Golden Bonam : బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం, కదిలివచ్చిన భాగ్యనగరం
Golden Bonam :బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం సమర్పించారు. ప్రతీ ఏటా హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల కమిటీ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ వస్తుంది.
Golden Bonam : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల కమిటీ ప్రతినిధులు. సకాలంలో వర్షాలు కురిసి ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించామని హైదరాబాద్ మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయాల కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆషాడ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.
దుర్గమ్మకు బంగారు బోనం
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున బంగారు బోనం సమర్పించారు. తొలుత బ్రహ్మణవీధి జమ్మిదొడ్డిలోని జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, తీన్‌మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాట, బేతాళ నృత్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యంతో పాటు కృష్ణమ్మ తల్లికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గంగతెప్పను సమర్పించారు. మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ నుంచి 400 మంది కళాకారులు, 1500 మంది ఆయా దేవాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వర్షాలు విస్తారంగా కురవాలని
అనంతరం కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాడ మాసంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు విస్తారంగా కురిసి, పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గత 13 ఏళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నామని చెప్పారు. తొలుత ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈవో భ్రమరాంబ, స్థానాచార్య విష్ణుభొట్ల శివప్రసాద్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో బోనాలు
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ఆషాఢ మాసం ఆరంభం నుంచి ఊరూరా మొదలయ్యే సందడి నెల రోజుల పాటూ సాగుతుంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో మహానగరం నుంచి మారుమూల పల్లెవరకూ హోరెత్తిపోతుంది. ఉత్సవాల్లో భాగంగా మహిళలు తలపై బోనాలతో అమ్మవార్ల ఆలయాలకు తరలివెళ్లి పూజలు చేస్తారు. ఆదివారం, బుధవారాల్లో బోనాల జాతర జరుగుతుంది. గ్రామ దేవతలైన పోశమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ, వీరికి తోడుగా గ్రామాన్ని కాపాడే పోతురాజు అనుగ్రహంకోసం బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు.
కాకతీయుల కాలం నుంచే జాతర
తెలంగాణకు ప్రత్యేకమైన బోనాల జాతరను కాకతీయుల కాలంనుంచే నిర్వహిస్తున్నట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే పారిశుద్ధ్య లోపంతో కలరా, ప్లేగు లాంటి అంటురోగాలతో అల్లాడేవారు. ఈ రోగాల బారి నుంచి కాపాడాలని శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని కొలిచేవారు. బోనం అంటే ఆహారం, భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యం వండి కుండను పసుపు, కుంకుమ, సున్నం, పువ్వులు, వేపకొమ్మలతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు. ఆ కుండను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రదర్శనగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. విస్తారంగా వర్షాలు కురిపించాలని, అంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటారు.