తెచ్చుకున్న సుత్తితో నిరంజన్ శరీర భాగాలపై కొట్టారు.
అంతటితో ఆగకుండా పిడిగుద్దులతో కంటి నుండి రక్తం వచ్చే విధంగా కిరాతకంగా కొట్టారు. ఇకపై నిరంజన్ తన ఇంటి వద్ద నివాసం ఉండే చంపేస్తామని బెదిరించారు. తీవ్రంగా గాయపడిన నిరంజన్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందిన నిరంజన్ పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు నిరంజన్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో అతను పోలీసులను నిలదీశాడు. తన నివాసం ఎదురుగా నివాసం ఉంటున్న వారి వద్ద నుండి తనకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆవేదన చెందుతున్నాడు. పోలీసులు తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతున్నాడు.