TTD Hundi Collection : తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు, ఒక్కరోజులో రూ. 6 కోట్లు!
TTD Hundi Collection : తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. టీటీడీ చరిత్రలో(అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం) తొలిసారి ఒక్కరోజులో రూ. 6 కోట్ల ఆదాయం వచ్చింది.
TTD Hundi Collection : టీటీడీ చరిత్రలో తొలిసారి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం ఒక్కరోజులో రూ.6.18 కోట్లు వచ్చింది. తొలిసారి హుండీ ఆదాయం రూ.6 కోట్ల మార్క్ దాటింది. ఇప్పటి వరకు 2012 ఏప్రిల్ 1వ తేదీన రూ.5.73 కోట్లు ఆదాయమే అత్యధికం.
కాసుల వర్షం
తిరుమల శ్రీనివాసుడు పెళ్లి రోజు కుబేరుడు కాసుల వర్షం కురిపించాడని అంటారు. తాజాగా అలాంటి కాసుల వర్షమే తిరుమల శ్రీవారి హుండీలో కురుస్తోంది. కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో రెండేళ్లుగా వేచిచూస్తున్న భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఏడుకొండలకు క్యూ కడుతున్నారు. వేసవి సెలవులు కూడా కావడంతో భక్తులు రద్దీ అమాంతం పెరిగిపోయింది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా బాగా పెరిగింది. ప్రతి నెలా శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గత నాలుగు నెలలుగా ప్రతి నెలా రూ.100 కోట్లు పైమాటే. గతంలో ఎప్పుడూ ఎరుగని రీతిలో ఒక్క మే నెలలోనే శ్రీనివాసుడి ఖాతాలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చింది. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు భక్తులను పూర్తిస్థాయిలో అనుమతిస్తు్న్నారు. అందువల్ల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. .
Also Read : Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా
తిరుగిరుల భక్తులతో కిటకిటలు
గత రెండు నెలలుగా తిరుమల గిరులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఈ రెండేళ్లుగా కరోనా కారణంగా స్వామివారిని దర్శించుకోలేని భక్తులు వేసవి సెలవులు కావడంతో తిరుమలకు వస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ పెరిగి స్వామి వారి దర్శనానికి 48 గంటలపైగా వేచిచూడాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.128 కోట్లు కాగా, ఏప్రిల్ లో రూ.127.5 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. మే నెలలో అయితే టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది. జూన్ నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకే రూ.106 కోట్ల వరకు సమకూరింది.
Also Read : Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం