MLC Kavitha: బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు, బీఆర్ఎస్ పెద్దలకు కవిత కౌంటర్ ఇచ్చారా?
BRS mlc Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు వద్దని తాను అడ్డుకున్నానని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఏ పార్టీ బాగుపడలేదన్నారు.

Kavitha Comments on BJP | మంచిర్యాల: బీజేపీతో పొత్తుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని కవిత అన్నారు. చిట్ చాట్‌లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తనకి సొంత ఎజెండా ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలనేదే నా తపన, మా పార్టీని విలీనం చేయొద్దు అనేది తన వాదన అన్నారు. బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీలు బాగుపడలేదని వ్యాఖ్యానించారు.
లెటర్ రాయడం లో నా తప్పేం లేదు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తాను జైల్లో ఉన్నప్పుడు బిజెపి లో కలుపుతామనీ పార్టీ నేతలు కొందరు చెప్పారు. అయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి నేను అప్పుడే ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎందుకు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తాను. పార్టీ అధినేత కేసీఆర్ కు తాను లెటర్ రాయడం లో నా తప్పేం లేదన్నారు. తన తండ్రి కేసీఆర్ ను కలిసే అవకాశం వచ్చింది , కానీ కలవలేకపోయాను. ఈ క్రమంలో ఆయనకు కొన్ని విషయాలు స్పష్టం చేసేందుకు లేఖ రాసినట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ తనకు అధినేత, గురువు అని.. పార్టీ అధినేతకు తాను గతంలో పలు లేఖలు రాసినట్లు తెలిపారు. కానీ వాటిని వదిలిపెట్టి, కేవలం ఈ లెటర్ బయటికి తెచ్చిన వారు ఎవరు, ఈ కుట్ర వెనుక ఉన్న వారిని పట్టుకోండి అని ఛాలెంజ్ విసిరారు.
మంచిర్యాలలో జరుగుతున్న వివాహానికి వెళ్తున్న సందర్భంగా కవిత పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప టెంపుల్ చౌరస్తా వద్ద ఆగారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. పెద్దపల్లిలో ఎమ్మెల్సీ కవితకు పెద్దపల్లి నియోజకవర్గం BRS నాయకురాలు దాసరి ఉష ఘన స్వాగతం పలికారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ లు, వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కవిత చెల్లని రూపాయి.. దమ్ముంటే ప్రెస్‌మీట్‌లో మాట్లాడాలన్న రఘునందన్ రావు
బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సమయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ విలీనం కోసం ఎవరు అడిగారు, వేరే పార్టీతో పొత్తులు, విలీనంపై బీజేపీతో ఎలాంటి చర్చలు జరగలేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బీజేపీ ఒంటరిగానే తెలంగాణలో బలపడుతోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెల్లని రూపాయి అని, చిట్ చాట్ లో మాట్లాడటం కాదు.. ఆమెకు దమ్ముంటే ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి నేరుగా ఆరోపణలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పెద్దలపై నమ్మకం లేకనే వారిని ఓడగొట్టారు. గత ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ సీట్లు నెగ్గిందని, అంతకుముందు జరిగిన ఎన్నికల్లోనూ నాలుగు సీట్లు సొంతం చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కేటీఆర్, కవితలకు ఎలాంటి బ్రాండ్ లేదు, నిజామాబాద్ ప్రజలకు ఏం చేయలేదనే ప్రజలు ఎంపీ ఎన్నికల్లో ఆమెను ఓడించారు. వారి నిజస్వరూపం తెలుసు కనుకే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.






















