రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే
రైళ్ల రాకపోకల విషయంలో సమయపాలన పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సూచించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
రైళ్ల రాకపోకల విషయంలో సమయపాలన పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సూచించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
అధికారులతో జీఎం సమీక్ష...
విజయవాడ రైల్వే డివిజనల్ కాన్ఫరెన్స్ హాల్ లో బెజవాడ డివిజనల్ పని తీరుపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సమీక్ష నిర్వహించారు. విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్, ఏడీఆర్‌ఎం డి.శ్రీనివాసరావు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన పలు అంశాలపై సమీక్షించారు. డివిజన్‌లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి అధికారులు జీఎం అరుణ్ కుమార్ జైన్ కు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 135.8 కి.మీల గూడూరు - విజయవాడ ట్రిప్లింగ్ పనులను ప్రారంభించి, బ్రాంచ్ - లైన్ డబ్లింగ్ పనులను పూర్తి చేసినందుకు గానూ విజయవాడ టీమ్ అధికారులను జీఎం అభినందించారు. ట్రిప్లింగ్ పనులను వేగవంతం చేయడం, బాటిల్ నెక్‌ల తొలగింపు, విద్యుద్దీకరణ పనులు, రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ రూట్‌లో రైలు కార్యకలాపాలను తగ్గించడం, తదితర అంశాలపై జీఎం ఉన్నతాధికారులతో చర్చించారు.
భద్రతపై ప్రత్యేక శ్రద్ధ...
ఈ సందర్బంగా అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. రైలు కార్యకలాపాలలో సమయపాలనతో పాటు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో రాజీ పడే ప్రస్తకి లేదని, ఆయన అధికారులతో అన్నారు. ట్రాఫిక్ బ్లాక్‌లు, మెయింటెనెన్స్ పనులు, మరమ్మతులు ఆలస్యం కాకుండా రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరం అయిన సాంకేతికతను వినియోగించి సమస్యలను పరిష్కరించగలమని చెప్పారు. భద్రతకు రైల్వే అదిక ప్రాదాన్యత ఇస్తుందని, ప్రయాణీకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైల్వే అధికారులు, సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. సాంకేతికంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి, ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ విషయంలో దిగువ స్థాయిలో ఉన్న సిబ్బందికి, అధికారులకు అవగాహన అవసరం అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభిప్రాయపడ్డారు.
సిబ్బంది కష్టాలపై ఆరా...
రైల్వేలో పని చేస్తున్న సిబ్బంది సమస్యలు పై దశాబ్దాలుగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సిబ్బంది ఫిర్యాదులను కూడా పరిశీలించారు. పదోన్నతి, వేతన స్థిరీకరణ, సెటిల్‌మెంట్లకు సంబంధించిన సమస్యలతో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని హితవు పలికారు. ఆరోగ్యవంతమైన ఆపరేటింగ్ నిష్పత్తిని సాధించడంతో పాటు ఆదాయాల పెంపు, వ్యయాలను తగ్గించడానికి చర్యలు చేపట్టాలన్నారు. రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టడానికి గల అవకాశాలను పరిశీలించాని జీఎం సూచించారు.
అనంతరం రోజువారీ పనిలో ఎదురవుతున్న సమస్యలు, జోనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి సహాయం అవసరమైన ప్రాంతాల గురించి విజయవాడ డివిజన్ బ్రాంచ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్రాంచ్ అధికారులకు హెడ్ క్వార్టర్స్ నుండి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. వార్షిక ఆదాయాలలో కొత్త రికార్డులు నమోదు చేయాలని ఆకాంక్షించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే జోరు కొనసాగించాలని కోరారు.