Tirumala: రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్లు జారీ
Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను రేపటి నుంచి ఐదు రోజుల పాటు టీటీడీ నిర్వహించనుంది. ఇందుకు గాను ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. తెప్పోత్సవాల జరిగే రోజుల్లో పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది.
Tirumala: శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల(Salakatla Teppostavas)ను రేపటి నుంచి ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం ఏకాదశి నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు టీటీడీ(TTD) అధికారులు. తెప్పోత్సవాలను పురస్కరించుకున్ని శ్రీవారి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెపోత్సవాల జరిగే ఐదు రోజులు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఏటా ఫాల్గుణ మాసంలో తెప్పోత్సవాల నిర్వహణ
తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా విరాజిల్లుతూ ఉంటుంది. దేశ విదేశాల నుండే వచ్చే భక్తులతో నిత్యం గోవింద నామ స్మరణలతో ఏడు కోండలు మారుమ్రోగుతూ ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరుడికి నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర, సాలకట్ల ఉత్సవాలను ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు నిర్వహిస్తారు. శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో, అంతటి అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు కాబట్టే ప్రతి నిత్యం ఏదొక ఉత్సవం తిరుమలగిరుల్లో జరుగుతూనే ఉంటుంది. వేసవి కాలం ప్రారంభంలో ప్రతి ఏటా స్వామి వారికి తెప్పోత్సవాలను ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్న పుష్కరిణిలో శ్రీవారి తెప్పోత్సవాలను(Srivari Teppostavas) నిర్వహిస్తుంది టీటీడీ. 15వ శతాబ్దంలో సాలువ నరసింహరాయులు స్వామి వారి పుష్కరణిలో నిరాళి మండపాని నిర్మించారు. తెప్పోత్సవాల్లో మలయప్ప స్వామి ఐదు రోజుల పాటు ఈ నిరాళి మండపం చుట్టూ ప్రదక్షిణలుగా తెప్పలో విహరిస్తారు.
ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు
ఫాల్గుణ మాసం ఏకాదశినాడు ప్రారంభమై పౌర్ణమి రోజున ముగిసేలా ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలలో మొదటి రోజు శ్రీనివాసుడు త్రేతాయుగానికి ప్రతీకగా శ్రీరాముని అవతారంలో మాఢ వీధులలో ఊరేగి పుష్కరిణికి చేరుకున్ని తెప్పలపై మూడు ప్రదక్షిణలుగా విహరిస్తారు. రెండో రోజు ద్వాపర యుగానికి ప్రతీకగా శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పపై విహరిస్తారు. మూడో రోజు కలియుగానికి ప్రతీకగా భూదేవి, శ్రీదేవి సమేతుడు శ్రీ మలయప్ప స్వామి తెప్పపై విహరిస్తారు. ఇక నాలుగో రోజు మలయప్ప స్వామి ఐదు ప్రదక్షిణలతో తెప్పలపై విహరిస్తారు. చివరిగా ఐదో రోజు స్వామి వారు ఏడు ప్రదక్షిణలతో తెప్పలపై విహారిస్తూ ఆశేష భక్తజనానికి కనువిందు చేస్తారు.
ఉద్యానవన అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను పురస్కరించుకున్ని టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముందుగా శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు తెప్పలను పుష్కరిణిలో ట్రైల్ రన్ ను నిర్వహించి లోటు పాట్లును పరిశీలించారు. ఈ ఏడాది కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను భక్తుల సమక్షంలో టీటీడీ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో శ్రీవారి పుష్కరిణిని, పుష్కరిణిలోని మండపాన్ని అత్యంత సుందరంగా టీటీడీ ఉద్యానవనం అధికారులు తీర్చిదిద్దారు. అంతే కాకుండా తెప్పోత్సవాలు జరిగే ఐదు రోజుల పాటు టీటీడీ ఉద్యానవన శాఖ అధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో తెప్పను సుందరంగా అలంకరించనున్నారు. ఇప్పటికే పుష్కరిణికి వచ్చే మార్గంతో పాటు పుష్కరణి లోపల కూడా పుష్పాలతో వివిధ రకాల కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ విద్యుత్ శాఖ అధికారులు కూడా మాఢ వీధులతో పాటు పుష్కరిణి పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాకాంతులతో శోభయమానంగా అలంకరిస్తున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
కరోనా కారణంగా రెండేళ్ల క్రితం 2020 మార్చి 18 తేదీ నుంచి టీటీడీ శ్రీవారి పుష్కరిణిని మూసి వేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది తెప్పోత్సవాలకు భక్తులను అనుమతించనుంది టీటీడీ. ఇక ఏటా శ్రీవారి తెప్పోత్సవాలలో పాల్గోనాలని భావించే భక్తుల కోసం టీటీడీ కరెంట్ బుకింగ్ ద్వారా ప్రతి రోజు 200 టిక్కెట్లను జారీ చేయనుంది. తెప్పోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారికి జరిగే నిత్య సేవలైన సహస్రదీపాలంకరణ సేవలను ఐదు రోజుల పాటు రద్దు చేసిన టీటీడీ తెప్పోత్సవాల కారణంగా వర్చువల్ అర్జిత సేవలైన సహస్ర దీపాలంకార సేవను మార్చి 13, 14వ తేదీల్లో మార్చి 15, 16, 17వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది.