![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nara Chandra Babu: ప్రజలంతా వైసీపీ ప్రభుత్వానికి తిరగబడాలి - చంద్రబాబు
Nara Chandra Babu: అధికారంలో ఉన్న వైసీపీ పాలనకు బుద్ధి చెప్పాలంటే ప్రజలు తిరుగుబాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలను బురదలో వదిలేసి సీఎం గాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు.
![Nara Chandra Babu: ప్రజలంతా వైసీపీ ప్రభుత్వానికి తిరగబడాలి - చంద్రబాబు Nara Chandra Babu Naidu Comments on YCP Government Nara Chandra Babu: ప్రజలంతా వైసీపీ ప్రభుత్వానికి తిరగబడాలి - చంద్రబాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/b7cb14a6909869d49bd71704350e13821658480596_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nara Chandra Babu: ప్రజలను బురదలో వదిలేసి సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో బాధ్యాతాయుతమైన ప్రభుత్వం లేదని అన్నారు. వరద బాధితుల దగ్గరకు వచ్చి క్షేత్ర స్థాయిలో వారి సమస్యలు అడిగి తెల్సుకోకుండా గాలిలో వచ్చి పైపైనే తిరిగి వెళ్లిపోతే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయంటూ ప్రశ్నించారు. వరద బాధితుల కష్టాలు తనను తీవ్రంగా బాధించాయని చంద్రబాబు చెప్పారు. నేను వస్తున్నానని తెలిసే ప్రభుత్వం వరద బాధితులకు రెండు వేల రూపాయల ఇస్తోందని.. అదే తెలంగాణలో 10 వేల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందని అన్నారు.
తాగుతున్న కలుషిత నీటిని చూపించిన బాధితులు
రెండో రోజు పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఆచంట మండలం కోడేరు నుంచి గోదావరిలో పంటుపై ప్రయాణించి ఆయోధ్య లంకలో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ సహాయక చర్యలపై ఆరా తీశారు. ఇద్దరు బాధితుల ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. తమకు వంతెన నిర్మించాలని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరారు. తాము తాగుతున్న కలుషిత నీటిని ఆయనకు చూపించారు.
లక్ష రూపాయల చొప్పున సాయం..
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన అనంతరం వశిష్ట గోదావరి నదిలో ప్రయాణిస్తూ.. పంటులో కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం సోంపల్లి పుష్కర ఘాట్ వద్దకు చేరుకున్నారు. రాత్రి 10 గంటలకు మానేపల్లి పల్లెపాలం చేరుకుని.. వరదలో మృతి చెందిన కారాడి రామకృష్ణ, కడలి శ్రీను కుటుంబాలను కలిసి లక్ష చొప్పున సాయం అందించారు. బాధితుల కష్టాలు విని భరోసా నింపిన చంద్రబాబు పలుచోట్ల ప్రసంగించారు.
ప్రజలు తిరుగుబాటు చేస్తే నాయకత్వం వహిస్తా..
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపత్తులో సత్వరం స్పందించి సహాయ చర్యలు అందించాను. ఈ ముఖ్యమంత్రి సీడబ్ల్యూసీ హెచ్చరించినా ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారు. ప్రజలన్ని అప్రమత్తం చేయలేనప్పపుడు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్ఖలు ఎందుకంటూ ప్రశ్నించారు. ప్రజలు తిరగబడితే తప్ప వాళ్లు సరైన పద్దతిలో ఉండరంటూ కామెంట్లు చేశారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే వారి పోరాటానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఏపీలోని పిల్ల భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. నరసాపురం ఎంపీని తన ప్రాంతానికి కూడా జగన్ రానివ్వడం లేదని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు ఎక్కడ కూడా రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దోపిడిని ప్రశ్నిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ అరాచకాలు ఇలాగే కొనసాగితే ఎక్కడా కూడా ఆయన తిరగలేడని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)