TDP Meeting: బటన్ మాత్రమే నొక్కిన సీఎం జగన్‌ను ఈవీఎం బటన్ నొక్కి ఇంటికి పంపేస్తారు: టీడీపీ నేతలు
ఏపీలో కనివినీ ఎరుగని రీతిలో పథకాలు అమలు చేస్తామని మాయ మాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రజలను మూడేళ్లుగా మోసం చేస్తూ ధరల భారాలు మోపుతున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.
తూర్పు గోదావరి... రాజమండ్రి... నియంతగా వ్యవహరిస్తూ పిచ్చిపిచ్చి నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అందుకు రాష్ట్రంలో వచ్చిన మార్పులే కారణమని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. బటన్ మాత్రమే నొక్కిన సీఎం జగన్‌ను ప్రజలు సైతం ఈవీఎం బటన్ నొక్కి ఇంటికి పంపేస్తారని టీడీపీ నేతలు అన్నారు. స్థానిక మెయిన్ రోడ్డులోని హోటల్ జగదీశ్వరిలో తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజమండ్రి నియోజకవర్గ పరిశీలకులు అంగర రామ్మోహన్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), కార్యదర్శి కాశి నవీన్ కుమార్, టిఎన్‌టియూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు.
దేవుడి దయతో మన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తా... ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో పథకాలు అమలు చేస్తామని మాయ మాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను మూడేళ్లుగా మోసం చేస్తూ ధరల భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలంతా మూడేళ్లుగా అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు అధికారంలోకి రావడం కోసం కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ వర్గం వారిని వదలకుండా జగన్ ప్రభుత్వం ‘‘బాదుడే బాదుడు’’ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. వ్యాపారులు, సామాన్యులు, ఆటో డ్క్రెవర్లు ఇలా ప్రతి ఒక్కరినీ వదలకుండా వారిపై ఏదో రూపంలో పన్ను వేసి ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం చరిత్రలో ఏదైనా ఉంది అంటే అది కేవలం జగన్ ప్రభుత్వమేనని విమర్శించారు.
డ్వాక్రా సంఘాలు పెట్టింది టీడీపీ చంద్రబా చంద్రబాబు నాయుడని, వారి ఎల్‌ఐసీ ప్రీమియం సొమ్మును కూడా కాజేశారన్నారు. దోచుకుని దాచుకోవడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. నమ్ముకున్న వారికి పార్టీ అన్యాయం చేయదని, గుర్తించి మంచి పదవులు ఇస్తుందన్నారు. మన భవిష్యత్తు కోసం పోరాడాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పెన్షన్లు, 15 లక్షల రేషన్ కార్డులు తొలగించడం చాలా అన్యాయమన్నారు. సీఎం జగన్ సభలకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారని, సభల నుంచి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ నిరంకుశ పాలనను ప్రజలు గమనిస్తున్నారు.
ఇప్పటివరకూ బటన్ మాత్రమే నొక్కిన జగన్‌ను ప్రజలు వచ్చే ఎన్నికల్లో అదే బటన్ నొక్కి ఇంటికి పంపేస్తారన్నారు. ఏది ఏమైనా జగన్ నిరంకుశ పాలన పట్ల విసిగిపోతున్నారని, రాష్ట్ర ప్రజలు మళ్లీ చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. జనవరి 3న రాజమహేంద్రవరం రానున్న జగన్‌కు నిరసన తెలిపేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సభలో ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నేతలంతా పూలమాల వేసి నివాళులర్పించారు.
రాజమండ్రి అసెంబ్లీ స్థానానం నుంచే పోటీ చేస్తా : ఆదిరెడ్డి వాసు
తాను మొదటినుంచి పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తున్నానని, పని చేస్తూనే ఉంటానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి తాను పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాజమండ్రి అసెంబ్లీ స్థానాన్ని తనకే కేటాయిస్తున్నట్టు పార్టీ అధినాయకులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు తెలిపారన్నారు. అందుకే ఆయన ఆదేశాల మేరకు పార్టీ నియమ నింబంధనలకు లోబడి పని చేస్తున్నానన్నారు. అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తానన్నారు. అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.