Chittoor: చిత్తూరు జిల్లాలో విషాదం - ఏనుగు దాడిలో భార్యాభర్తల మృత్యువాత
Chittoor District News: చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు సృష్టించిన బీభత్సంలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు.
Chittoor District News: చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. అటవీ ప్రాంతాల నుంచి పొలాల్లోకి వస్తున్న గజరాజులు.. తమ భారీ దేహంతో బీభత్సం సృష్టిస్తున్నాయి. పొలాల్లో పనులు చేసుకునే వారిపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల ఈ తరహా దాడులు తరచూ నమోదు అవుతున్నాయి. పంట పొలాలను నాశనం చేయడం, వాటిని తరిమి కొట్టడానికి ప్రయత్నించిన వారిపై, పొలాల్లో పనులు చేసుకుంటున్న వారిపై దాడి చేసి హతమారుస్తున్నాయి. ఏనుగుల దాడుల వల్ల ఒక వైపు పంట చేలు నాశనమై ఆర్థికంగా నష్టపోవడంతో పాటు.. వాటి దాడిలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా పరిధిలో ఇలాంటి మరో ఏనుగు దాడి ఘటన వెలుగు చూసింది.
గుడిపాల మండలం 190 రామాపురంలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించడంతో పాటు దాని దాడిలో భార్య, భర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను 190 రామాపురం హరిజనవాడకు చెందిన దంపతులు వెంకటేష్, సెల్వీగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్, సెల్వీల మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు వరుస దాడులు కొనసాగుతున్నాయి.
తుంటరి ఏనుగు బీభత్సం, అంతా నాశనం
ఏనుగుల మంద నుంచి బయటకు వచ్చిన ఒంటరి ఏనుగు తుంటరి చేష్టలతో విరుచుకుపడుతోంది.. పంట పొలాలను ధ్వంసం చేయడంతో పాటుగా పశువుల స్థావరాలపై దాడులకు దిగుతూ పశువులను తొక్కి కాళ్ళు, నడుము విరిచేస్తున్నాయి.. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా అటవీ సమీప ప్రాంతాల ప్రజలు, రైతులు బెంబేలెత్తిస్తోంది.. ఒంటరి ఏనుగు కంటిమీద కునుకులేకుండా చేస్తుండడంతో అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అటవీ సమీప ప్రాంతం ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
Also Read: Praggnanandhaa: ప్రజ్ఞానందకు చెన్నైలో గ్రాండ్ వెల్కమ్- డప్పు చప్పుళ్లు, సాంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం
చిత్తూరు జిల్లా, వి.కోట మండలంలో ఒంటరి ఏనుగు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.. మంద నుండి బయటకు వచ్చినా ఒంటరి ఏనుగు తుంటరిగా మారింది.. పశువుల స్థావరాలు, పంటలపై పడి బీభత్సం సృష్టిస్తోంది.. అటవీ సమీపం గ్రామాలైన తోటకనుమ, గోనుమాకులపల్లె పరిధిలోని అటవీ సరిహద్దు గ్రామాల రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి..గోనుమాకులపల్లె,కృష్ణాపురం, తోటకనుమ, యాలకల్లు గ్రామ పంచాయతీలకు సంబంధించిన అటవీ సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడుతోంది.. రాత్రి,పగలు అన్న తేడా లేకుండా పంట పొలాలను ధ్వంసం చేస్తోంది.. పశువుల కొట్టాలు, జననివాసాలే కేంద్రంగా పెట్రేగిపోతోంది.
ఈ క్రమంలో శనివారం రాత్రి గోనుమాకులపల్లి గ్రామానికి చెందిన రైతు రఘుపతి పశువులపాకపై దాడి చేసింది.. పశువు నడుము,కాళ్లు విరిచి గాయపరిచింది.. బీన్స్ తోటను తొక్కి తిని నాశనం చేసింది.. లక్షల రూపాయాల నష్టాన్ని మిగుల్చుతోంది.. పశువుల పాకలో పశువుల కోసం నిలువ ఉంచిన దాణ ఆరగించేందుకే పాకలపై దాడి చేస్తోందని రైతులు చెబుతున్నారు. వారం రోజులుగా అటవీ సరిహద్దు రైతులకు నిద్ర లేకుండా చేస్తుంది.కస్తూరి నగరం,దండి కుప్పం,రాఘవపల్లి,కొమ్మరమడుగు, వెంకటేపల్లి, నాగిరెడ్డిపల్లి,చిన్న శ్యామ, తేట్టు,ఎర్రినాగేపల్లి తదితర గ్రామ పంట పొలాలు,పశువుల పాకలపై దాడి చేస్తూ నష్టాన్ని మిగిల్చుతోంది.పంట పొలాలను ఏనుగు బారి నుండి రక్షించాలని రైతులు కోరుతున్నారు.ఇంత జరుగుతున్న అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకొని..ఒంటరి ఏనుగు దాడుల నుంచి పంట పొలాలను పశువుల పాకలను రక్షించాలని రైతులు కోరుతున్నారు.