Chittoor News: నాటుకోళ్ళకి పోస్టుమార్టం, వీళ్ల పంచాయితీతో పోలీసులకు తలనొప్పి!
Andhra News: కేసు నమోదు చేసిన పూతలపట్టు పోలీసులు మృతి చెందిన నాటుకోళ్లకు వెటర్నరీ డాక్టర్ల చేత పోస్టుమార్టం నిర్వహించారు..
AP Latest News: చిత్తూరు జిల్లాలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.. నాటు కోళ్లకి పోస్టుమార్టం చేయించారు. ఇది పోలీసులే చేయించడం గమనార్హం. తాము పెంచుకుంటున్న నాటు కోళ్లు మృతి చెందడంతో పూతలపట్టు మండలం, బత్తులవారిపల్లె గ్రామానికి చెందిన సుభాషిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీనిపై కేసు నమోదు చేసిన పూతలపట్టు పోలీసులు మృతి చెందిన నాటుకోళ్లకు వెటర్నరీ డాక్టర్ల చేత పోస్టుమార్టం నిర్వహించారు..
గత కొద్ది రోజులుగా సుభాషిని ఐదు నాటు కోళ్లను పెంచుకుంటున్నారు.. అయితే సుభాషిణి ఇంటి ప్రక్కనే ఉన్న రైతుతో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.. అయితే సుభాషిణీ ఇంటి పక్కనే ఉన్న రైతు తన పొలంలో పంట దిగుబడి కోసం యురియా చల్లాడు.. ఆ యురియాను తిన్న నాటుకొళ్ళు చనిపోయాయి.. నాటుకోళ్ళు చనిపోయి ఉండడాన్ని గమనించిన సుభాషిణి నేరుగా పోలీసులు స్టేషన్ మెట్లు ఎక్కారు. తాను పెంచుకున్న నాటుకోళ్ళను ఉద్దేశపూర్వకంగా తన ఇంటి పక్కనే ఉన్న రైతు యూరియా వేసి చంపేసాడంటూ ఫిర్యాదు చేసింది..
దీంతో చేసేది లేక కేసు నమోదు చేసి వెటర్నరీ వైద్యుల చేత పోస్టుమార్టం నిర్వహించారు.. వెటర్నరీ వైద్యులు నాటుకోళ్ళకు పోస్టుమాస్టం చేయడాన్ని కొందరు స్ధానికులు ఆసక్తికరంగా వీక్షించారు.. నాటుకోళ్ళకు పోస్టుమాస్టం నిర్వహించిన వెటర్నరీ వైద్యులు కోడి గుండె, కాలేయం, మరికొన్ని భాగాలను తీసి పరీక్షల కోసం తిరుపతిలోని ల్యాబ్ కు తరలించారు.. ఆ వచ్చే నివేదిక ఆధారంగా వారి పంచాయితీ తీర్చనున్నారు.