Nara Bhuvaneshwari: ఇన్నిరోజులు క్షణం యుగంలా గడిచింది, ఈ కష్ట కాలంలో అదే మాకు ఊరట - నారా భువనేశ్వరి
రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డుమార్గం ద్వారా ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరారు.

చంద్రబాబు అరెస్టుతో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన చెందామని.. తట్టుకోలేనంత బాధతో క్షణం ఒక యుగంలా గడిచిందని నారా భువనేశ్వరి అన్నారు. అయితే, ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు మాకు ఎంతో ఊరటనిచ్చిందని అన్నారు. సత్యం బలం ఎంతో చూపించిందని.. ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో, రోడ్డెక్కి చేసిన నిరసనలు, వారు చూపిన తెగువ, మాకు మరింత స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. నిజం గెలవాలి అనే పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతి సోదరుడికి, ప్రతి మహిళకు, ప్రతి పౌరుడికి శిరసు వంచి కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు. తన భర్త అరెస్టుతో 53 రోజులుగా ఇక్కడే బస చేసిన తనను మీ ఇంటి బిడ్డలా చూసుకున్న రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఆ దేవుడి దయతో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకుంటున్నట్లుగా భువనేశ్వరి స్పందించారు.

రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లికి చంద్రబాబు
రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డుమార్గం ద్వారా ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరారు. రాజమండ్రి నుంచి చంద్రబాబు వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లి గూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు నాయుడు బయటకు రాగానే ఆ గేటు వద్ద అప్పటికే ఉన్న అభిమానులు జై బాబు నినాదాలతో, కార్యకర్తలు అభిమానుల కేరింతలు కొట్టారు. పోలీసుల ఆంక్షలను చేధించుకొని వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. 52 రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడుపై అభిమానం ఉప్పొంగినట్లుగా ఆ వాతావరణం కనిపించింది. అభిమానులకు నమస్కరించి తన కాన్వాయ్ లో చంద్రబాబు నాయుడు ఉండవల్లికి బయలుదేరారు. దారిపొడవునా చంద్రబాబును చూసేందుకు ప్రజలు, కార్యకర్తలు బారులు తీరారు.
Before You Go
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
ట్రెండింగ్ వార్తలు





















