Sharmila and Kavitha Politics: తిరుగుబాటు చెల్లెళ్లు షర్మిల, కవిత- పోలికలు, తేడాలు.. చాలానే ఉన్నాయి
Telangana News | ఏపీ, తెలంగాణలో సిస్టర్ సెంటిమెంట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడంతో కవిత వేరు కుంపటి పెడతారని ప్రచారం జరుగుతోంది. అలాంటిదేం లేదని ఆమె చెబుతున్నారు.

Sister Politics | అన్నలపై తిరుగుబాటు చేసిన చెల్లెళ్లు షర్మిల, కవిత ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆంధ్రాలో షర్మిల రెడ్డి, తెలంగాణలో కవిత తమకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ తమ దారి తాము చూసుకుంటున్నారు. ఏపీలో షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అప్పట్లో అన్నపై ప్రస్తుతం కూటమి పై తన పోరాటం చేస్తున్నారు. మెయిన్ ఫోకస్ అన్న జగన్ పైన అనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు తెలంగాణలో కవిత కూడా అదే పనిలో ఉన్నారు. రేపో మాపో సొంత పార్టీ ప్రకటన రావచ్చనేది రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతున్న చర్చ. కానీ తనకు అధినేత కేసీఆరేనని, కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పోలికలు, వ్యత్యా సాల పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
పోలికలు- ఇద్దరి పోరాటం అన్నల పైనే !
షర్మిల కవిత ఇద్దరి పోరాటం ప్రధానంగా తమ తమ అన్నలపైనే. అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి తనను పక్కన పెట్టారని షర్మిల పదేపదే ఆరోపిస్తారు. కవిత ఆరోపణ కూడా అదే కాకపోతే ఆమె డైరెక్ట్ గా పేరు ఎత్తలేదు ఇంకా. షర్మిల, కవిత ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలు. తండ్రి చనిపోయాక షర్మిల, తెలంగాణ ఉద్యమ సమయంలో కవిత ప్రజాక్షేత్రంలో బాగా నలిగినవారే. ఎండలను లెక్కచేయకుండా అన్న కోసం పాదయాత్ర చేసిన గతం షర్మిలది అయితే తెలంగాణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ ప్రజలను జాగృతం చేసేన చరిత్ర కవిత కు ఉంది. ఒకానొక దశలో అన్నమాటే తమ మాటగా ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు. రాజకీయంగా ఇద్దరి భర్తలూ సైలెంట్ గా ఉండేవారే. ఢిల్లీ స్థాయిలో ఇద్దరికీ తమదైన ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
షర్మిల, కవితల మధ్య తేడాలు ఇవే
షర్మిల కవిత ఇద్దరి మధ్యా ఒక ముఖ్యమైన తేడా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. కనీసం ఒక ఎమ్మెల్సీ లాంటి పదవి కూడా ఆమెకు ఇవ్వలేదు జగన్ మోహన్ రెడ్డి. కానీ కవిత కు అలాకాదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆమెకు రాజకీయంగా సముచిత స్థానాన్ని ఇచ్చారు. ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. దీనిపై అప్పట్లో విమర్శలు వచ్చినా ఆయన లెక్క చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె పాత్ర చాలానే ఉన్నా 2018 ఎన్నికల గెలుపు లో ఆమె పాత్ర తక్కువే. కానీ షర్మిల అలా కాదు. తన అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు ఏకంగా 16 నెలలపాటు పార్టీకి దిక్సూచిగా మారారు. పాదయాత్ర చేశారు.
2019లో తన అన్న జగన్ మోహన్ రెడ్డి గెలుపులో ఆమె పాత్ర కూడా ఎంతో కొంత లేకపోలేదు. అయినప్పటికీ షర్మిలకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో రాజకీయంగా ఆమెకు అన్యాయం జరిగిందన్న భావన సామాన్య ప్రజల్లో ఉంది. కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణలతో జైలుకు వెళ్లి రావడం కెసిఆర్ కు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టింది. షర్మిలపై ప్రస్తుతానికి వేరే రకమైన ఆరోపణ లు ఏవీ లేవు. శర్మలకు తన తల్లి విజయమ్మ పూర్తిస్థాయి మద్దతు ఉంది. కుమారుడితో విభేదించి మరీ ఆమె కుమార్తె షర్మిల వద్దనే ఉంటోంది. కవిత విషయంలో ప్రస్తుతానికి ఆమె మాతృమూర్తి స్టాండ్ ఏమిటన్నది తెలియదు. సీట్లు ఏవి రాకపోయినా ప్రస్తుతానికి షర్మిల రాజకీయంగా ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నెట్టుకొస్తున్నారు. కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొంచెం టైం పడుతుంది.





















