Ministers On Employees : జీతాలు తగ్గవు పెరుగుతాయి ..ఉద్యోగులు రెచ్చిపోతే క్షమించే ప్రశ్నే లేదన్న మంత్రులు !
ఆందోళనకు దిగుతున్న ఉద్యోగుల విషయంలో మంత్రులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంత మంది పరిధి దాటి మాట్లాడుతున్నారని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉద్యోగుల ఉద్యమంపై మంత్రులు హెచ్చరిక స్వరాలతో ప్రకటనలు చేస్తున్నారు. జీతాలు తగ్గవని.. పెరుగుతాయని అయినప్పటికీ కొంత మంది తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగులు ఆవేశంతో కాదు ఆలోచన చేయాలి : పేర్ని నాని
ఉద్యోగులకు చేయాలని ఉన్నా చేయలేకపోతున్నామన్న బాధ ఉందని ఉద్యోగులు ఆర్థం చేసుకోవాలని ఏపీ సమాచార మంత్రి పేర్ని నాని కోరారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లోనే ఇలా చేయాల్సి వస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఐఆర్ ఇచ్చామని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ 23 శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తున్నామని..ఇవన్నీ ఉద్యోగుల పట్ల ప్రేమతో తీసుకున్న నిర్ణయాలు కావా అని మంత్రి ప్రశ్నించారు. మొత్తంగా జీతం పెరిగిందా..? లేదా అనేది చూడాలని ఉద్యోగ సంఘాలకు పేర్ని నాని సలహా ఇచ్చారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందనేది అవాస్తవమన్నారు. ఉద్యోగులు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకు వెళ్లాలని పేర్ని నాని సూచించారు.
Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు
ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు కొంత మంది మాటలు బాధకరంగా ఉన్నాయన్నారు. భాష అదుపులో ఉండాలి. సంయమనం లేకుండా ఉద్యోగులు మాట్లాడుతున్నారన్నారు. ఉద్యగులకు కావాల్సింది ఘర్షణా లేక సమస్యల పరిష్కారమా..? వారే నిర్ణయించుకోవాలన్నారు. బాధ్యత రహితంగా మాట్లాడుతున్న వారిని ఉద్యోగ సంఘాల నేతలు కట్టడి చేయాలని సూచించారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. ఇలా మాట్లాడితే తీవ్ర పర్యవసానాలు చూడాల్సి వచ్చే పరిస్థితి వద్దని మంత్రి హెచ్చరించారు. ఉద్యోగస్తులు ఎవరి ప్రొవేకేషన్ లోకి వెళ్ళవద్దు అని కోరుతున్నానని బొత్స వ్యాఖ్యానించారు. సానుకూలంగా ఉండాలని ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే క్షమించేది లేదు. మంచి వాతావరణాన్ని పాడు చేయవద్దని బొత్స హెచ్చరించారు.
Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు
పీఆర్సీకి అంగీకరించి ఆందోళనలు చేస్తారా ?: మంత్రి సురేష్
పీఆర్సీ విషయంపై స్పందించిన మంత్రి సురేష్.. ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమకు ఎలాంటి ఇబ్బందులేమైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోవాలని.. అంతేగాని ఇలా నిరసనలు తెలపడం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించి ఇప్పుడు మళ్లీ ఆందోళన దిగడం సరికాదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పీఆర్సీపై ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చన్నారు.
Also Read: పీఆర్సీకి వ్యతిరేకంగా చలో కలెక్టరేట్... రోడెక్కిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు
వేరేవారి ట్రాప్‌లో పడి ప్రభుత్వంపై బురద చల్లొద్దు : శ్రీకాంత్ రెడ్డి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.ఉద్యోగులకు నష్టం చేయాలని ప్రభుత్వం ఉద్దేశంకాదన్నారు. కచ్చితంగా ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా వెళ్లదన్నారు. కొందరి మాటలు విని ప్రభుత్వంపై బురద చల్లవద్దని హితవు పలికారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వంపై ఎంతో భారం పడిందన్నారు. ఉద్యోగులు ఆవేశాలకు లోనుకావద్దన్నారు. ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్‌ఎ ఇచ్చారా అని ప్రశ్నించారు. అందరికీ మంచి చేయాలని ఆలోచించే ప్రభుత్వం తమదని తెలిపారు. ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దన్నారు. పది వేల కోట్ల భారం పడుతున్నా పీఆర్సీ అమలుకు సీఎం వైఎస్ జగన్ వెనుకాడలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
Also Read: సమ్మెలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. 21న సీఎస్‌కు నోటీసు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.