Chandrababu Deadline : సీఎం జగన్‌కు 48 గంటల టైం ఇచ్చిన చంద్రబాబు - ఇసుక దోపిడీపై సమాధానం చెప్పాలని డిమాండ్
ఏపీలో ఇసుక దోపిడీపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. 48 గంటల సమయం ఇస్తున్నామని ప్రకటించారు.
Chandrababu Deadline : ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ సీఎం జగన్ ఏకంగా రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. గళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తీవ్ర ఆరోపమలు చేశారు. 2022 నుంచి పూర్తిగా వైకాపా నేతలకే ఇసుక దందా అప్పగించారని విమర్శించారు. ఇసుకలో వాటాల కోసం విచ్చలవిడిగా వ్యవహరించారు. నిబంధనలు ఉల్లంఘించారు.. వ్యవస్థలను నాశనం చేశారన్నారు.
ఎన్జీటీ, సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా తవ్వకాలు చేస్తున్నారన్నారు. ఇసుక రీచ్‌లలో ఒక మీటర్ కంటే ఎక్కువ లోతు తవ్వకూడదు. నీరు ఉన్న చోట ఇసుకను తవ్వకూడదనే నిబంధన ఉంది. అయినా కృష్ణా నదిలోనూ రోడ్లు వేసి ఇసుకను తవ్వేశారన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని ఎన్‌జీటీ తీర్పు ఇచ్చింది. ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. అనధికారికంగా 500కుపైగా ఇసుక రీచ్‌లలో దోపిడీ చేశారు. ఇసుకను నల్లబజారులో అధిక రేటుకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.
ఇసుక మాఫియాకు, మోసాలకు ఎందరో బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమరాజ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజమండ్రిలో ఎస్సీ యువకుడికి శిరోముండనం చేశారు. ఇసుక మాఫియాపై ప్రశ్నించే వారిని పలురకాలుగా వేదించారు. ఎన్జీటీకి వెళ్లిన వారి ఆస్తులపై దాడులు, తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రజలు ఐదేళ్లు మాత్రమే అధికారం ఇచ్చారని గుర్తించాలని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు.
రాష్ట్రాన్ని ఈ దోపిడీ దొంగలకు వదిలిపెడితే మన భవిష్యత్ అంధకారం అవుతుందని, రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అన్నారు. ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎన్జీటీ కర్రు కాల్చి వాత పెట్టినా వీళ్లకు బుద్ధి రాలేదని విమర్శించారు. ప్రభుత్వానికి ఏమాత్రం జ్ఞానం ఉన్నా, ఎన్జీటీ ఆదేశాలపై వెంటనే ఆత్మపరిశీలన చేసుకోవాలని స్పష్టం చేశారు. కొన్ని సార్లు చిన్న కామెంట్ వల్ల ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన ఘటనలు ఉన్నాయని... ఇసుక తవ్వకాల విషయంలో ఇన్ని అభ్యంతరాలు, ఇన్ని ఆదేశాలు వస్తే, ఇన్నిసార్లు తప్పుబడితే మీకు బుద్ధి, జ్ఞానం లేదా? అతడికి బుద్ధి, జ్ఞానం లేకపోతే రాష్ట్రంలో ఉన్న మన ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పది ప్రశ్నలకు సమాదానాలు చెప్పాలని జగన్‌ను చంద్రబాబు డిమాండ్ చేశారు.
1. ఈ నాలుగున్నరేళ్లలో ఇసుక తవ్వింది ఎంత... ప్రభుత్వ ఆదాయం ఎంత?
2. జీఎస్టీ ఎంత చెల్లించారు... ఏ సంస్థ పేరున చెల్లించారు?
3. రాష్ట్రంలో ఉన్న ఇసుక నిల్వ కేంద్రాలు ఎన్ని... వాటిల్లో ఉన్న నిల్వలు ఎంత?
4. పర్యావరణ అనుమతులు ఉన్న ఇసుక రీచ్ లు ఎన్ని? ఎన్ని మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది?
5. ఎన్జీటీ ఆదేశాలను అనుసరించి ఎస్ఈఐఏఏ ఈసీలను రద్దు చేయడం నిజం కాదా?
6. ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లినా స్టే ఇచ్చేందుకు నిరాకరించలేదా?
7. ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయడంలేదని వేసి ఎగ్జిక్యూటివ్ పిటిషన్ లో ప్రభుత్వాన్ని ఎన్జీటీ తప్పుబట్టింది వాస్తవం కాదా?
8. కమీషన్ రూపంలో ప్రతి నెలా రూ.35 కోట్లు చెల్లించలేక పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమరాజ్ ఆత్మహత్య నిజం కాదా?
9. ఒప్పందాలు లేకపోయినా రాష్ట్రంలో నేడు ఇసుక తవ్వకాలు చేస్తుంది ఎవరు?
10. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దోపిడీపై 48 గంటల్లో సమాధానం చెప్పాలి.
నలభై ఎనిమిది గంటల సమయం ఇస్తున్నామని సమాధానం చెప్పకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.